పెద్దాస్పత్రి దశ తిరిగేనా?
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:48 AM
ఉత్తరాంధ్ర పేదల ఆరోగ్య ప్రదాయని కేజీహెచ్‌లో వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమ వారం పర్యటించనున్నారు.
నేడు కేజీహెచ్‌కు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
కాంప్రహెన్సివ్ కేన్సర్ సెంటర్ ప్రారంభించనున్న మంత్రి
సమస్యలను ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్న అధికారులు
ఆస్పత్రిని ప్రక్షాళన చేసేలా నిర్ణయాలు తీసుకుంటారని ఆశాభావం
విశాఖపట్నం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్ర పేదల ఆరోగ్య ప్రదాయని కేజీహెచ్‌లో వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమ వారం పర్యటించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిం చేందుకు కొనుగోలు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను ఆయన ప్రారంభించనున్నారు. కాంప్రహెన్సివ్ కేన్సర్ కేర్ సెంటర్‌లో ఈ వైద్య పరికరాలను ప్రభుత్వం ఏర్పాటు చే సింది. వీటి ద్వారా కేన్సర్ రోగులకు అడ్వాన్స్‌డ్ వైద్య సేవందించనున్నారు. ఉదయం 10 గంటలకు మంత్రి రానున్న సందర్భంగా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
మంత్రి ఆస్పత్రిని సందర్శించనున్న నేపథ్యంలో కొన్ని కీలకమైన సమస్యలను అతని దృష్టికి తీసుకువెళ్లేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. గతంతో పోలిస్తే కేజీహెచ్ కు రోగుల తాకిడి పెరిగింది. ప్రతిరోజూ 1500 మంది ఓపీ సేవలకు వస్తున్నారు. మరో 1800 మంది ఇన్‌పేషెం ట్లున్నారు. ఈ నేపథ్యంలో రోగులకు మెరుగైన వైద్య సేవ లు అందించేందుకు వీలుగా మరింత అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. కీలక విభాగాలకు అత్యాధునిక వైద్య పరిక రాలు అందేలా మంత్రి ప్రత్యేక చొరవ చూపాలంటున్నారు. కీలక విభాగమైన నెఫ్రాలజీలో కొన్ని డయాలసిస్ యంత్రాలు పనిచేయడంలేదు. దాతల సహకారంతో సమ కూర్చుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నా ప్రక్రియ ఆలస్యమవుతోది. దీంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. అదనపు యత్రాలు కేటాయిస్తే వారికి మేలు జరుగుతుంది. కార్డియాలజీ శస్త్రచికిత్సల నిర్వహణలో హార్ట్ లంగ్‌మెషీన్, టెంపరేచర్ కంట్రోల్ మెషీన్లు పనిచేయకపో వడంతో కొన్నిరోజులపాటు ఆపరేషన్లు నిలిచిపోయాయి. వాటిని అద్దె ప్రాతిపదికన అధికారులు సమకూర్చుకు న్నా రు. ఈ పరికరాలను కొనుగోలుచేస్తే సమస్య తప్పుతుంది. క్యాథల్యాబ్ సేవలను మెరుగుపరచాల్సి ఉంది. కొన్ని ఐసీ యూలు సాధారణ వార్డులను తలపిస్తున్నాయి. వాటిని ఆధునికీకరించేందుకు నిధులు అవసరం. కేన్సర్ రోగులకు పెట్‌స్కాన్ చేయాల్సి ఉంది. దీనిపై చాలాకాలంగా అధి కారులు విన్నవిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఈ స్కాన్ ద్వారా కేన్సర్ శరీరంలో ఎక్కడి వరకు పాకిందో తెలుసుకునే వీలుంది. పూర్తిస్థాయి ఎమర్జెన్సీ బ్లాక్ నిర్మిం చేందుకు ప్రభుత్వ సహకారం అవసరం. ఆస్పత్రిలోని అనేకచోట్ల పేషెంట్ అటెండర్ షెల్టర్లు ఏర్పాటు చేశారు. వీటిలో రోగుల సహాయకులు కనీస అవసరాలు తీర్చుకునే సదుపాయాలు లేవు. కొన్నిచోట్ల చోరీలు జరుగుతున్నాయి. వర్షం వస్తే ఉండలేని పరిస్థితులున్నాయి.
వైద్యులపై దృష్టి సారించాలి..
కొన్నాళ్లుగా కీలకకేసుల్లో ఆస్పత్రి వైద్యుల పాత్ర బహి ర్గతమవుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి వైద్యులకు హెచ్చ రికలు జారీచేయాల్సి ఉంది. కీలకస్థానాల్లోని అధికారులు, విభాగాధిపతులు ప్రైవేటు సేవల్లో తరిస్తున్నారన్న విమర్శ లున్నాయి. ఆస్పత్రి పనివేళల్లో కొందరు వైద్యులు ప్రైవేటు కు ప్రాధాన్యతనిస్తుండడంతో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందడం లేదనే విమర్శలున్నాయి. వీటిపై మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించాలి.
భవనాలపై దృష్టి సారించేనా.?
గత ప్రభుత్వ హయాంలో ఆస్పత్రిలోని కొన్ని విభాగాల భవనాలను కూల్చివేశారు. నూతన భవనాలకు ప్రతిపాదనలు చేసి నాడు-నేడులో భాగంగా పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. నిధులు మంజూరు చేయకపోవడం, ఇతర కారణాలతో పనులు ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో నూతన భవన నిర్మాణాలు చేపట్టేలా మంత్రి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
క్యాన్సర్‌కు అత్యాధునిక వైద్యం
కేజీహెచ్‌కు రూ.45 కోట్లతో మూడు పరికరాలు సమకూర్చిన ప్రభుత్వం
విశాఖపట్నం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి):
కేజీహెచ్‌లో అత్యాధునిక క్యాన్సర్ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం సుమారు రూ.45 కోట్లు వెచ్చించి ప్రభుత్వం మూడు పరికరాలు కొనుగోలు చేసింది. వీటిని సోమవారం ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించనున్నారు. ప్రభుత్వం సమకూర్చిన పరికరాల్లో లీనియర్ యాక్సెలరేటర్, హెచ్‌డీఆర్ బ్రాకీ థెరపీ, సీటీ సిమ్యులేటర్ ఉన్నాయి. లీనియర్ యాక్సెలరేటర్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ అందించేందుకు ఉపకరిస్తుంది. హెచ్‌డీఆర్ బ్రాకీ థెరపీ మెషీన్ ద్వారా శరీరంలోని అంతర్గత భాగాల్లో ఉన్న కణతుల లోపలకు రేడియేషన్ ఇవ్వవచ్చు. ఇక సీటీ సిములేటర్ ద్వారా స్కానింగ్ చేస్తారు. ఈ ఇమేజ్‌లు కంప్యూటర్ కాంటోరింగ్ స్టేషన్‌లో పూర్తిస్థాయిలో పరిశీలించి ఏ భాగానికి రేడియేషన్ ఇవ్వాలో గుర్తిస్తారు. దీనివల్ల సూక్ష్మ కణితులు, ఇతర భాగాలపై రేడియేషన్ ప్రభావం పడకుండా చూడవచ్చని వైద్యులు చెబుతున్నారు. వీటి సాయంతో మెదడు నుంచి కాలిబొటని వేలి వరకూ వచ్చే ఏ క్యాన్సర్‌కు అయినా మెరుగైన చికిత్సను అందిస్తామని విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అర సెంటీమీటర్ నుంచి 40 సెంటీ మీటర్ల పరిమాణం ఉన్న క్యాన్సర్‌కైనా అత్యాధునిక పద్ధతుల్లో వైద్యం అందించే వీలుంటుందన్నారు.