Share News

రేషన్‌ కష్టాలు తీరేనా?..

ABN , Publish Date - Nov 12 , 2025 | 12:32 AM

జిల్లాలో మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులు రేషన్‌ సరుకులు తీసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేషన్‌ డిపోలకు 2 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఆయా లబ్ధిదారుల గ్రామాలుండడంతో పాటు రోడ్డు, రవాణా సదుపాయాలు లేకపోవడంతో అవస్థలు పడుతు న్నారు.

రేషన్‌ కష్టాలు తీరేనా?..
ముంచంగిపుట్టు మండలం దొరగూడ గిరిజనులు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీపురం డిపో నుంచి రేషన్‌ సరుకులు మోసుకుని వస్తున్న దృశ్యం(ఫైల్‌)

మారుమూల గ్రామాలకు డిపోలు దూరంగా ఉండడంతో గిరిజనుల అవస్థలు

రవాణా సౌకర్యం లేక కాలినడకనే వెళ్లాల్సిన దుస్థితి

వర్షాలు కురిసినప్పుడు గెడ్డలను దాటుకుంటూ వెళుతున్న పరిస్థితి

మంత్రి నాదెండ్ల మనోహర్‌ దృష్టికి తీసుకువెళ్లిన పలువురు ఆదివాసీలు

వెంటనే స్పందించి ఉన్నతాధికారులకు ఆదేశాలు

జిల్లాలో 69 మినీ రేషన్‌ డిపోల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు

-

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులు రేషన్‌ సరుకులు తీసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేషన్‌ డిపోలకు 2 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఆయా లబ్ధిదారుల గ్రామాలుండడంతో పాటు రోడ్డు, రవాణా సదుపాయాలు లేకపోవడంతో అవస్థలు పడుతు న్నారు. కాగా మారుమూల ప్రాంతాల్లో మినీ రేషన్‌ డిపోలను ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖాధికారులు ప్రతిపాదనలు చేయడంతో రానున్న రోజుల్లో తమ కష్టాలు తీరతాయని గిరిజనులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలోని మొత్తం 4,330 గ్రామాలకు 671 రేషన్‌ డిపోలు మాత్రమే ఉండడంతో ఈ సమస్య నెలకొంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాన రేషన్‌ డిపోలకు అనుబంధంగా గ్రామాలకు చేరువగా మినీ డిపోలను ఏర్పాటు చేస్తే కొంత వరకు లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పుతాయని, కానీ అఽధికారులు మాత్రం సరుకుల పంపిణీతో తమ పనైపోయిందనే ధోరణిలోనే ఉన్నారనే విమర్శలున్నాయి. అలాగే రేషన్‌ సరుకులను విడిపించిన గిరిజనులు వాటిని తమ ఇళ్లకు తీసుకువెళ్లేందుకు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది ఎవరూ పట్టించుకోని పరిస్థితి. ముఖ్యంగా వర్షాకాలంలో సరుకుల రవాణా మరింత ఇబ్బందికరంగా ఉంటోంది. ప్రాణాలకు తెగించి గెడ్డలు, వాగులు దాటుకుని రేషన్‌ సరుకుల కోసం రాకపోకలు సాగించాల్సిన దుస్థితి కొనసాగుతున్నది. ఉదాహరణకు ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ దొరగూడ గ్రామానికి చెందిన గిరిజనులు సుమారుగా పది కిలోమీటర్లు కాలినడకన రేషన్‌ డిపో ఉన్న లక్ష్మీపురం వచ్చి సరుకులు మోసుకుని వెళ్లాల్సిన దుస్థితి ఉంది. ఈ పరిస్థితులు జిల్లా కేంద్రం పాడేరు మండలంతో సహా అన్ని మండలాల్లోనూ ఉంది. ఈ తరుణంలో పలు గ్రామాలు కేంద్రంగా మినీ రేషన్‌ డిపోలను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ చాలా ఏళ్లుగా ఉంది.

మంత్రి మనోహర్‌ దృష్టికి సమస్యలు

జిల్లాలో ముఖ్యంగా పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో పలు గ్రామాలకు రేషన్‌ డిపోలు దూరంగా ఉండడంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో ఈ ఏడాది ఆగస్టు 4న రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌ పాడేరు పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయనకు పలువురు గిరిజనుల రేషన్‌ కష్టాలను తెలియజేశారు. అలాగే ఇదే సమస్యపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘ఎన్నాళ్లీ పరేషన్‌’ శీర్షికన సమగ్ర వివరాలతో ప్రత్యేక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీంతో మంత్రి నాదెండ్ల స్పందించి మారుమూల ప్రాంతాల్లో మినీ రేషన్‌ డిపోల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు జిల్లాలో రేషన్‌ డిపోలు దూరంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, సుమారుగా 69 ప్రాంతాల్లో మినీ డిపోలను ఏర్పాటు చేయడం ద్వారా కొంత వరకు గిరిజనుల రేషన్‌ కష్టాలు తీర్చవచ్చునని ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వం నుంచి వాటి ఏర్పాటుకు అనుమతిస్తే, మారుమూల ప్రాంతాల్లోని లబ్ధిదారుల రేషన్‌ కష్టాలు తీరుతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో మినీ రేషన్‌ డిపోల ఏర్పాటుకు ప్రతిపాదనలివే...

వ.స మండలం మెయిన్‌ డిపోలు ప్రతిపాదిత మినీ డిపోలు

1. పాడేరు 45 7

2. పెదబయలు 39 7

3. అనంతగిరి 44 7

4. డుంబ్రిగుడ 42 1

5. జీకేవీధి 43 2

6. కొయ్యూరు 57 2

7. జి.మాడుగుల 43 8

8. ముంచంగిపుట్టు 46 3

9. అరకులోయలో 32 3

10. అడ్డతీగల 16 3

11. దేవీపట్నం 13 8

12. మారేడుమిల్లి 14 5

13. రాజవొమ్మంగి 16 2

14. రంపచోడవరం 17 11

-----------------------------------------------------------------------------------

మొత్తం 467 69

-----------------------------------------------------------------------------------

Updated Date - Nov 12 , 2025 | 12:32 AM