Share News

ఫ్లాట్ల ధరలు దిగి వచ్చేనా?

ABN , Publish Date - Oct 05 , 2025 | 01:12 AM

నగరంలో బిల్డర్లు ఫ్లాట్ల ధరలు ఇప్పుడైనా తగ్గిస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఫ్లాట్ల ధరలు దిగి వచ్చేనా?

జీఎస్టీ శ్లాబు మార్పుతో సిమెంట్‌ ధర బస్తాకు రూ.30 తగ్గింపు

అన్‌ సీజన్‌తో రూ.54 వేలకే లభిస్తున్న స్టీల్‌

నిర్మాణ సామగ్రి ధరలు దిగివచ్చినా ఐదు శాతం కంటే ఎక్కువ తగ్గించలేమంటున్న బిల్డర్లు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో బిల్డర్లు ఫ్లాట్ల ధరలు ఇప్పుడైనా తగ్గిస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని ధరలు విశాఖపట్నంలోనే ఉన్నాయి. సీతమ్మధార, ఎంవీపీ కాలనీ తదితర ప్రాంతాల్లో ఫ్లాట్‌ కొనాలంటే చ.అ. కనీసం రూ.9 వేలు చెబుతున్నారు. ఎండాడలో సైతం చ.అ. రూ.8 వేల నుంచి ప్రారంభమవుతోంది. మధురవాడ, పీఎం పాలెం, కొమ్మాది తదితర ప్రాంతాల్లో రూ.6,500 చెబుతున్నారు. నగరంలో భూమి ధర చదరపు గజం రూ.1.2 లక్షలు ఉంటే మధురవాడ ప్రాంతంలో రూ.80,000 ఉంది. ఆ కారణంగా అక్కడ ఫ్లాట్ల ధరలు కాసింత తక్కువగా ఉన్నాయి.

ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్‌టీ బాగా తగ్గించాయి. ఆ మేరకు కొనుగోలుదారులకు ప్రయోజనం కల్పించాల్సిన బాధ్యత బిల్డర్లపై ఉంది. అయితే అది కూడా కష్టమేనని బిల్డర్లు పెదవి విరవడం గమనార్హం. సిమెంట్‌పై జీఎస్‌టీ 28 శాతం ఉండగా దానిని 18 శాతం చేశారు. అంటే పది శాతం తగ్గింది. దీనికి బిల్డర్లు చెబుతున్న భాష్యం వేరేగా ఉంది. సిమెంట్‌ కంపెనీలు ఇంకా ధరలు తగ్గించలేదని, బస్తాకు ఆరు రూపాయలు మాత్రమే తగ్గించాయని, వారి దగ్గర పాత నిల్వలు అయిపోయి, కొత్త నిల్వలు మార్కెట్‌కు వస్తే అప్పుడు ఆ ధరలు తగ్గుముఖం పడతాయని అంటున్నారు. ఫ్లాట్ల కొనుగోలుదారులకు ఓ ఐదు శాతం వరకు మాత్రమే ధర తగ్గించే అవకాశం ఉందని క్రెడాయ్‌ ప్రతినిధి ఒకరు శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. స్టీల్‌పై జీఎస్‌టీ 18 శాతమే కొనసాగుతున్నదని, దానిని తగ్గించలేదని వివరించారు. అందువల్ల ఫ్లాట్ల రేట్లలో ఐదు శాతం కంటే ఎక్కువ తగ్గుదల ఉండకపోవచ్చునని పేర్కొన్నారు.

వాస్తవం వేరుగా ఉంది

మార్కెట్‌ను పరిశీలిస్తే నిర్మాణానికి ప్రధాన ముడి సరకులైన సిమెంట్‌, స్టీల్‌ ధరలు బాగా తగ్గుముఖం పట్టాయి. సిమెంట్‌ ధరలు పది శాతం వరకు తగ్గాయి. క్రెడాయ్‌ ప్రతినిధులు పేర్కొన్నట్టు బస్తాకు ఆరు రూపాయలు తగ్గిందని చెబుతుండగా, మార్కెట్‌లో మాత్రం పాత రేటుపై రూ.30 తగ్గించి విక్రయిస్తున్నారు. రామ్‌కో సిమెంట్‌ బస్తా రూ.330 నుంచి రూ.300కి తగ్గింది. నాగార్జున సిమెంట్‌ బస్తా రూ.345 నుంచి రూ.315కి తగ్గింది. సాగర్‌ సిమెంట్‌ రూ.290 నుంచి రూ.260కి, ఆలా్ట్ర టెక్‌ సిమెంట్‌ రూ.350 నుంచి రూ.315, మహా సిమెంట్‌ రూ.285 నుంచి రూ.250కి తగ్గాయి. కొన్ని రకాలు బస్తాకు రూ.35 వరకు తగ్గాయి. కానీ బిల్డర్లు తగ్గలేదని చెప్పడం గమనార్హం. ఇక స్టీల్‌ రేట్లు చూసుకుంటే వైజాగ్‌ స్టీల్‌ టన్ను రూ.54 వేలకు దొరుకుతోంది. గతంలో ఇదే స్టీల్‌ టన్ను రూ.90 వేలు పలికింది. అంటే ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవచ్చు. సింహాద్రి స్టీల్‌ టన్ను రూ.53 వేలకు దొరుకుతోంది. ఈ ప్రయోజనం కొనుగోలుదారులకు అందడం లేదు.

ఏదేమైనా స్టీల్‌, సిమెంట్‌ ధరలు బాగా తగ్గినందున బిల్డర్లు ఆ మేరకు ఫ్లాట్ల ధరలను తగ్గించాలనే వాదన బలంగా వినిపిస్తోంది. రేట్లు ఎక్కువైనపుడు ఎలా పెంచుతున్నారో తగ్గినప్పుడు కూడా ఆ ప్రయోజనం కొనుగోలుదారులకు అందిస్తే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated Date - Oct 05 , 2025 | 01:12 AM