గోమంగి వాసుల కల నెరవేరేనా?
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:29 PM
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో మన్యంలోని పెదబయలు మండలంలో గోమంగిని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పరిశీలిస్తున్న వేళ గోమంగి వాసుల కల నెరవేరుతుందనే ఆశాభావం వ్యక్తమవుతున్నది.
పెదబయలు మండలంలో గోమంగి పేరిట ప్రత్యేక మండలం ఏర్పాటుకు ప్రతిపాదనలు
మూడు దశాబ్దాలుగా గోమంగి మండల సాధనపై ఉద్యమాలు
ఇప్పటికే వై.రామవరం మండలాన్ని విభజించి గుర్తేడు మండలం ఏర్పాటుకు సర్కారు కసరత్తు
కూటమి ప్రభుత్వంపైనే గిరిజనుల ఆశలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో మన్యంలోని పెదబయలు మండలంలో గోమంగిని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పరిశీలిస్తున్న వేళ గోమంగి వాసుల కల నెరవేరుతుందనే ఆశాభావం వ్యక్తమవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునర్విభజన, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, మండలాల విభజనపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో జిల్లాలోని పెదబయలు మండలాన్ని రెండుగా విభజించి గోమంగి మండలాన్ని ఏర్పాటు చేయాలని రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. దీంతో దానిపై బుధవారం మంత్రులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్వహించిన సమావేశంలో సైతం ప్రస్తావనకు వచ్చింది. ఏజెన్సీలోని ప్రత్యేక మండలాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్నది. ఈ తరుణంలో తాజాగా ఆ అంశం కూటమి ప్రభుత్వ పరిశీలనలో ఉండడంతో గోమంగి వాసుల కల నెరవేరుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మూడు దశాబ్దాలుగా మండలం కోసం పోరాటం
పెదబయలు మండలంలో గోమంగి కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేయాలని గోమంగి మండల సాధన సమితి పేరిట మూడు దశాబ్దాలుగా ఉద్యమాలు, పోరాటాలు కొనసాగుతున్నాయి. గోమంగి కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ అప్పటి నుంచి ప్రతి ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. పెదబయలు మండలంలో మొత్తం 23 పంచాయతీలుండగా, వాటిలో మండల కేంద్రంగా ప్రతిపాదిస్తున్న గోమంగికి చేరువగా ఉన్న గుల్లెలు, బొంగరం, లింగేటి, ఇంజెరి, జామిగూడ, గిన్నెలకోట, కుంతర్ల, పెదకోడాపల్లి, కిముడుపల్లి, బొండాపల్లి, లక్ష్మిపేట, వనభంగి, పొయిపల్లి, కొరవంటి వంటి మొత్తం 15 పంచాయతీలను కలిపి గోమంగి కేంద్రంగా మండలం ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంత గిరిజనులకు ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా ఉన్న ఈ డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమకు న్యాయం చేయాలని మండల సాధన సమితి అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, నేతలు కొమ్మ బాలరాజు, కె.అనంతపద్మనాభం, కంబిడి యువరాజు, తదితరులు కోరుతున్నారు.
గుర్తేడు మండలం ఏర్పాటుకు కసరత్తు
జిల్లాలో రంపచోడవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని వై.రామవరం మండలాన్ని విభజించి కొత్తగా గుర్తేడు పేరిట మరో మండలాన్ని ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. వై.రామవరం మండలంలో మొత్తం 137 గ్రామాలున్నాయి. వాటిలో వై.రామవరంలో 78 గ్రామాలు వై.రామవరంలో కొనసాగిస్తూ, గుర్తేడుకు చేరువగా ఉన్న 59 గ్రామాలను కలుపుతూ కొత్తగా గుర్తేడు మండలాన్ని ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే జీవో:836ను జారీ చేసి, రెండు మార్లు దానిపై నోటిఫికేషన్లను సైతం ఇచ్చింది. దీంతో త్వరలో గుర్తేడు వాసుల కల నెరవేరబోతున్నది. ఇదే క్రమంలో గోమంగి మండలం ఏర్పాటుపైనా కూటమి ప్రభుత్వం పరిశీలన జరుపుతుండడంతో తమ కల నెరవేరుతుందనే ఆశలు కలుగుతున్నాయని గోమంగి వాసులు అంటున్నారు.