‘సీ ప్లేన్’ రెక్కలు తొడిగేనా?
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:48 AM
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సీప్లేన్ నడపడానికి పర్యాటక శాఖ ప్రతిపాదనలు రూపొందించింది.
దశాబ్దకాలంగా ప్రతిపాదనలు
ఇప్పటికీ కార్యరూపం దాల్చని వైనం
రుషికొండ, లంబసింగి, అరకులోయ అనువైన ప్రాంతాలుగా గుర్తించినట్టు తాజాగా పర్యాటక శాఖా మంత్రి ప్రకటన
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సీప్లేన్ నడపడానికి పర్యాటక శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. రుషికొండ, అరకులోయ, లంబసింగి ప్రాంతాలు దీనికి అనువైన ప్రాంతాలుగా గుర్తించినట్టు పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేశ్ తాజాగా ఓ సమావేశంలో వెల్లడించారు. దీంతో ఎప్పటి నుంచో విశాఖలో ప్రారంభించాలని అనుకుంటున్న సీప్లేన్ ప్రతిపాదనల్లో కదలిక వచ్చినట్టయింది.
తెలుగుదేశం ప్రభుత్వం విశాఖలో 2016లో నిర్వహించిన సీఐఐ పెట్టుబడిదారుల సదస్సులో దీనిపై చర్చ జరిగింది. చెన్నైకు చెందిన స్కై చాపర్స్ అనే సంస్థ హెలికాప్టర్లతో పాటు సీ ప్లేన్లను విశాఖపట్నంలో నడుపుతామని ముందుకువచ్చింది. భీమిలి నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజీకి సీ ప్లేన్ నడుపుతామని ప్రకటించింది. ఆ తరువాత చంద్రబాబునాయుడు పలు పర్యాటక సంస్థలతో సమావేశం నిర్వహించగా, చంద్రశేఖర్ అనే పారిశ్రామికవేత్త సీ ప్లేన్ నడపుతామని ఆసక్తి వ్యక్తంచేశారు. భీమిలి సమీపాన మంగమారిపేటలో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మిస్తే సీ ప్లేన్ నడుపుతామని చెప్పారు. ఆ మేరకు ఫ్లోటింగ్ జెట్టీ నిర్మించాలని 2016లోనే చంద్రబాబు ఆదేశించారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు.
విశాఖపట్నం పోర్టు కూడా సీ ప్లేన్ నడపడానికి మూడేళ్ల క్రితం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. డీపీఆర్ కూడా రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం ప్రవేశ పెట్టడంతో అందులో దీనిని చేర్చాలని పౌర విమానయాన శాఖకు లేఖ రాసింది. సీ ప్లేన్‌కు అవసరమైన జెట్టీ నిర్మిస్తామని ప్రతిపాదించింది. అయితే రూ.100 కోట్లతో చేపట్టిన క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణంలో నిమగ్నమైన పోర్టు అధికారులు, దీనిపై దృష్టి పెట్టలేకపోయారు. ఇప్పుడు క్రూయిజ్ టెర్మినల్ ఖాళీగానే ఉంది. అక్కడి నుంచి సీప్లేన్ నడుపుకునే అవకాశం ఉంది. విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం, విజయవాడ, శ్రీశైలం, హుస్సేన్ సాగర్ (హైదరాబాద్), చిలకా సరస్సు (ఒడిశా) తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి డిమాండ్ ఉంది. సీ ప్లేన్ నీటిపైన, భూమిపైన ల్యాండ్ అవుతుంది. అలాగే ఎక్కడి నుంచైనా టేకాఫ్ తీసుకోగలుగుతుంది. లోకల్ టూరిజం కింద విశాఖపట్నం నుంచి రుషికొండ, భీమిలి, అరకు, లంబసింగి నడపొచ్చు. అధికారులు ఈ దిశగా కృషి చేస్తే విశాఖకు మరో కొత్త పర్యాటక ఆకర్షణ జత కలుస్తుంది.