డీఎస్సీలో మహిళలదే పైచేయి
ABN , Publish Date - Sep 27 , 2025 | 01:09 AM
మెగా డీఎస్సీ ద్వారా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో మహిళలే అధికం.
జిల్లాలో ఉపాధ్యాయులుగా ఎంపికైనవారు 1,268
మహిళలు 718, పురుషులు 550 మంది
ఇక నియోజవర్గాల వారీగా చూస్తే నర్సీపట్నం నియోజకవర్గం నుంచి 171 మంది టీచర్లుగా ఎంపిక
అతి తక్కువగా విశాఖ నార్త్ నుంచి నలుగురు..
విశాఖపట్నం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి):
మెగా డీఎస్సీ ద్వారా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో మహిళలే అధికం. మొత్తం 1,268 మందిలో 718 మంది (56.62 శాతం) మహిళలు కాగా 550 మంది (43.33 శాతం) పురుషులు ఉన్నారు. జడ్పీ, ప్రభుత్వ, మునిసిపల్, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ)గా 574 మంది ఎంపిక కాగా అందులో 382 మంది మహిళలు. అలాగే ఏజెన్సీలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 335 పోస్టులకుగాను 239 మంది మహిళలు ఎంపికైనట్టు విద్యా శాఖ వర్గాలు తెలిపాయి. స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో వ్యాయామ, గణితం, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్‌లో మినహా మిగిలిన వాటిల్లో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఎంపికయ్యారు. దాదాపు అన్ని కేడర్‌లలో టాప్ ర్యాంకర్లు మహిళలు కావడం గమనార్హం.
ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్, ప్రభుత్వ, మునిసిపల్, జువెనైల్, గిరిజన సంక్షేమ శాఖల్లో మొత్తం 1,139 పోస్టులకుగాను 1,134 పోస్టులు భర్తీ కాగా, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలోని గురుకులాల్లో 134 మందిని ఎంపిక చేశారు. నియోజకవర్గాల వారీగా ఎంతమంది ఎంపికయ్యారనే వివరాలను విద్యా శాఖ రూపొందించింది. అన్ని కేడర్లులో కలిసి అత్యధికంగా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 174 అభ్యర్థులు ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఆ తరువాత పాయకరావుపేట నియోజకవర్గం నుంచి 147 మంది, చోడవరంనుంచి 145 మంది, భీమిలి నియోజకవర్గంలో 132, మాడుగులలో 130 మంది, విశాఖపట్నం పశ్చిమ నుంచి 77 మంది, ఎలమంచిలి, అరకు నియోజకవర్గాల నుంచి 61 మంది చొప్పున, గాజువాక నుంచి 57 మంది, అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గాల నుంచి 49 మంది చొప్పున, విశాఖపట్నం తూర్పు నుంచి 28 మంది, విశాఖపట్నం సౌత్ నుంచి 25 మంది, అతి తక్కువగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి నలుగురు ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఇతర జిల్లాల నుంచి నాన్‌లోకల్ కోటాలో 93 మంది ఎంపికయ్యారు. కాగా ఉపాధ్యాయులుగా నియామక పత్రాలు అందుకున్న వారికి వచ్చే నెల మూడో తేదీ నుంచి శిక్షణ ఇస్తామని డీఈవో ఎన్.ప్రేమ్‌కుమార్ తెలిపారు.
ఆ సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
ఏసీబీ కేసులో ఇద్దరికీ రిమాండ్
మల్కాపురం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి):
లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ములగాడ మండల సర్వేయర్ రొంగలి సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్ కర్రి నగేష్‌లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ములగాడ మండల తహశీల్దార్ రమేష్‌నాయుడు ఇక్కడ జరిగిన ఘటన వివరాలు శనివారం కలెక్టర్‌కు నివేదించారు. ఈ మేరకు వారిని సస్పెండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు సర్వేయర్ రొంగలి సత్యనారాయణను, జూనియర్ అసిస్టెంట్ కర్రి నగేష్‌లను ఏసీబీ కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు ఆదేశించారు.
4న జడ్పీ సర్వసభ్య సమావేశం
విశాఖపట్నం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి):
జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వచ్చే నెల నాలుగో తేదీన చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరుగుతుందని సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. జిల్లాలో అన్ని విభాగాల అధికారులు పూర్తి నివేదికలతో రావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశానికి జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీల, గౌరవ సభ్యులు, అధికారులు హాజరుకావాలని కోరారు.
ముసురు
అల్పపీడనం ప్రభావంతో వర్షాలు
నేడు భారీవర్షసూచన
విశాఖపట్నం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి):
బంగాళాఖాతంలో రెండు రోజులుగా కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా, సాయంత్రానికి వాయుగుండంగా మారింది. ఆ ప్రభావంతో జిల్లాలో ఉదయం నుంచి ముసురు వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం అన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. వాయుగుండం శనివారం ఉదయం గోపాల్‌పూర్‌కు సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీవర్షాలు కురుస్తాయని తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించింది.