వైద్యుల వసతి గృహాలు పూర్తయ్యేదెన్నడో?
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:36 PM
చింతపల్లిలో వైద్యుల వసతి గృహాల నిర్మాణం కలగానే మిగిలిపోయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధులు విడుదల చేయకపోవడంతో వసతి గృహాల నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు ప్రారంభం
వైసీపీ ప్రభుత్వ హయాంలో బిల్లుల విడుదలలో జాప్యం
నిలిచిపోయిన పనులు
చింతపల్లిలో అద్దె ఇళ్లు లభించక వైద్యుల అవస్థలు
చింతపల్లి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): చింతపల్లిలో వైద్యుల వసతి గృహాల నిర్మాణం కలగానే మిగిలిపోయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధులు విడుదల చేయకపోవడంతో వసతి గృహాల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలే ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలోనైనా నిర్మాణ పనులు పూర్తవుతాయని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వైద్యులు స్థానికంగా నివాసం ఉండాలంటే ఇళ్లు అందుబాటులో ఉండాలని భావించిన గత టీడీపీ ప్రభుత్వం 2018వ సంవత్సరంలో చింతపల్లిలో క్వార్టర్స్ నిర్మాణానికి రూ.70 లక్షలు మంజూరు చేసింది. కాంట్రాక్టర్ వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించారు. 2019 ఫిబ్రవరిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం పునాదుల బిల్లు రూ.13 లక్షలు విడుదల చేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం క్వార్టర్స్ నిర్మాణానికి ఎటువంటి ఆటంకం తెలపకపోవడంతో కాంట్రాక్టర్ నిర్మాణాలను కొనసాగించారు. 2019 నవంబరు నాటికి పునాదుల బిల్లు రూ.13 లక్షలతో పాటు అదనంగా రూ.18 లక్షలు పెట్టుబడి పెట్టి రెండు అంతస్థులు నిర్మించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం రెండో విడత బిల్లు రూ.18 లక్షలు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్ పనులను నిలిపివేశారు. కాగా రెండేళ్ల నిరీక్షణ అనంతరం రూ.18 లక్షల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే రెండో విడత బిల్లులు చెల్లించేందుకు రెండేళ్ల సమయం పట్టిందని, నిర్మాణాలు పూర్తిచేసినా బిల్లులు వస్తాయో?, రావోననే సందేహంతో కాంట్రాక్టర్ పనులను పునఃప్రారంభించలేదు.
వైద్యులకు వసతి సమస్యలు
చింతపల్లిలో క్వార్టర్ల నిర్మాణాలు పూర్తికాకపోవడంతో వైద్యులు వసతి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తున్నది. చింతపల్లి, జీకేవీధి మండలాల పీహెచ్‌సీలు, స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో నివాసముంటున్న వైద్యులు చింతపల్లిలో ఇళ్లను అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. కొంతమంది వైద్యులకు అన్ని వసతులు కలిగిన అద్దె ఇళ్లు లభించక నర్సీపట్నం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం చింతపల్లిలో డబుల్ బెడ్ రూమ్‌లు, మరుగుదొడ్లు కలిగిన ఇళ్లు దొరకడం లేదు. ఈ కారణంగానే ఎక్కువ మంది వైద్యులు చింతపల్లిలో బస చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. కాగా అసంపూర్తిగా ఉన్న వైద్యుల క్వార్టర్లు ప్రస్తుతం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. రాత్రి వేళల్లో మందుబాబులు ఇక్కడికి వచ్చి మద్యం సేవిస్తున్నారు. దీంతో ఈ భవనం పరిసరాల్లో మద్యం సీసాలు పేరుకుపోతున్నాయి.
వైద్యుల క్వార్టర్స్ అందుబాటులోకి వస్తే..
వైద్యుల క్వార్టర్స్ అందుబాటులోకి వస్తే ఆరుగురు వైద్యులు కుటుంబంతో నివాసం ఉండే అవకాశం కలుగుతుంది. క్వార్టర్స్‌లోని మూడు అంతస్థుల్లో ఆరు ఫ్లాట్లు నిర్మించనున్నారు. ఇందులో వైద్యులకు అవసరమైన పూర్తి స్థాయి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. కూటమి ప్రభుత్వం వైద్యుల క్వార్టర్స్ పూర్తి చేసేందుకు కృషి చేయాలని వైద్యులు, ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.