రోడ్డెక్కి డ్వాక్రా మహిళలు
ABN , Publish Date - Oct 07 , 2025 | 01:40 AM
తమ పేరుతో బ్యాంకు నుంచి రుణాలు మంజూరు చేసి, బినామీ ఖాతాలకు మళ్లించుకుని స్వాహా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, అదే విధంగా తమకు ‘నో డ్యూస్ సర్టిఫికెట్’ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని సింహాద్రిపురం గ్రామానికి చెందిన రెండు డ్వాక్రా సంఘాల సభ్యులు సోమవారం గోవాడలోని స్టేట్ బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు.
గోవాడలో స్టేట్ బ్యాంకు ఎదుట ఆందోళన
రుణాల స్వాహా పర్వంలో నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వాలని డిమాండ్
బ్యాంకు తెరవకుండా అడ్డగింత
రంగంలోకి పోలీసులు, రాజకీయ నేతలు
డ్వాక్రా మహిళలకు న్యాయం చేయాలని బ్యాంకు అధికారులకు సూచన
ఆందోళన విరమించిన మహిళలు
వెలుగు వీవోఏపై కేసు నమోదు చేసిన పోలీసులు
చోడవరం, అక్టోబరు6(ఆంధ్రజ్యోతి):
తమ పేరుతో బ్యాంకు నుంచి రుణాలు మంజూరు చేసి, బినామీ ఖాతాలకు మళ్లించుకుని స్వాహా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, అదే విధంగా తమకు ‘నో డ్యూస్ సర్టిఫికెట్’ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని సింహాద్రిపురం గ్రామానికి చెందిన రెండు డ్వాక్రా సంఘాల సభ్యులు సోమవారం గోవాడలోని స్టేట్ బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. బ్యాంకును తెరవనివ్వకుండా మేనేజర్‌తోపాటు సిబ్బందిని అడ్డుకున్నారు. పోలీసులు, స్థానిక రాజకీయ నాయకులు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఇందుకు సంబంధించి పూర్వాపరాలిలా వున్నాయి.
మండలంలోని సింహాద్రిపురం పంచాయతీ పరిధిలోని పలు డ్వాక్రా గ్రూపుల పేరుతో 2024 మార్చిలో అప్పటి వెలుగు వీవోఏ వరలక్ష్మి, సీసీ తాతబాబు కలిసి, నాటి గోవాడ స్టేట్ బ్యాంకు మేనేజర్ సహకారంతో సుమారు రూ.40 లక్షల రుణాలు మంజూరు చేయించారు. ఈ విషయం ఆయా సంఘాల సభ్యులకు తెలియకుండా సొమ్మును బినామీ ఖాతాలకు మళ్లించుకున్నారు. ఈ వ్యవహారం గత ఏడాది నవంబరులో బయటకు పొక్కడంతో దీనిపై డ్వాక్రా మహిళలు ఆందోళన చేశారు. అంతేకాక నిధుల స్వాహాపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వీవోఏపై కేసు నమోదు చేశారు. డీఆర్‌డీఏ అధికారులు వెలుగు సీసీ తాతబాబును సస్పెండ్ చేసి అతనిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. రుణాల స్వాహాపర్వానికి సంబంధించి సింహాద్రిపురానికి చెందిన సిద్ధి వినాయక, శ్రీరామ డ్వాక్రా గ్రూపుల మహిళలు, బ్యాంకులో తమకు ఎలాంటి రుణం లేదంటూ నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వాలని కొద్ది రోజులుగా బ్యాంకు అధికారులు, వెలుగు ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా బ్యాంకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో, డ్వాక్రా మహిళలు సోమవారం ఉదయం గోవాడ స్టేట్ బ్యాంకు వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. బ్యాంక్ మేనేజర్‌తోపాటు సిబ్బందిని లోపలికి వెళ్లనివ్వలేదు. దీనితో బ్యాంక్ మేనేజర్ సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ జోగారావు సిబ్బంది వచ్చి మహిళలతో మాట్లాడారు. కానీ అడ్డుతొలగేది లేదని మహిళలు స్పష్టం చేశారు. దీంతో సీఐ అప్పలరాజు వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. బ్యాంకు, వెలుగు ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని, బ్యాంకును తెరవనివ్వకుండా అడ్డుకోవడం సరికాదని అన్నారు. అందరూ స్టేషన్‌కు రావాలని సూచించారు. ఎట్టకేలకు మద్యాహ్నం ఒంటి గంట సమయంలో బ్యాంకును తెరిచారు. అప్పటికే సమాచారం అందుకున్న బ్యాంకు ఆర్‌ఎం, ఇతర అధికారులు గోవాడ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న డ్వాక్రా సభ్యులు మళ్లీ బ్యాంకుకు వచ్చి అధికారులతో మాట్లాడారు. తమ పేరుతో రుణాలు మంజూరు చేసి, నిధుల స్వాహా జరిగి ఏడాది దాటినా చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇద్దరు మేనేజర్లు మారినా తమకు న్యాయం జరగలేదన్నారు. నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఈ సర్టిఫికెట్ ఇవ్వకపోతే కొత్తగా రుణం మంజూరుకాదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లం రామప్పారావు, ఏడువాక లక్ష్మణకుమార్, సత్యారావు తదితర నాయకులు బ్యాంకుకు వచ్చి అధికారులతో మాట్లాడారు. మహిళలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అంతవరకు ఆందోళన విరమించాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు.
వెలుగు వీవోఏపై కేసు
గోవాడ స్టేట్ బ్యాంకులో డ్వాక్రా రుణాల స్వాహా వ్యవహారానికి సంబంధించి వీవోఏ వరలక్ష్మిపై కేసు నమోదు చేసినట్టు సీఐ బి.అప్పలరాజు తెలిపారు. ఈ వ్యవహారంలో గోవాడ స్టేట్ బ్యాంక్ మేనేజర్, ఇతర సిబ్బందితోపాటు, వెలుగు అధికారుల పాత్రపైనా విచారణ చేయనున్నటు ఆయన వెల్లడించారు.