Share News

పరిహారం పెంపుపై సీఎం దృష్టికి తీసుకెళతా

ABN , Publish Date - Sep 06 , 2025 | 11:48 PM

ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన అరకు కాఫీకి బెర్రీ బోరర్‌ తెగులు సోకడంతో రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి కోరారు.

పరిహారం పెంపుపై సీఎం దృష్టికి తీసుకెళతా
వ్యాధి సోకిన కాఫీకాయలను ఉడకబెట్టి భూమిలో పాతిపెడుతున్న విధానాన్ని పరిశీలిస్తున్న మంత్రి సంధ్యారాణి

కాఫీ రైతులు ఆందోళన చెందవద్దు

ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది

అరకు కాఫీ చంద్రబాబు మానస పుత్రిక

జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి

అరకులోయ, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన అరకు కాఫీకి బెర్రీ బోరర్‌ తెగులు సోకడంతో రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి కోరారు. ఈ తెగులు నివారణకు అధికార యంత్రాంగం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందన్నారు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం పెంపు విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళతానన్నారు. శనివారం కాఫీ పంటకు బెర్రీ బోరర్‌ తెగులు సోకిన పకనకూడి గ్రామాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కాఫీ తోటలకు ఈ తెగులు ఎలా సోకిందో కాఫీ బోర్డు అధికారులు,జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులు మంత్రికి వివరించారు. తొలుత రెండు ఎకరాలకు సోకిందని, రెండు రోజుల్లో 20 ఎకరాలకు వ్యాప్తి చెందిందన్నారు. ప్రస్తుతం చినలబుడు పంచాయతీ పరిధిలోని పకనకూడి, మాలివలస, మాలసింగారం, చినలబుడు, తుర్రాయిగుడ,తుడుం గ్రామాల్లోని80 ఎకరాలకు ఈ తెగులు వ్యాప్తి చెందిందని వివరించారు. ప్రస్తుతం కాఫీ కాయలన్నింటిని ఏరివేసి బాగా వేడినీళ్లలో ఉడకబెట్టి గోతులు తీసి పూడ్చివేస్తున్నట్టు అధికారులు వివరించారు. ఈ ప్రక్రియను ఎలా చేస్తున్నారో మంత్రి సంధ్యారాణికి అధికారులు చూపించారు. కాఫీ కాయలను తొలగించే పనులు ముమ్మరంగా చేపట్టామని కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ వివరించారు. అదేవిధంగా కిలో కాఫీ కాయలకు రూ.50, పూడ్చివేసేందుకు రూ.5వేలు చెల్లిస్తున్నట్టు తెలిపారు. అనంతరం మంత్రి పకనకూడి రైతులతో మాట్లాడారు. కాఫీ కాయలను ఏరివేస్తుంటే కడుపు తరుక్కు పోతుందమ్మా అంటూ మంత్రి ఎదుట గిరిజన రైతులు ఆవేదనను వ్యక్తం చేశారు. ఎకరా తోటలో తక్కువలో తక్కువ 400 కిలోల కాఫీ పప్పు వచ్చేదని, దానిని విక్రయిస్తే రూ.60 వేలు వచ్చేదని, బాగా ధర ఉంటే రూ.90 వేలు వరకు వచ్చేదన్నారు. ప్రస్తుతం ఇస్తున్న నష్టపరిహారం చాలదని, ప్రభుత్వం పెద్దమనసుతో ఆలోచించి పరిహారం పెంచాలని గిరిజర రైతులు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ కాఫీకి బెర్రీ బోరర్‌ తెగులు సోకడంపై విచారణ కమిటీ వేశామన్నారు. ఈ వ్యాధి సోకిన తోటల్లో మూడేళ్లపాటు వ్యాధి నిరోధక చర్యలు కొనసాగిస్తామన్నారు. అవసరమైతే కొత్త మొక్కలను పంపిణీ చేస్తామన్నారు.

చంద్రబాబునాయుడు బాధపడ్డారు : మంత్రి సంధ్యారాణి

కాఫీకి బెర్రీ బోరర్‌ తెగులు సోకిందనే విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా బాధపడ్డారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పకనకూడి గ్రామంలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ అరకు కాఫీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మానసపుత్రిక అని అన్నారు. క్యాబినెట్‌ సమావేశంలో ఈ ప్రస్తావన తెస్తూ చాలా బాధపడ్డారని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తాను కాఫీ తోటల పరిశీలనకు వచ్చానన్నారు. కాఫీ రైతులను ఆదుకుంటుందని, ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమై నివారణ చర్యలు తీసుకుంటుందన్నారు. నష్టపరిహారం చాలదని గిరిజన రైతులు అంటున్నారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానన్నారు. తర్వాత పకనకూడి గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని మంత్రి సంధ్యారాణి సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు చిన్నారులకు పౌష్టికాహారం మంచిగా పెట్టాలని, పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అదే గ్రామంలో పలువురు ఇళ్లకు వెళ్లి స్మార్ట్‌ రేషన్‌ కార్డులను మంత్రి సంధ్యారాణి, కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ పంపిణీ చేశారు.

Updated Date - Sep 06 , 2025 | 11:48 PM