వర్క్ ఇన్‌స్పెక్టర్లే కాంట్రాక్టర్లు!
ABN , Publish Date - Oct 14 , 2025 | 01:19 AM
జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో కొందరు వర్క్ ఇన్‌స్పెక్టర్లు బినామీ పేర్లతో కాంట్రాక్టర్లుగా మారుతున్నారు.
బినామీ పేర్లతో టెండర్లు
ఏళ్ల తరబడి ఒకేచోట తిష్ఠ
క్షేత్రస్థాయిలో పనులు పర్యవేక్షించని ఏఈలు
జీవీఎంసీ ఇంజనీరింగ్‌లో మాయ
పలువురు వర్క్ ఇన్‌స్పెక్టర్లపై అధికారులకు ఫిర్యాదులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో కొందరు వర్క్ ఇన్‌స్పెక్టర్లు బినామీ పేర్లతో కాంట్రాక్టర్లుగా మారుతున్నారు. తమ బంధువుల పేర్లతో కొందరు, తమకు అస్మదీయులైన కాంట్రాక్టర్ల పేర్లతో మరికొందరు టెండర్ వేసి పనులు దక్కించుకుంటున్నారు. ఎం-బుక్ రికార్డింగ్ కోసం ఆయా పనులకు సంబంధించిన కొలతలను తీసి సంబంధిత ఏఈలకు అందజేస్తున్నారు. వర్క్ ఇన్‌స్పెక్టర్ల ఆగడాలపై స్వయంగా ఎమ్మెల్యే ఒకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా కనీసచర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు రేకెత్తిస్తోంది.
జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో పబ్లిక్ వర్క్స్, నీటి సరఫరా, యూజీడీ, ఎలక్ర్టికల్ వంటి విభాగాలు ఉంటాయి. ఆయా విభాగాల ఆధ్వర్యంలో ఏటా సుమారు రూ.500 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. అభివృద్ధిపనులతోపాటు ఇతర నిర్వహణాపరమైన పనులను పర్యవేక్షించే అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈ)లకు క్షేత్రస్థాయిలో సహాయకరంగా ఉండేందుకు వర్క్ ఇన్‌స్పెక్టర్లు పనిచేస్తుంటారు. జీవీఎంసీ పరిధిలో రెగ్యులర్ వర్క్ ఇన్‌స్పెక్టర్లు 40 మంది ఉండగా, అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న వర్క్ ఇన్‌స్పెక్టర్లు 130 మంది ఉంటారు. అవుట్‌సోర్సింగ్ విధానం అమల్లోకి రాకముందు వీరంతా కాంట్రాక్టర్ల ద్వారా ఎన్‌ఎంఆర్ విధానంలో జీవీఎంసీలో పనిచేసేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ల వద్ద పనిచేసే వారిని అవుట్‌సోర్సింగ్ కార్పొరేషన్‌లోకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. రెగ్యులర్ వర్క్ ఇన్‌స్పెక్టర్లతోపాటు అవుట్‌సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్లు తమకు కేటాయించిన వార్డుల్లో జరిగే అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షించడం, పనుల్లో నాణ్యత ఉండేలా చూడడం, పనులు పూర్తయిన తర్వాత ఎం-బుక్‌లో రికార్డు చేసేందుకు ఏఈలు వచ్చినప్పుడు కొలతలు తీసేందుకు సహకరించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీరంతా సుమారు 15, 20 ఏళ్ల నుంచి ఒకేచోట పనిచేస్తుండడంతో మంచి అవగాహన వచ్చింది. దీంతో తామే స్వయంగా ఆ పనులను చేసుకుంటే భారీగా డబ్బులు మిగులుతాయని గుర్తించారు. కొందరు వర్క్ ఇన్‌స్పెక్టర్లు తమ బంధువులను కాంట్రాక్టర్లుగా రిజిస్ర్టేషన్ చేయించి వారి పేరిట టెండర్లలో పాల్గొంటున్నారు. మరికొందరు కాంట్రాక్టర్లలో తమకు అస్మదీయులుగా ఉన్నవారి పేరుతో టెండర్లు వేయించి పనులు దక్కించుకుంటున్నారు. తమ వార్డుల్లో జరిగే పనుల కోసం ఎక్కువ లెస్‌కు వేయడం లేదా ఇతర కాంట్రాక్టర్లు పాల్గొనకుండా బెదిరించడం చేస్తున్నారు. జోన్-8 పరిధిలో ముగ్గురు అవుట్‌సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్లు తమ కుటుంబసభ్యుల పేర్లతో పనులు చేస్తున్నారు. జోన్-5ఏలో ఒకరు, జోన్-3లో ఒకరు, జోన్-7లో ముగ్గురు వర్క్ ఇన్‌స్పెక్టర్లు పనులు చేస్తున్నారు. ఇక ఏఈలు కూడా క్షేత్రస్థాయికి వెళ్లకుండా వారు (వర్క్ ఇనెస్పెక్టర్లు) ఇచ్చిన వివరాలనే ఎం-బుక్‌లో నమోదుచేసి బిల్లు కోసం పంపించేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తర నియోజకవర్గ పరిధిలోని వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఏళ్ల తరబడి ఒకేచోట ఉండిపోయారని, పలువురు అక్రమాలకు పాల్పడుతున్నందున వేరొకచోటకు మార్చాలని కోరుతూ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు స్వయంగా జీవీఎంసీ అధికారులకు లేఖ ద్వారా విజ్ఞప్తిచేశారు. కానీ అధికారులు మాత్రం ఇంతవరకూ దీనిపై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. ఇదిలావుండగా డీఈగా పనిచేస్తున్న ఒక ఇంజనీరింగ్ అధికారి సైతం తన బావమరిదిని కాంట్రాక్టర్‌గా రిజిస్ర్టేషన్ చేయించి తన జోన్ పరిధిలో భారీగా పనులు చేసుకుంటున్నారు.