Share News

శీతాకాలం.. జరభద్రం

ABN , Publish Date - Nov 29 , 2025 | 01:02 AM

మన్యంలో చలి గజగజ వణికిస్తున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఏకసంఖ్యలో నమోదవుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలోనూ శీతలగాలులు వీస్తున్నాయి. డిసెంబరు, జనవరి మాసాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశముందని చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గిరిజన ప్రాంత వాతావరణం పర్యాటకులను ఆహ్లాదాన్ని పంచుతున్నప్పటికీ స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రస్తుతం గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో చలి తీవ్రతకు చిన్నపిల్లలు, మహిళలు, గర్భిణులు, వృద్ధులు ఆరోగ్యపరంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత శీతాకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

శీతాకాలం.. జరభద్రం
ఉన్నిదుస్తులు ధరించుకుని పాఠశాలకు వెళుతున్న విద్యార్థులు

వ్యాధులు విజృంభించే సీజన్‌

ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు

ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి

ఉన్ని దుస్తులు ధరించాలి

వైద్య నిపుణులు సూచనలు, సలహాలు

చింతపల్లి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):

మన్యంలో చలి గజగజ వణికిస్తున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఏకసంఖ్యలో నమోదవుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలోనూ శీతలగాలులు వీస్తున్నాయి. డిసెంబరు, జనవరి మాసాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశముందని చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గిరిజన ప్రాంత వాతావరణం పర్యాటకులను ఆహ్లాదాన్ని పంచుతున్నప్పటికీ స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రస్తుతం గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో చలి తీవ్రతకు చిన్నపిల్లలు, మహిళలు, గర్భిణులు, వృద్ధులు ఆరోగ్యపరంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత శీతాకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

చలికాలం ఎదురయ్యే సమస్యలు

చిన్నపిల్లులు, పెద్దవారిలోనూ ప్రధానంగా జలుబు, గొంతు సమస్యలు అధికమవుతాయి. వైరల్‌ జ్వరాలు వ్యాప్తి చెందుతాయి. పెదవులు పగిలిపోతాయి. వాటి నుంచి రక్తస్రావం జరుగుతుంది. చర్మం పొడి బారిపోతోంది. చర్మంపై దురద, తామర వంటి సమస్యలు వచ్చే అవకాశముంది. 45 ఏళ్లు పైబడినవారు, వృద్ధుల్లో కీళ్లనొప్పులు, కీళ్లవాపుల సమస్యలు కలుగుతాయి. చన్నీళ్లతో కాలకృత్యాలు తీర్చుకోవడం, మంచులో ప్రయాణం చేయడం వల్ల పంటి సలుపులు కలుగుతాయి. ఆస్తమా రోగులు శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా మారుతోంది. చిన్నపిల్లలో జలుబు ఎక్కువై నాసికరంధ్రాలు మూసుకుపోయి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. గుండె, శ్వాసకోస సంబంధిత వ్యాధుల వారిలోనూ సమస్యలు అధికమవుతాయి. రక్తపోటు వున్న వారిలో చెమట బయటకు రాకపోవడంతో బీపీ పెరిగే అవకాశముంది. కుంపటి, చలి మంటల వల్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

శీతాకాలం మంచులో తడవడం, చల్లగాలుల్లో తిరగడం చేయకూడదు. చిన్నపిల్లలు చల్లగాలుల్లో ఆడుకోనివ్వరాదు. శరీరం అంతా కప్పబడే స్వెర్టర్లు, స్కార్ప్‌, మంకీటోపీలు, గ్లౌజులు, సాక్స్‌ ధరించుకోవాలి. ఒకేచోట ఎక్కవ సమయం కూర్చోని వుండకుండా చలి, మంచు తగలకుండా ఇళ్లలోనే నడవాలి. జలుబు అధికంగా వుంటే ఆవిరిపట్టాలి. గొంతు సమస్యలున్నవారు గ్లాసు గోరువెచ్చని నీళ్లలో చెంచా ఉప్పు వేసి కలుపుకుని పుక్కలించాలి. చిన్నపిల్లలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా వుంటే నాసిక రంధ్రాల్లో నాజల్‌డ్రాప్స్‌ గాని, ఉప్పు నీటి చుక్కలు వేయాలి. వేడినీళ్లు తాగాలి. నిలువ ఆహారం తినకూడదు. ఆహారం వేడిగా వున్నప్పుడే తినడం చాలా మంచిది. వారపు సంతల్లో లభించే నిలువ మాంసాహారం కొనుక్కొని ఆహారంగా తీసుకోరాదు. పెదవులు పగిలిపోకుండా గ్లిజరిన్‌ కలిగిన లిప్‌బాబ్‌లుగాని, వెన్న, కొబ్బరి నూనెగాని రాసుకోవాలి. రాత్రి పడుకునే ముందు రాసుకోవడం చాలా మంచిది. వాకింగ్‌ చేసేవారు విధిగా షూ, గ్లౌజులు, ఉన్నిదుస్తులు, మంకీటోపి ధరించుకోవాలి. శీతలపానీయాలు, ఫాస్ట్‌ఫుడ్‌ తగ్గించాలి. ఆస్తమా ఉన్నవారు చల్లగాలులు, మంచుకు పూర్తిగా దూరంగా వుండాలి. ద్విచక్రవాహనదారులు ప్రత్యేక రక్షణ దుస్తులతో పాటు హెల్మెంట్‌ ధరించుకోవాలి. కుంపటి, చలి మంటలు పెట్టుకునే సమయంలో అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శీతాకాలం గాయాలు త్వరగా నయంకావు.

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

డాక్టర్‌ ఎం. నీలవేణి, మెడికల్‌ సూపరింటెండెంట్‌, చింతపల్లి.

శీతాకాలం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రస్తుతం జలుబు, గొంతునొప్పి, వైరల్‌ జ్వరాలు, చర్మవ్యాధులతో రోగులు అధికంగా ఆస్పత్రికి వస్తున్నారు. చలి, మంచుకు దూరంగా వుంటే వ్యాధులను నియంత్రించుకోవచ్చు. గుండె, శ్వాస, రక్తపోటు రోగులు క్రమంగా వైద్యపరీక్షలు చేయించుకోవాలి. చలి ఎక్కువగా వుందని సారా, కల్లు, ఆల్కాహాల్‌ అధికంగా సేవించకూడదు. ఆధికంగా సేవిస్తే డీహైడ్రేషన్‌కి గురై అనారోగ్య సమస్యలు అధికమవుతాయి.

కూరగాయల ఆహారం తీసుకోవాలి

బి.దివ్యసుధ, గృహవిజ్ఞాన శాస్త్రవేత్త, రాస్‌ కేవీకే, తిరుపతి.

శీతాకాలం కూరగాయలను ఆహారంగా తీసుకోవడం చాలా ఉత్తమం. వేడినీళ్లు, బార్లీ, వేపుడుజావ, రాగి, సామ, జొన్న, కొర్ర జావలు అధికంగా తీసుకోవాలి. వ్యాధినిరోధక శక్తిని పెంచే ఓట్స్‌, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, క్యాలీప్లవర్‌, తేనె తీసుకోవాలి. మాంసాహారం మితంగా తీసుకోవాలి. ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో అల్లం, వెళ్లుల్లి, మిరియాలు వుండే విధంగా చూసుకోవాలి. టీ,కాఫీలు అధికంగా తాగరాదు. విటమిన్‌ ఏ,సీలువుండే పండ్లు, పండ్లరసాలు తీసుకోవడం మంచిది.

Updated Date - Nov 29 , 2025 | 01:02 AM