నెగ్గేనా? వీగేనా?
ABN , Publish Date - Oct 18 , 2025 | 01:03 AM
స్థానిక మండల పరిషత్ అధ్యక్షునిపై జనసేన పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా? వీగుతుందా? అన్నది మరికొన్ని గంటల్లో తేలనున్నది. ఎంపీపీ పదవిలో బోదెపు గోవింద్ కొనసాగుతారా? లేకపోతే గద్దె దిగుతారా? అన్నది స్పష్టం అవుతుంది. దీనిపై మండలంలోని రాజకీయ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది.
ఎలమంచిలి ఎంపీపీపై నేడు అవిశ్వాస తీర్మానం
ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్న ఎంపీడీవో
గత నెలలో నలుగురు సభ్యుల సంతకాలతో నోటీసు అందజేత
2/3 వంతు నిబంధన మేరకు తీర్మానం నెగ్గే అవకాశం
ఒక్కరు వెనక్కు తగ్గినా.. ఫలితం తారుమారు
ఎలమంచిలి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక మండల పరిషత్ అధ్యక్షునిపై జనసేన పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా? వీగుతుందా? అన్నది మరికొన్ని గంటల్లో తేలనున్నది. ఎంపీపీ పదవిలో బోదెపు గోవింద్ కొనసాగుతారా? లేకపోతే గద్దె దిగుతారా? అన్నది స్పష్టం అవుతుంది. దీనిపై మండలంలోని రాజకీయ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది.
ఎంపీపీ బోదెపు గోవింద్‌పై జనసేన పార్టీకి చెందిన నలుగురు ఎంపీటీసీ సభ్యులు గత నెలలో ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మండల పరిషత్ హాలులో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకుని ఎంపీపీ గోవింద్‌ను పదవీచ్యుతుడిని చేయాలని జనసేన పార్టీ నేతలు కృత నిశ్చయంతో వున్నారు. వాస్తవంగా నాలుగేళ్ల క్రితం జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మండలంలోని అన్ని (ఏడు) ఎంపీటీసీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది.
ఏటికొప్పాక-1 నుంచి నగిరెడ్డి అమ్మాజీ, ఏటికొప్పాక-2 నుంచి నగిరెడ్డి దేముడమ్మ (కొంతకాలం తరువాత మృతిచెందడంతో ఈ స్థానం ఖాళీగా వుంది), పులపర్తి నుంచి బోదెపు గోవింద్, రేగుపాలెం నుంచి రాజాన సూర్యచంద్రశేషగిరిరావు(శేషు), బయ్యవరం నుంచి ఊటకూటి రామగణేశ్, కొత్తలి నుంచి బర్రె శివలక్ష్మి, జంపపాలెం నుంచి శిలపరశెట్టి ఉమ గెలుపొందారు. ఎంపీపీగా బోదెపు గోవింద్, వైస్ ఎంపీపీలుగా రాజాన శేషు, శిలపరశెట్టి ఉమ ఎంపికయ్యారు. వాస్తవంగా ఎంపీపీ పదవిని రాజాన శేషు ఆశించారు. దక్కకపోవడంతో నిరాశ చెందారు. ఎంపీపీని నాలుగేళ్ల వరకు పదవి నుంచి దించే అవకాశం లేకపోవడంతో మిన్నకుండిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు రాజాన శేషు, ఎస్.ఉమ జనసేన పార్టీలో చేరారు. మరో ఇద్దరు ఎంపీటీసీ సభ్యులను తనవైపు తిప్పుకుంటే గోవింద్‌ను ఎంపీపీ పదవి నుంచి దించేయవచ్చని భావించారు. ఎమ్మెల్యే విజయ్‌కుమార్ ఆశీస్సులు ఉండడంతో ఎంపీటీసీ సభ్యులు బర్రె శివలక్ష్మి, నగిరెడ్డి అమ్మాజీలను తమ గూటికి చేర్చుకున్నారు. అనంతరం ఎంపీపీ గోవింద్‌పై అవిశ్వాసం ప్రకటిస్తూ గత నెల 24వ తేదీన అనకాపల్లి ఆర్డీఓతోపాటు ఎలమంచిలి ఇన్‌చార్జి ఎంపీడీఓ శ్రీనివాసరావుకు నోటీసు అందజేశారు. దీనిలోని సంతకాల పరిశీలన, సభ్యులతో మాట్లాడిన అనంతరం ఈ నెల 18వ తేదీన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మండల పరిషత్ హాలులో సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం మండల పరిషత్‌లో ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు వున్నారు. నిబంధనల ప్రకారం వీరిలో నలుగురు సభ్యులు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే తీర్మానం నెగ్గుతుంది. ఇదే జరిగితే ఎంపీపీ పదవి నుంచి గోవింద్ వైదొలగాల్సి వస్తుంది. ఈ నలుగురిలో ఏ ఒక్కరు వ్యతిరేకించినా.. అవిశ్వాస తీర్మానం వీగిపోతుంది. గోవింద్ పదవికి ఢోకా వుండదు. అవిశ్వాస తీర్మానం కచ్చితంగా నెగ్గుతుందని రాజాన శేషు ధీమా వ్యక్తం చేస్తున్నారు.