టీడబ్ల్యూ డీడీ విధుల్లో చేరేనా?
ABN , Publish Date - Aug 31 , 2025 | 10:53 PM
ఎట్టకేలకు స్థానిక గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా శాశ్వత అధికారిని ప్రభుత్వం పదమూడు రోజుల క్రితం నియమించినా ఆమె ఇప్పటికీ విధుల్లో చేరకపోవడం చర్చనీయాంశమైంది. అసలు ఆమె విధుల్లో చేరతారో?, లేదోననే సందిగ్ధం నెలకొంది.
పది నెలలుగా ఇన్‌చార్జుల పాలన
తాజాగా నెల్లూరు డీటీడబ్ల్యూవోకు
పదోన్నతి కల్పించి ఇక్కడ నియామకం
పదమూడు రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు
ఇంకా విధుల్లో చేరని వైనం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ఎట్టకేలకు స్థానిక గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా శాశ్వత అధికారిని ప్రభుత్వం పదమూడు రోజుల క్రితం నియమించినా ఆమె ఇప్పటికీ విధుల్లో చేరకపోవడం చర్చనీయాంశమైంది. అసలు ఆమె విధుల్లో చేరతారో?, లేదోననే సందిగ్ధం నెలకొంది.
పాడేరు ఐటీడీఏలో గిరిజన సంక్షేమ శాఖ డీడీగా పని చేసిన ఐ.కొండలరావును గతేడాది అక్టోబరులో గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. దీంతో అప్పటి నుంచి స్థానిక ఏటీడబ్ల్యూవోగా పనిచేసిన ఎల్.రజనికి డీడీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ఇటీవల జరిగిన బదిలీల్లో ఏటీడబ్ల్యూవో రజనికి పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం బదిలీ కావడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. దీంతో ఈ నెల 5న కొయ్యూరులో ఏటీడబ్ల్యూవోగా పనిచేస్తున్న పి.కాంత్రికుమార్‌కు స్థానిక గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయనే ప్రస్తుతానికి టీడబ్ల్యూ డీడీగా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరులోని జిల్లా గిరిజన సంక్షేమశాఖాధికారిగా పనిచేస్తున్న పీబీకే పరిమిళకు డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ స్థానిక టీడబ్ల్యూ డీడీగా ఈ నెల 18వ తేదీన నియమించారు. కానీ ఇక్కడ పరిస్థితుల నేపథ్యంలో ఆమె విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదని, ఇదే క్రమంలో ఆమెతో పాటు టీడబ్ల్యూ డీడీగా పదోన్నతి పొంది కేఆర్‌పురం ఐటీడీఏలో పనిచేస్తున్న అధికారి ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని ప్రచారం జరుగుతున్నది. ప్రచారానికి తగ్గట్టుగానే ఆమె సైతం ఉత్తర్వులు జారీ చేసి పదమూడు రోజులవుతున్నా విధుల్లో చేరకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా స్థానిక టీడబ్ల్యూ డీడీ పోస్టుకు గ్రహణ వీడుతుందా?, లేదా? అనేది ప్రస్తుతం మన్యంలో చర్చనీయాంశంగా మారింది.