Share News

మహిళలకు రూ.5.35 కోట్ల లబ్ధి

ABN , Publish Date - Sep 17 , 2025 | 01:04 AM

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పథకం ప్రారంభించిన తరువాత నెల రోజుల్లో జిల్లాలోని రెండు డిపోల నుంచి నడుస్తున్న బస్సుల్లో 14 లక్షల 86 వేల 513 మంది మహిళలు ఉచితంగా ప్రయాణం సాగించారు. వీరికి రూ.5.35 కోట్ల లబ్ధి చేకూరింది. ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెరిగింది. కొన్నిరూట్లలో ఓఆర్‌ వంద శాతం దాటిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

మహిళలకు రూ.5.35 కోట్ల లబ్ధి
మహిళలకు జీరో ఫేర్‌ టికెట్‌ ఇస్తున్న కండక్టర్‌

స్త్రీ శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ఆడపడుచులు

నెల రోజుల్లో 14,86,513 మంది ఉచిత ప్రయాణం

అనకాపల్లి డిపోలో వంద శాతం దాటిన ఓఆర్‌

అనకాపల్లి టౌన్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి):

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పథకం ప్రారంభించిన తరువాత నెల రోజుల్లో జిల్లాలోని రెండు డిపోల నుంచి నడుస్తున్న బస్సుల్లో 14 లక్షల 86 వేల 513 మంది మహిళలు ఉచితంగా ప్రయాణం సాగించారు. వీరికి రూ.5.35 కోట్ల లబ్ధి చేకూరింది. ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెరిగింది. కొన్నిరూట్లలో ఓఆర్‌ వంద శాతం దాటిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి రాష్ట్ర ప్రభుత్వం గత నెల 15వ తేదీన స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆ రోజు నుంచి సెప్టెంబరు 15వ తేదీ వరకు జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం డిపోల నుంచి నడుస్తున్న పల్లె వెలుగు, అలా్ట్ర పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, ఆర్డినరీ, మెట్రో కేటగిరీలకు చెందిన 161 బస్సుల్లో మొత్తం 14,86,513 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. అనకాపల్లి డిపో నుంచి 89 బస్సుల్లో 9,39,315 మంది మహిళలు, నర్సీపట్నం డిపో నుంచి 72 బస్సుల్లో 5,47,198 మంది మహిళలు ప్రయాణించారు. జీరో ఫేర్‌ టికెట్‌ల ప్రకారం ఈ నెల రోజుల కాలంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడం ద్వారా మహిళలకు రూ.5.35 కోట్ల లబ్ధి చేకూరింది. కాగా స్ర్తీ శక్తి పథకం అమలుకు ముందు జిల్లాలోని ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) 70 శాతం ఉండగా... ఈ పథకం అమలులోకి వచ్చిన తరువాత 94 శాతానికి పెరిగింది. అనకాపల్లి డిపోలో శత శాతం ఓఆర్‌ నమోదు కావడం గమనార్హం. నెల రోజుల వ్యవధిలో 11 రోజులు వంద శాతం పైబడి ఓఆర్‌ నమోదు అయ్యింది. గతంతో పోలిస్తే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య రెట్టింపు అయ్యిందని అధికారులు చెబుతున్నారు. స్ర్తీ శక్తి పథకాన్ని అమలు చేస్తున్న ఐదు రకాల బస్సుల్లో రోజు వారీ ప్రయాణికులను పరిశీలిస్తే 60 శాతం మంది మహిళలు, 40 శాతం మంది పురుషులు వుంటున్నారు.

చాలా సంతోషంగా ఉంది

విజయలక్ష్మి, కొండకర్ల, అచ్యుతాపురం మండలం

రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం చాలా బాగుంది. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు టికెట్‌ భారం తగ్గింది. అంతేకాకుండా పిల్లలతో ఎక్కడికైనా వెళ్లడానికి అవకాశం కుదిరింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ప్రభుత్వం.. నిత్యావసర సరుకుల ధరలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నాను.

ఆర్టీసీకి ఆదాయం పెరిగింది

వి.ప్రవీణ, డీపీటీవో, అనకాపల్లి

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. గతంలో అనకాపల్లి జిల్లాలో రెండు డిపోల ద్వారా రోజుకు రూ.12-13 లక్షల ఆదాయం వచ్చేది. స్త్రీ శక్తి పథకం అమలు తరువాత జీరో ఫేర్‌ టికెట్లతో కలుపుకుని రూ.24 లక్షల ఆదాయం వస్తున్నది. ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు రూ.5.35 కోట్ల లబ్ధి పొందారు. ఈ మొత్తం ప్రభుత్వం నుంచి సంస్థకు వస్తుంది.

Updated Date - Sep 17 , 2025 | 01:04 AM