Share News

అప్పన్న భూములకు రెక్కలు

ABN , Publish Date - Oct 26 , 2025 | 01:01 AM

రాష్ట్ర ప్రభుత్వం అవసరమైనప్పుడల్లా సింహాచలం దేవస్థానానికి చెందిన భూములను తీసుకుంటోంది. వాటికి ప్రత్యామ్నాయ భూముల కేటాయింపులో మాత్రం తీవ్ర తాత్సారం చేస్తోంది.

అప్పన్న భూములకు రెక్కలు

అడవివరంలో సెంట్రల్‌ జైలు కోసం అప్పట్లో 100 ఎకరాలు తీసుకున్న ప్రభుత్వం

అందుకు ప్రత్యామ్నాయంగా మధురవాడలో 106.47 ఎకరాలు కేటాయింపు

ఇప్పుడు అవి కూడా వెనక్కి...

ఐటీ కంపెనీల కోసం తాజాగా అడవివరంలో మరో 150 ఎకరాలు తీసుకోవాలని నిర్ణయం

ప్రత్యామ్నాయంగా గాజువాక, ములగాడ మండలాల్లో భూముల కేటాయింపు

విలువ రూ.9,320 కోట్లు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం అవసరమైనప్పుడల్లా సింహాచలం దేవస్థానానికి చెందిన భూములను తీసుకుంటోంది. వాటికి ప్రత్యామ్నాయ భూముల కేటాయింపులో మాత్రం తీవ్ర తాత్సారం చేస్తోంది. అనేక ఏళ్లు గడిచాక ఎక్కడో ఒకచోట ఇచ్చి చేతులు దులుపుకొంటోంది. పదిహేనేళ్ల క్రితం సెంట్రల్‌ జైలు నిర్మాణం కోసం అడవివరంలో భూములు తీసుకొని, ప్రత్యామ్నాయంగా మధురవాడలో భూములు ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ వాటిని వెనక్కి తీసుకుంది.

ఇటీవల ఐటీ కంపెనీలకు భూములు భారీగా అవసరం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సింహాచలం దేవస్థానం భూములపై దృష్టిపెట్టింది. అడవివరం సర్వే నంబరు 275లో 150 ఎకరాలను తీసుకుంది. అక్కడ ప్రస్తుతం మార్కెట్‌ విలువ చదరపు గజం రూ.17 వేలు లెక్కన చూపించి, ఆ భూముల విలువ రూ.1,234.20 కోట్లుగా పేర్కొంది. గతంలో అంటే 2006 కొత్త సెంట్రల్‌ జైలు నిర్మాణం కోసం అదే అడవివరంలో 100 ఎకరాలు తీసుకుంది. దానికి ప్రత్యామ్నాయంగా మధురవాడలోని సర్వే నంబర్లు 420, 424లలో 106.47 ఎకరాలు ఇచ్చింది. వాటిని కూడా ఇప్పుడు ఐటీ కంపెనీలకు అవసరమని గత నెలలో వెనక్కి తీసుకుంది. అక్కడ చదరపు గజం రేటు రూ.44 వేలుగా ఉందని, వాటి విలువ రూ.2,267.38 కోట్లుగా చూపించింది. అడవివరంలో 150 ఎకరాలు, మధురవాడలో 106.47 ఎకరాలు మొత్తం 256.47 ఎకరాలు కాగా వాటి విలువ రూ.3,501.58 కోట్లుగా వెల్లడించింది.

ప్రత్యామ్నాయంగా మళ్లీ ఆ కొండల్లోనే

పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తీవ్రంగా కృషిచేస్తున్న సంగతి తెలిసిందే. 2008 సర్వే లెక్కల ప్రకారం 12,149 మంది ఆక్రమించిన దేవస్థానం భూమి విస్తీర్ణం 420 ఎకరాలు. దానికి ప్రత్యామ్నాయంగా 547 ఎకరాలు ఇవ్వడానికి ప్రతిపాదిస్తే దానిని దేవస్థానం చైౖర్మన్‌ అశోక్‌గజపతిరాజు తొలుత వ్యతిరేకించారు. ఆ తరువాత గాజువాక, మల్కాపురం, గొల్లలపాలెం, పెదగంట్యాడల్లో మొత్తం 610.89 ఎకరాల కొండలను ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. వాటి విలువ రూ.5,231 కోట్లుగా న్యాయస్థానానికి తెలిపింది. అక్కడ ఆమోదం లభిస్తే వాటిని బదలాయిస్తారు.

ఇప్పుడు తాజాగా ఐటీ కంపెనీల కోసం తీసుకున్న 256.47 ఎకరాలకు ప్రత్యామ్నాయంగా మళ్లీ అదే కొండల్లో అదే ప్రాంతాల్లో అంటే గాజువాక, ములగాడ మండలాల్లోని మల్కాపురం, గొల్లలపాలెం, ములగాడల్లోని అవే సర్వే నంబర్లలో 370.9 ఎకరాలు ఇవ్వడానికి జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ ప్రతిపాదించారు. గాజువాకలో గజం రూ.32 వేలు, గొల్లలపాలెంలో రూ.22 వేలు, మల్కాపురంలో రూ.17 వేలు చొప్పున మార్కెట్‌ ధర నిర్ణయించారు. ఈ లెక్కన ప్రత్యామ్నాయంగా ఇచ్చే భూమి విలువ రూ.4,089.19 కోట్లు అని పేర్కొన్నారు. అంటే పాతవి, కొత్తవి కలిపి రూ.9,320 కోట్ల విలువైన భూములు దేవస్థానానికి ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అయితే అవన్నీ కొండలని, పైగా పారిశ్రామిక ప్రాంతానికి దగ్గరగా ఉన్నాయని, నివాసాలకు ఉపయోగపడవని దేవస్థానం అధికారులు పెదవి విరుస్తున్నారు. కొన్నాళ్ల తరువాత ఆ భూములను కూడా వెనక్కి తీసుకున్నా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - Oct 26 , 2025 | 01:01 AM