Share News

మహిళా ఖాకీ దందా

ABN , Publish Date - May 08 , 2025 | 01:06 AM

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఒక అధికారిణి తీరు వివాదాస్పదంగా మారింది.

మహిళా ఖాకీ దందా

  • మహిళా పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించే బాధితులకు

  • న్యాయం చేయడం కంటే అక్రమార్జనకే ప్రాధాన్యం

  • కుటుంబ సభ్యుల ద్వారా వసూళ్లు

  • సీపీకి నేరుగా ఫిర్యాదు చేసిన బాధితురాలు

  • విచారణకు ఆదేశాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఒక అధికారిణి తీరు వివాదాస్పదంగా మారింది. బాధితులకు న్యాయం చేయడం కంటే కాసులు వేటపైనే దృష్టిపెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన కుటుంబంలోని ఇద్దరిని మధ్యవర్తులుగా పెట్టుకుని బాధితులు/నిందితుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని సిబ్బందే పేర్కొంటున్నారు. సదరు అధికారిణిపై ఒక బాధితురాలు నేరుగా సీపీ శంఖబ్రతబాగ్చికి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది.

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మహిళలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేసేందుకు ప్రత్యేకంగా స్టేషన్‌ ఏర్పాటుచేశారు. నగరంలో ఏ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదుచేసినాసరే అలాంటి కేసులను దర్యాప్తు నిమిత్తం మహిళా పోలీస్‌ స్టేషన్‌కు బదలాయిస్తుంటారు. అక్కడున్న అధికారులు భార్యాభర్తలకు సంబంధించిన వివాదాలైతే వారితో మాట్లాడి స్వయంగా కౌన్సెలింగ్‌ చేయడం, సోషల్‌ వర్కర్లు ద్వారా కౌన్సెలింగ్‌ చేయించడం, కుటుంబ సభ్యులు, పెద్దల సమక్షంలో సమస్యను పరిష్కరించుకోవాలని సమయం ఇవ్వడం చేస్తుంటారు. భార్యాభర్తల గొడవలు అయితే సాధ్యమైనంతవరకు కేసు లేకుండానే రాజీ చేసుకునేలా తమవంతు కృషిచేస్తుంటారు. ఒకవేళ కేసు నమోదైనట్టయితే ఆయా కేసులను లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకునేలా సూచిస్తారు. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ ఇక తాము కలిసి జీవించలేమని స్పష్టంచేస్తే మాత్రం కేసు కట్టి దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్‌ వేస్తారు. అయితే స్టేషన్‌లో పనిచేస్తున్న ఒక అధికారిణి మాత్రం ఫిర్యాదులు/కేసుల్లో బాధితులు ఎవరనేది గుర్తించి వారికి న్యాయం చేయడంపై దృష్టిపెట్టకుండా ఆ కేసులో ఏ వర్గం నుంచి డబ్బులు వచ్చే అవకాశం ఉందో గుర్తించి వారి తరఫున వకల్తా పుచ్చుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. తనను ప్రసన్నం చేసుకుంటే కుటుంబం ఛిన్నాభిన్నమైపోతుందనే స్పృహ కూడా లేకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తుంటారని స్టేషన్‌ సిబ్బందే పేర్కొంటుండడం విశేషం. సదరు మహిళా అధికారి తెలివిగా తన కుటుంబ సభ్యులనే మధ్యవర్తులుగా పెట్టుకుని స్టేషన్‌ బయట వారిని కలిసి డబ్బులు అందజేయాలని సూచిస్తుంటారంటున్నారు. తాజాగా ఒక మహిళ తన భర్తపై ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, 498 (ఏ) సెక్షన్‌ కింద కేసు నమోదుచేసి దర్యాప్తు కోసం మహిళా పోలీస్‌ స్టేషన్‌కు బదలాయించారు. ఆ కేసు దర్యాప్తు బాధ్యతలు తీసుకున్న సదరు అధికారిణి ఆ కేసులో భర్త నుంచి డబ్బులు తీసుకుని, విడాకులు తీసుకోవాలని భార్యపై ఒత్తిడి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. తన భర్త తనతో కాపురం చేసేలా చర్యలు తీసుకోవాలని తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తే విడాకులు ఇవ్వాలని చెబుతారేమిటని బాధితురాలు సదరు పోలీస్‌ అధికారిని ప్రశ్నించారు. దీంతో ‘అతను విడాకులు ఇచ్చేస్తానంటే నేనేం చేయాలని’ సదరు అధికారిని ఎదురు ప్రశ్నించారు. ఆ తరువాత బాధితురాలికి ఒక ప్రైవేటు వ్యక్తి ఫోన్‌ చేసి మహిళా అధికారిణి చెప్పినట్టు చేయాల్సిందేనని, కాదని ఎంత తాపత్రయపడినాసరే ఆమె చెప్పినట్టే జరుగుతుందని, కాబట్టి భర్తతో విడాకులు తీసుకోవాలని ఒత్తిడి చేశారు. ఈ కేసులో బాధితురాలి భర్త నుంచి సదరు మహిళా అధికారిణికి డబ్బులు అందాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో బాధితురాలు మంగళవారం రాత్రి నేరుగా సీపీ శంఖబ్రతబాగ్చికి ఫోన్‌ చేసి తన పరిస్థితితోపాటు మహిళా పోలీస్‌ అధికారిణి తరఫున ప్రైవేటు వ్యక్తి ఫోన్‌ చేసి విడాకులు తీసుకోవాలని ఒత్తిడి చేశారని ఫిర్యాదు చేశారు. సీపీ వెంటనే నార్త్‌ సబ్‌డివిజన్‌ ఏసీపీ అప్పలరాజుకు ఫోన్‌ చేసి ఆ కేసును వేరొక అధికారికి అప్పగించడంతోపాటు బాధితురాలికి ఫోన్‌ చేసి మహిళా పోలీస్‌ తరఫున మాట్లాడుతున్నానని చెప్పిన వ్యక్తిపై కేసు నమోదుచేయాలని ఆదేశించారు. అలాగే మహిళా పోలీస్‌ అధికారిపై ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై సీపీ శంఖబ్రతబాగ్చి వివరణ కోరగా తనకు ఒక మహిళ ఫోన్‌ చేసి, మహిళా పోలీస్‌ స్టేషన్‌లోని అధికారిపై ఫిర్యాదుచేయడం వాస్తవమేనని, ప్రైవేటు వ్యక్తిపై కేసు నమోదు చేయాలని ఆదేశించామన్నారు. బాధితురాలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

Updated Date - May 08 , 2025 | 01:06 AM