మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం
ABN , Publish Date - May 15 , 2025 | 11:05 PM
మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా తెలిపారు. గురువారం అనకాపల్లి పట్టణం మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఆధునికీకరించిన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా
అనకాపల్లి టౌన్, మే 15 (ఆంధ్రజ్యోతి): మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా తెలిపారు. గురువారం అనకాపల్లి పట్టణం మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఆధునికీకరించిన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళల భద్రత, కుటుంబాల్లో జరిగే వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడంలో కౌన్సెలింగ్ సెంటర్ల పాత్ర కీలకమన్నారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ కేంద్రం ద్వారా గృహ హింస, కుటుంబ కలహాలు వంటి సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలు అందించడమే ముఖ్య లక్ష్యమన్నారు. మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్‌ను ప్రజలు డౌన్‌లోడ్ చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 2,25,521 మంది యాప్‌లో నమోదయ్యారన్నారు. మొత్తం 177 ఎస్‌ఓఎస్ కాల్స్ వచ్చాయని, ఇందులో ఆరు కుటుంబ సమస్యలకు తక్షణమే చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో మొత్తం ఐదు శక్తి బృందాలు ఏర్పాటయ్యాయన్నారు. ప్రతి బృందంలో ఒక ఎస్‌ఐ, ఐదుగురు సిబ్బంది ఉంటారని, వీరు 78 హాట్‌స్పాట్లు గుర్తించి, 271 సార్లు సందర్శించారన్నారు. ఈ సందర్భంగా 226 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారన్నారు. 39 శక్తి బీట్‌లు ప్రతి రోజు హాట్‌స్పాట్లు, పాఠశాలలు, కాలేజీలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, పోక్సో యాక్ట్, గుడ్‌టచ్ - బ్యాడ్ టచ్, మహిళా చట్టాలపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.
విద్యాసంస్థలలో శక్తి వారియర్స్ గ్రూపులు 985 ఉన్నాయని, 271 కోర్ కమిటీలు ఏర్పాటయ్యాయన్నారు. వీరు విద్యాసంస్థల్లో సమస్యలను గుర్తించి పోలీసులకు తెలియజేస్తారని చెప్పారు. ఎన్టీఆర్ హాస్పటల్ వద్ద ఉన్న వన్ స్టాప్ సెంటర్ ద్వారా బాధితులకు తాత్కాలిక ఆశ్రయం, వైద్య, చట్టపరమైన సహాయం, కౌన్సెలింగ్ సేవలందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్. మోహనరావు, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ ఇ.శ్రీనివాసులు, ఇన్‌స్పెక్టర్లు చంద్రశేఖర్, విజయ్‌కుమార్, అప్పలనాయుడు, బాల సూర్యారావు, వెంకటనారాయణ, ఎస్‌ఐలు శిరీష, యమునా, అలీ షరీఫ్, శేఖరం, వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు.