Share News

వైద్యులకు వసతి సమస్య తీరేనా?

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:12 PM

చింతపల్లిలో వైద్యులకు సరైన వసతులు గల అద్దె ఇళ్లు లభించక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చాలా మంది వైద్యులు నర్సీపట్నం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.

వైద్యులకు వసతి సమస్య తీరేనా?
చింతపల్లిలో ఆరేళ్లుగా ఆసంపూర్తి నిర్మాణాలతో దర్శనమిస్తున్న వైద్యుల వసతి గృహ సముదాయం

ఆరేళ్లుగా అసంపూర్తిగా దర్శనమిస్తున్న గృహ సముదాయం

గత వైసీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయక ముందుకు కదలని వైనం

అద్దె ఇళ్లు లభించక వైద్యుల అవస్థలు

ఎక్కువ మంది వైద్యులు నర్సీపట్నం నుంచి రాకపోకలు

చింతపల్లి, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): చింతపల్లిలో వైద్యులకు సరైన వసతులు గల అద్దె ఇళ్లు లభించక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చాలా మంది వైద్యులు నర్సీపట్నం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వాస్తవానికి ఏడేళ్ల క్రితం అప్పటి టీడీపీ ప్రభుత్వం వైద్యుల వసతి గృహ సముదాయం నిర్మాణాన్ని ప్రారంభించగా, గత వైసీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి అసంపూర్తి నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి.

వైద్యులు స్థానికంగా నివాసం ఉండాలంటే నివాస గృహాలు అందుబాటులో ఉండాలని భావించిన గత టీడీపీ ప్రభుత్వం 2018 ఆఖరిలో ఐటీడీఏ ద్వారా చింతపల్లిలో వసతి గృహాల నిర్మాణానికి రూ.70 లక్షల నిధులను మంజూరు చేసింది. అదే ఏడాది కాంట్రాక్టర్‌ నిర్మాణ పనులను ప్రారంభించారు. 2019 ఫిబ్రవరిలో అప్పటి ప్రభుత్వం పునాదుల బిల్లు రూ.13 లక్షలు విడుదల చేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ఎటువంటి ఆటంకం తెలపకపోవడంతో కాంట్రాక్టర్‌ నిర్మాణాలను యథావిధిగా కొనసాగించారు. 2019 నవంబరు నాటికి పునాదుల బిల్లు రూ.13 లక్షలతో పాటు అదనంగా రూ.18 లక్షలు పెట్టుబడి పెట్టి(మొత్తం రూ.31 లక్షలు) రెండు అంతస్థుల భవనాన్ని నిర్మించారు. ఇంకా రూ.39 లక్షలతో మూడో అంతస్థు శ్లాబ్‌, గోడలు, టైల్స్‌, విద్యుత్‌, తలుపులు, కిటికీలు ఏర్పాటు చేయాల్సి వుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన రెండో విడత బిల్లు రూ.18 లక్షలు చెల్లించకపోవడం వల్ల 2019 ఆఖరు నుంచి కాంట్రాక్టర్‌ పనులను నిలిపివేశారు. రెండేళ్ల నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు గత ప్రభుత్వం 2021 ఏప్రిల్‌లో వైద్యుల వసతి గృహ సముదాయం నిర్మాణాలకు సంబంధించిన బకాయి రూ.18 లక్షల నిధులను మంజూరుచేసింది. అయితే రెండో విడత బిల్లులు చెల్లించేందుకు రెండేళ్ల సమయం పట్టిందని, వడ్డీలు కట్టుకునేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని, పెట్టుబడులు పెట్టి భవన నిర్మాణాలు పూర్తిచేసినా బిల్లులు వస్తాయో, రావోననే సందేహంతో నిర్మాణాలు కొనసాగించేందుకు కాంట్రాక్టర్‌ ముందుకు రాలేదు. కాగా ప్రభుత్వం వైద్యుల వసతి గృహ నిర్మాణాలకు ఇచ్చిన గడువు కూడా 2021 ఆఖరుతోనే ముగిసిపోయింది.

అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా..

అసంపూర్తి వైద్యుల వసతి గృహం అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా మారింది. భవనంలో రెండు అంతస్థుల్లోనూ శ్లాబ్‌ నిర్మాణాలు పూర్తి కావడంతో రోజూ సాయంత్రం మందుబాబులు ఈ భవనం వద్దకు చేరుకుని మద్యం సేవిస్తున్నారు. దీంతో భవనం చుట్టూ మద్యం సీసాలు పేరుకుపోతున్నాయి.

వైద్యులకు వసతి సమస్య

చింతపల్లిలో వైద్యుల గృహ సముదాయం నిర్మాణాలు పూర్తికాకపోవడం వలన వైద్యులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు కొంత మంది చింతపల్లిలో అద్దె ఇళ్లల్లో నివాసముంటున్నారు. చింతపల్లిలో అన్ని వసతులు కలిగిన అద్దె ఇళ్లు లభించక మెజారిటీ వైద్యులు నర్సీపట్నం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం చింతపల్లిలో డబుల్‌ బెడ్‌ రూమ్‌, మరుగుదొడ్లు కలిగిన ఇళ్లు దొరకడం లేదు. ఒకవేళ పూర్తి సౌకర్యాలు కలిగిన ఇల్లు లభించినా నెలకు రూ.7 వేలు నుంచి రూ.10 వేల అద్దె చెల్లించాల్సి వస్తున్నది.

వైద్యుల గృహ సముదాయం అందుబాటులోకి వస్తే..

వైద్యుల గృహ సముదాయం అందుబాటులోకి వస్తే ఆరుగురు వైద్యులు కుటుంబంతో నివాసం ఉండే అవకాశం ఉంటుంది. గృహ సముదాయంలో మూడు అంతస్థుల్లో ఆరు వసతి గృహాలను నిర్మించనున్నారు. ఈ వసతి గృహాల్లో వైద్యులకు అవసరమైన పూర్తి స్థాయి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. వైద్యులు కూడా స్థానికంగా నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతారు. కూటమి ప్రభుత్వంలోనైనా ఈ వసతి గృహ సముదాయం నిర్మాణం పూర్తవుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Dec 07 , 2025 | 11:12 PM