Share News

భూ సేకరణ దారికొచ్చేనా?

ABN , Publish Date - Nov 26 , 2025 | 01:03 AM

భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానం చేస్తూ విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ప్రతిపాదించిన మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల నిర్మాణానికి భూముల సేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది.

భూ సేకరణ దారికొచ్చేనా?

మాస్టర్‌ప్లాన్‌ రహదారుల నిర్మాణానికి నిబంధనల అడ్డంకి

రిజిస్ర్టేషన్‌కు స్టాంపు డ్యూటీ మెలిక

అంతేసి మొత్తం తాము ఎందుకు కడతామంటున్న యజమానులు

గిఫ్ట్‌ డీడ్‌ కింద ఇవ్వాలని వీఎంఆర్‌డీఏ ఒత్తిడి

కలెక్టర్‌ వద్దకు పంచాయితీ ప్రభుత్వం ప్రత్యేక జీఓ ఇస్తే

తప్ప ముందుకు కదలని పనులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానం చేస్తూ విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ప్రతిపాదించిన మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల నిర్మాణానికి భూముల సేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది. మొత్తం ఏడు రహదారులను విమానాశ్రయం ప్రారంభించే నాటికి పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో రహదారుల విస్తరణకు అవసరమైన భూమిని ఇవ్వడానికి కొంతమంది ముందుకువచ్చారు. వాటిని వీఎంఆర్‌డీఏ పేరిట రిజిస్టర్‌ చేసే విషయంలో నిబంధనలు అడ్డంకిగా మారాయి. దాంతో ఇప్పటివరకూ ఒకే ఒక్క రిజిస్ట్రేషన్‌ జరిగింది. నిబంధనలు మారిస్తే తప్ప భూముల బదిలీ కాని పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఏం చేయాలా?...అని అధికారులు మథనపడుతున్నారు.

మాస్టర్‌ప్లాన్‌ రహదారులకు మొత్తం 700 మంది నుంచి భూములు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతిఫలంగా ట్రాన్సఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌ (టీడీఆర్‌) ఇస్తామని హామీ ఇచ్చారు. దీనికి స్పందించి 300 మంది వరకు ముందుకువచ్చారు. ఆయా భూములను వీఎంఆర్‌డీఏ పేరిట రిజిస్టర్‌ చేస్తే...ఆ తరువాత టీడీఆర్‌ ఇచ్చి పనులు మొదలుపెడతారు. ఈ విధంగా డాక్యుమెంట్‌ రాసుకొని ఆనందపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళితే...అధికారులు అన్నీ పరిశీలించి, దానికి నాలుగు శాతం కన్వేయన్స్‌ స్టాంపు డ్యూటీ, 0.5 శాతం ట్రాన్సఫర్‌ డ్యూటీ చెల్లించాలని సూచించారు. రైతులు ఇచ్చేవి వ్యవసాయ భూములైనా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నందున చదరపు గజాల్లోనే లెక్కిస్తున్నారు. ఇలా 500 చ.గ. స్థలం వీఎంఆర్‌డీఏ పేరిట రిజిస్టర్‌ చేయడానికి (గజం విలువ రూ.20 వేలు అనుకుంటే) సుమారు రూ.4.5 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో రైతులు వెనకడుగు వేస్తున్నారు. తమ భూములు తీసుకోవడమే కాకుండా, మళ్లీ లక్షల రూపాయలు కట్టమంటే ఎక్కడ తెస్తామంటూ వెనక్కి వెళ్లిపోతున్నారు.

గిఫ్డ్‌ డీడ్‌ చేయాలని అధికారుల ఒత్తిడి

ఈ భూములు రహదారుల నిర్మాణానికి ఇస్తున్నారు కాబట్టి ‘గిఫ్ట్‌ డీడ్‌’ కింద రిజిస్టర్‌ చేయాలని వీఎంఆర్‌డీఏ అధికారులు ఒత్తిడి పెడుతున్నారు. ఆ విధంగా చేస్తే కేవలం 0.5 శాతం ట్రాన్సఫర్‌ డ్యూటీ (500 గజాలకు రూ.50 వేలు) చెల్లిస్తే సరిపోతుందంటున్నారు. ఏదైనా స్థిర, చరాస్తులను కుటుంబ సభ్యుల మధ్యే గిఫ్ట్‌ డీడ్‌ చేస్తారు. ఇతరులకు గిఫ్ట్‌ డీడ్‌ చేయాలంటే...ఆ ఆస్తిని ఇచ్చినందుకు ప్రతిఫలం ఏమీ తీసుకోకూడదు. ఆ విషయం డాక్యుమెంట్‌లో స్పష్టంగా రాయాలి. అప్పుడే దానికి 0.5 శాతం ఫీజు కట్టించుకుంటారు. కానీ వీఎంఆర్‌డీఏ రాసిన డాక్యుమెంట్‌లో తాము ఆ భూమిని తీసుకుని బదులుగా ‘టీడీఆర్‌’ ఇస్తున్నామని పేర్కొంది. అంటే ప్రతిఫలం ఇస్తున్నారు కాబట్టి...దాని విలువ ప్రకారం 4.5 శాతం ఫీజు కట్టాలని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.

కలెక్టర్‌ వద్దకు పంచాయితీ

మాస్టర్‌ప్లాన్‌ రహదారులను త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వం చెబుతుండడం, ఇక్కడ చూస్తే భూ సేకరణ పూర్తికాకపోవడంతో ఈ పంచాయితీ కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ దృష్టికి వెళ్లింది. దాంతో రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులను ఆయన పిలిపించుకొని మాట్లాడారు. చట్టంలో నిబంధనల ప్రకారమే తాము నడుచుకోవలసి ఉందని, టీడీఆర్‌ తీసుకునే భూములను గిఫ్ట్‌ డీడ్‌ చేయడం వీలు కాదని వారు తేల్చి చెప్పారు. ఎటువంటి ఫీజు లేకుండా ఆయా భూములు రిజిస్టర్‌ చేయాలంటే ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. ఇంకా అక్కడి నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. అవి వస్తే తప్ప ఇక్కడ మాస్టర్‌ప్లాన్‌ రహదారుల నిర్మాణ ప్రక్రియ ముందుకు కదలదు.

Updated Date - Nov 26 , 2025 | 01:03 AM