Share News

అసంపూర్తి భవనాలు పూర్తయ్యేనా?

ABN , Publish Date - Aug 24 , 2025 | 11:09 PM

మండలంలోని సచివాలయం, వెల్‌నెస్‌ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో బిల్లులు సకాలంలో విడుదలకాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు.

అసంపూర్తి భవనాలు పూర్తయ్యేనా?
అసంపూర్తిగా ఉన్న పెదకోట సచివాలయ భవనం

అర్ధాంతరంగా నిలిచిపోయిన సచివాలయ, ఆర్బీకే, వెల్‌నెస్‌ సెంటర్ల భవన నిర్మాణాలు

గత వైసీపీ ప్రభుత్వం సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడంతో పనులకు బ్రేక్‌

వివిధ దశల్లో ఆగిపోయిన ఏడు సచివాలయ భవనాలు

14 వెల్‌సెస్‌ సెంటర్లకు గాను ఒకటి పూర్తి

21 రైతు భరోసా కేంద్రాలకు ఎనిమిది పూర్తి

కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు పునఃప్రారంభానికి ఆసక్తి చూపినా ధరల పెరుగుదలతో ముందుకు రాని కాంట్రాక్టర్లు

అనంతగిరి, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని సచివాలయం, వెల్‌నెస్‌ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో బిల్లులు సకాలంలో విడుదలకాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. ఆ తరువాత ఆలస్యంగా బిల్లులు వచ్చినా మిగతా పనులు పూర్తి చేసేందుకు ఆసక్తి చూపించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు పునఃప్రారంభించాలనుకున్నా ప్రస్తుతం నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ముందుకు రావడం లేదు.

మండలంలోని సచివాలయం, వెల్‌నెస్‌ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాల భవనాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో ఉద్యోగులు, గిరిజనులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మారుమూల పెదకోట, కివర్ల, వాలసీ, గుమ్మ, తదితర పంచాయతీల్లో కనీసం మూడు భవనాలు అందుబాటులోకి రాలేదు. అనంతగిరి మండలంలోని 21 గ్రామ సచివాలయాలు మంజూరు కాగా, అందులో 14 సచివాలయాల భవనాలు అందుబాటులోకి వచ్చాయి. మిగతా ఏడింటిలో వాలసీ, గుమ్మ సచివాలయాల భవనాల పనులు శ్లాబ్‌ స్థాయి వరకు జరగగా, పెదబిడ్డ, పైనంపాడు, పెదకోట, ఎగువశోభల్లో భవనాల శ్లాబ్‌లు పూర్తయ్యాయి. కివర్ల మాత్రమే కింద శ్లాబ్‌ పూర్తయింది. అలాగే 21 రైతు భరోసా కేంద్రాలకుగాను అనంతగిరి, వాలసీ, పైనంపాడు, ఎగువశోభ, గుమ్మ, పినకోటలో శ్లాబ్‌ స్థాయి వరకు పనులు జరగ్గా, పెదకోట, కివర్లలో శ్లాబ్‌ వేసి గోడలు నిర్మించారు. 14 వెల్‌నెస్‌ సెంటర్లకు గాను చిలకలగెడ్డ పంచాయతీ కేంద్రంలో మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చారు. కొండిభ, వాలసీ, పెదబిడ్డ, ఎగువశోభ, గుమ్మ, కివర్లలో శ్లాబ్‌ స్థాయి వరకు పనులు జరగగా, పైనంపాడు, పెదకోటలో శ్లాబ్‌ వరకు పూర్తయ్యాయి. కొత్తూరు, ఎన్‌ఆర్‌పురం, రొంపల్లి, భీంపోల్‌, జీనబాడులో పనులన్నీ పూర్తయ్యాయి. విద్యుత్‌ సౌకర్యం, తలుపులు, టైల్స్‌, తాగునీటి సదుసాయం, తదితర పనులు పూర్తి కావాల్సి ఉన్నాయి.

ముందుకు రాని కాంట్రాక్టర్లు

మండలంలోని సచివాలయ భవన నిర్మాణానికి 2020-21లో వైసీపీ ప్రభుత్వం రూ.43.6 లక్షలు, ఆర్‌బీకేకు రూ.21.8 లక్షలు, వెల్‌నెస్‌ సెంటర్‌కు 17.5 లక్షలు కేటాయించింది. అయితే కాంట్రాక్టర్లు పనులు చేపట్టినా సకాలంలో బిల్లులు అందక ఇబ్బంది పడ్డారు. దీంతో పనులు నిలిపివేశారు. ఆ తరువాత ఎప్పటికో బిల్లులు రావడంతో మిగతా పనులు చేస్తే బిల్లులు వస్తాయో?, రావోననే ఉద్దేశంతో మిన్నకుండిపోయారు. ప్రస్తుతం ఇనుము, ఇసుక, సిమెంట్‌, ఇతర నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అదనంగా నిధులు కేటాయిస్తే తప్ప వీటి పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపించడం లేదు.

Updated Date - Aug 24 , 2025 | 11:09 PM