విమాన టికెట్లకు రెక్కలు
ABN , Publish Date - Dec 07 , 2025 | 01:19 AM
‘ఇండిగో’ విమాన సంస్థలో ఏర్పడిన సంక్షోభంతో మూడు రోజులుగా దేశవ్యాప్తంగా వందలాది సర్వీసులు రద్దయిపోతున్నాయి.
‘ఇండిగో సంక్షోభంతో భారీగా పెరిగిన ధరలు
ఢిల్లీ-విశాఖపట్నం టికెట్ ధర రూ.73 వేల నుంచి రూ.లక్ష
చెన్నై-విశాఖ ధర రూ.49 వేలు
హైదరాబాద్-విశాఖ 10,468 నుంచి రూ.33 వేలు
విశాఖపట్నం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి):
‘ఇండిగో’ విమాన సంస్థలో ఏర్పడిన సంక్షోభంతో మూడు రోజులుగా దేశవ్యాప్తంగా వందలాది సర్వీసులు రద్దయిపోతున్నాయి. తొలి రోజు 175 విమానాలు, రెండో రోజు మరో 175, మూడో రోజు 500కు పైగా విమానాలు రద్దయ్యాయి. విశాఖపట్నం విమానాశ్రయంలో చూసుకుంటే ఒక్క శనివారం తొమ్మిది ఇండిగో సర్వీసులు ఆగిపోయాయి. విమాన సర్వీస్‌లలో ఎక్కువ ఇండిగో విమానాలే ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుబాటులో ఉన్న ఇతర విమానాల్లో గమ్య స్థానాలకు చేరడానికి ప్రయత్నిస్తున్నారు. దాంతో ఆయా సంస్థలు టికెట్ల ధరలు భారీగా పెంచేశాయి. ఇండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య చివరి వన్డే క్రికెట్ మ్యాచ్ శనివారం విశాఖపట్నంలో జరగడంతో దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఇక్కడకు రావడానికి ప్రయత్నించారు. దాంతో టికెట్ల ధరలు మరింత పెరిగిపోయాయి. ఢిల్లీ నుంచి శనివారం విశాఖపట్నం రావడానికి టికెట్ ధర కనీసం రూ.73,716 కాగా అత్యధికంగా రూ1,00,602 పలికింది. చెన్నై నుంచి విశాఖపట్నం రావడానికి టికెట్ రేటు రూ.49,033 పలికింది. ఇక హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రావడానికి రూ.10,446 నుంచి రూ.33,769 ధర పలికింది. ఆదివారం విశాఖ నుంచి హైదరాబాద్, చెన్నై, ఢిల్లీకి వెళ్లాల్సిన టికెట్ల ధరలు కూడా అధికంగానే ఉన్నాయి.
ఇండిగోలో ఏర్పడిన అంతర్గత సంక్షోభం కారణంగా ఇదంతా జరిగిందని, టికెట్లను రీషెడ్యూలింగ్ బుక్ చేసుకోవడానికి ప్రయాణికులకు అవకాశం కల్పించాలని కేంద్ర పౌర విమానయాన శాఖకు ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.విజయమోహన్ విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఈ సమయంలో టికెట్ల ధరలను అడ్డగోలుగా పెంచకుండా నియంత్రణ విధించాలని కోరారు.
మృతదేహంతో మూడు రోజులు
తల్లి పక్కనే మానసిక దివ్యాంగుడు
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
గాజువాక (విశాఖపట్నం), డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి):
తన తల్లి మృతిచెందిందని తెలియని ఓ మానసిక దివ్యాంగుడైన కుమారుడు మూడు రోజుల పాటు మృతదేహం పక్కనే ఉన్నాడు. ఇందుకు సంబంధించి నగర పరిధిలోని గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గాజువాక సమీపంలోని గొంతినవానిపాలెంలో పచ్చికోరు లక్ష్మి (65), తన చిన్న కుమారుడు సంతోషరావుతో కలిసి నివసిస్తోంది. పెద్ద కుమారుడు నాగేశ్వరరావు వారికి కొద్దిదూరంలోని దిబ్బపాలెంలో ఉంటున్నాడు. అతను గత మూడు రోజులుగా ఫోన్ చేస్తున్నప్పటికీ తల్లి నుంచి స్పందన లేకపోవడంతో అనుమానంతో శనివారం రాత్రి గొంతినవానిపాలెం వచ్చి చూడగా తల్లి లక్ష్మి మృతదేహం కనిపించింది. అతడి తమ్ముడు సంతోషరావు మరో గదిలో మంచంపై నిద్రిస్తూ ఉన్నాడు. దీంతో గాజువాక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు ఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. లక్ష్మి మృతిచెంది మూడు రోజులు దాటి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.