కాజ్‌వేను పునరుద్ధరించరా?
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:24 AM
చోడవరం- వడ్డాది మధ్య బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట వద్ద తాచేరు నది వరద ఉధృతికి కాజ్‌వే కొట్టుకుపోయి రెండు వారాలు దాటినప్పటికీ అధికారులు ఇంతవరకు పునరుద్ధరణ చర్యలు చేపట్టలేదు.
విజయరామరాజుపేట వద్ద రెండు వారాల క్రితం కొట్టుకుపోయిన లోతట్టు వంతెన
గౌరీపట్నం మార్గంలోకి వాహనాలు మళ్లింపు
ఇరుకు రోడ్డు కావడంతో స్తంభిస్తున్న ట్రాఫిక్
కాజ్‌వే పునరుద్ధరణ పనులు చేపట్టని అధికారులు
చోడవరం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): చోడవరం- వడ్డాది మధ్య బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట వద్ద తాచేరు నది వరద ఉధృతికి కాజ్‌వే కొట్టుకుపోయి రెండు వారాలు దాటినప్పటికీ అధికారులు ఇంతవరకు పునరుద్ధరణ చర్యలు చేపట్టలేదు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలను గౌరీపట్నం మీదుగా మళ్లించారు. విశాఖ, అనకాపల్లి ప్రాంతాల నుంచి చోడవరం మీదుగా బుచ్చెయ్యపేట, రావికమతం, మాడుగుల, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు, చుట్టుపక్కల మండలాలకు వెళ్లే వాహనదారులు గౌరీపట్నం మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మార్గం సింగిల్ రోడ్డు కావడం, వాహనాల రద్దీ బాగా పెరగడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభిస్తున్నది. కొన్నిచోట్ల రెండు వ్యాన్లు ఎదురైతే తప్పుకునే అవకాశం లేకపోయింది. ఏమాత్రం పక్కకు దిగినా.. బురదలో కూరుకుపోవడమో, లేకపోతే పొలంలోకి బోల్తా పడడమో జరుగుతుందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు సైతం పట్టించుకోకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా విజయరామరాజుపేట వద్ద కాజ్‌వే పునరుద్ధరణ పనులపై సంబంధిత అధికారులను వివరణ కోరగా.. రూ.30 లక్షల అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ఆమోదం లభించిన వెంటనే పనులు చేయిస్తామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి, ప్రభుత్వం నుంచి సత్వరమే నిధుల మంజూరుకు కృషి చేయాలని, వీలైనంత త్వరగా కాజ్‌వేను అందుబాటులోకి తీసుకురావాలని పలు మండలాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.