Share News

సచివాలయ భవనం పూర్తయ్యేనా?

ABN , Publish Date - Nov 25 , 2025 | 12:41 AM

మండలంలోని మాలమాకవరం గ్రామంలో సచివాలయ భవన నిర్మాణ పనులు ఆరేళ్ల క్రితం నిలిచిపోయాయి.

సచివాలయ భవనం పూర్తయ్యేనా?
అసంపూర్తిగా ఉన్న సచివాలయ భవనం

ఆరేళ్లుగా అసంపూర్తిగా దర్శనం

గత వైసీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్‌

పంచాయతీ కార్యాలయంలో సచివాలయ కార్యకలాపాలు

సిబ్బందికి తప్పని ఇబ్బందులు

కొయ్యూరు, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని మాలమాకవరం గ్రామంలో సచివాలయ భవన నిర్మాణ పనులు ఆరేళ్ల క్రితం నిలిచిపోయాయి. గత వైసీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అప్పటి నుంచి దిష్టిబొమ్మలా దర్శనమిస్తోంది. దీంతో సచివాలయ కార్యకలాపాలను సిబ్బంది పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్నారు.

గత వైసీపీ ప్రభుత్వం మాలమాకవరం గ్రామంలో సచివాలయ భవన నిర్మాణానికి రూ. 43 లక్షలు మంజూరు చేసింది. దీంతో కాంట్రాక్టర్‌ భవన నిర్మాణం దాదాపు పూర్తి చేసి ఫ్ల్లోరింగ్‌ టైల్స్‌, విద్యుద్దీకరణ, రంగులు వేసే పనులు నిలిపివేశారు. అప్పటి వరకు చేసిన పనులకు రూ.23 లక్షలు మాత్రమే గత ప్రభుత్వం చెల్లించింది. మరో రూ.10 లక్షలు విడుదల చేయాల్సి ఉంది. అయితే అనంతరం పనులు చేపట్టినా బిల్లులు రావన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్‌ పనులను నిలిపివేశారు. దీంతో ఈ భవనం వృథాగా ఉంది. రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. కాగా సచివాలయ భవనం అందుబాటులోకి రాకపోవడంతో సిబ్బంది పంచాయతీ కార్యాలయ భవనంలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఈ అసంపూర్తి భవన నిర్మాణాలు పూర్తి చేయాలని సర్పంచ్‌ పలుమార్లు కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. అయినా ఫలితం లేకపోయిందని సర్పంచ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పంచాయతీరాజ్‌ జేఈ రామకృష్ణ వివరణ కోరగా, కాంట్రాక్టర్‌కు రూ.23 లక్షలు చెల్లింపులు జరిపామని, మరో రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉందన్నారు. కాంట్రాక్టర్‌ను ఒప్పించి భవన నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు.

Updated Date - Nov 25 , 2025 | 12:41 AM