Share News

చెరువులనే రాసిచ్చేస్తారా!?

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:19 AM

సాగునీటి చెరువులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీచేసిన వ్యవహారంలో పద్మనాభం పూర్వ తహశీల్దార్‌, ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ ఎంవీఎస్‌ లోకేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి వీలుగా ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

చెరువులనే రాసిచ్చేస్తారా!?

పద్మనాభం పూర్వ తహశీల్దార్‌, ప్రస్తుతం అల్లూరి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌

ఎంవీఎస్‌ లోకేశ్వరరావుపై ప్రభుత్వం సీరియస్‌

క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధం

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

పది రోజుల్లోగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశం

రేవిడి, పొట్నూరు చెరువులను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేసిన రెవెన్యూ అధికారి

ఆ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన ‘ఆంధ్రజ్యోతి’

పద్మనాభం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి):

సాగునీటి చెరువులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీచేసిన వ్యవహారంలో పద్మనాభం పూర్వ తహశీల్దార్‌, ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ ఎంవీఎస్‌ లోకేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి వీలుగా ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు రెవెన్యూ విజిలెన్స్‌ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి ఉత్తర్వులు (జీఓ నంబరు 913) విడుదల చేశారు. ఈ జీఓ ద్వారా లోకేశ్వరరావుపై వచ్చిన రెండు అభియోగాలకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించింది.

1991 నాటి ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ (సీసీఏ) నియమాలు రూల్‌ 20 కింద అవినీతి, దుష్ప్రవర్తన, అధికార దుర్వినియోగానికి పాల్పడడం తదితర ఆరోపణలపై చర్యలకు నిర్ణయించింది. ఉత్తర్వులు అందిన పది రోజుల్లోగా లోకేశ్వరరావు ప్రభుత్వానికి లిఖితపూర్వక వివరణ ఇవ్వాల్సి ఉంది. లేదంటే అతనిపై జరిపిన విచారణ నివేదికలోని ఆధారాల మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి అనుబంధంగా అనెగ్జరు-1/2లో అతనిపై మోపిన అభియోగాలను వివరించారు.

సాగునీటి చెరువులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీచేసిన వైనంపై 2023 జనవరి 24న ‘ఆంధ్రజ్యోతి’ ‘చెరువుకు టెండర్‌’ శీర్షికన కథనం ప్రచురించింది. రేవిడి సర్వే నంబరు 73/2లోని 7.73 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న యాతవాని చెరువును కొందరికి అప్పటి తహసీల్దారు లోకేశ్వరరావు పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ అప్పటి భీమిలి ఆర్డీవోను విచారణకు ఆదేశించారు. విచారణలో ఆంధ్రప్రదేశ్‌ ఇనాం రద్దు చట్టం 1956, 1975 ప్రకారం ప్రజా ప్రయోజనం, సామూహిక ఆస్తిగా ఉన్న చెరువునకు తహశీల్దారు నిబంధనలను అతిక్రమించి ఖాతా నెంబరు 1249 ద్వారా 5.30 ఎకరాల విస్తీర్ణానికి పోలిశెట్టి శ్రీనివాస్‌కు అనుకూలంగా పట్టాదారు పాస్‌పుస్తకం జారీ చేశారని నివేదికలో పేర్కొన్నారు. ఎఫ్‌ఎంబీ రికార్డుల ప్రకారం వంద సంవత్సరాల నుంచి ఈ చెరువు సాగుభూములకు నీటిని అందిస్తోందని, 20 ఏళ్లుగా ఉపాధి హామీ పథకం నిధులతో చెరువు అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు విచారణలో తేలింది. అలాగే పొట్నూరు గ్రామంలోని సర్వే నంబరు 107లో ఉన్న సాగునీటి చెరువుకు ఖాతా నంబరు 5698 ద్వారా 10 ఎకరాల విస్తీర్ణానికి మంచుకొండ వెంకట జగన్నాథం అనే వ్యక్తికి పట్టాదారు పాస్‌పుస్తకం జారీ చేశారు. ఇక్కడ కూడా తహశీల్దారు ఇనాం రద్దు చట్టం-1964ను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో కలెక్టర్‌ తదుపరి చర్యల నిమిత్తం ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఇందులో లోకేశ్వరరావు తన అధికారాలను దుర్వినియోగం చేశారని, చట్టబద్ధమైన విధులు నిర్వర్తించడంలో విఫలమయ్యారని, ప్రజా సేవకుడికి తగని విధంగా, ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించారని, ఏపీ పౌర సేవల (ప్రవర్తన) నియమావళిని ఉల్లంఘించారని గుర్తించారు. లోకేశ్వరరావు ఇచ్చే లిఖితపూర్వక వివరణ మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Aug 26 , 2025 | 01:19 AM