Share News

డోలీ కష్టాలు తీరేదెన్నడో?

ABN , Publish Date - Mar 11 , 2025 | 11:15 PM

అటవీశాఖ అభ్యంతరాలతో మారుమూల గిరిజన గ్రామాలు రహదారి సౌకర్యానికి నోచుకోవడం లేదు. దీంతో గిరిజనులకు డోలీమోతలు తప్పడం లేదు.

డోలీ కష్టాలు తీరేదెన్నడో?
ఇద్దరు వృద్ధులను మంగళవారం డోలీల్లో తరలిస్తున్న దృశ్యం

అటవీశాఖ అనుమతులు లేక నిలిచిపోయిన రహదారి నిర్మాణ పనులు

పలు గ్రామాల గిరిజనులకు తప్పని పాట్లు

అత్యవసర సమయాల్లో డోలీలో తరలించాల్సిన దుస్థితి

తాజాగా బూరిగ గ్రామం నుంచి ఇద్దరు వృద్ధులను నాలుగు కిలో మీటర్ల మేర మోసుకెళ్లిన వైనం

అనంతగిరి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): అటవీశాఖ అభ్యంతరాలతో మారుమూల గిరిజన గ్రామాలు రహదారి సౌకర్యానికి నోచుకోవడం లేదు. దీంతో గిరిజనులకు డోలీమోతలు తప్పడం లేదు.

మండలంలోని రొంపల్లి పంచాయతీ బూరిగ గ్రామానికి చెందిన బూరిగ మల్లమ్మ(70), సోముల జోగయ్య(72) వృద్ధులు కావడంతో వారికి నడిచే ఓపిక లేదు. ఈ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో వాహనంలో వెళ్లే అవకాశం కూడా లేదు. వీరిద్దరూ మంగళవారం మెంటాడలోని బ్యాంక్‌లో తమ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయితే గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో బూరిగ నుంచి వాణిజ వరకు సుమారు నాలుగు కిలో మీటర్లు డోలీల్లో వారి కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ నుంచి ఆటోలో మెంటాడలోని బ్యాంక్‌కు తీసుకు వెళ్లారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో డోలీల్లో వెళ్లాల్సి వస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు.

రహదారి నిర్మాణానికి అడ్డంకులు

2024లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మెంటాడ మండలం వాణిజ నుంచి అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ బూరిగ, చినకోనెల గ్రామాలకు రహదారి నిర్మాణానికి సుమారు రూ. 3 కోట్లు మంజూరయ్యాయి. అయితే అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో కొంత వరకు జరిగిన రోడ్డు పనులు మధ్యలో నిలిచిపోయాయి. దీంతో బూరిగ, చినకోనెలతో పాటు ఎన్‌ఆర్‌పురం పంచాయతీ చిముడువలస, రాయపాడు, డెంజనివలస, పెదవలస గ్రామాలకు రహదారి నిర్మాణం జరగలేదు. దీని వల్ల ఆయా గ్రామాల గిరిజనులకు డోలీమోతలు తప్పడం లేదు. రహదారి నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు ఇవ్వాలని గిరిజనులు ఇటీవల నిరసనలు కూడా తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అటవీశాఖ అనుమతులు ఇచ్చేలా చూడాలని గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - Mar 11 , 2025 | 11:15 PM