అగ్రి ల్యాబ్ అందుబాటులోకి వచ్చేనా?
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:22 AM
రైతులకు ఎంతో మేలు చేసే అగ్రి ల్యాబ్ అందుబాటులోకి రాకుండాపోయింది. గత వైసీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ల్యాబ్ నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. దీంతో ఈ ల్యాబ్ భవనం పరిసరాలు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. భవనం తలుపులు, కిటికీలు పాడైపోతున్నాయి. కూటమి ప్రభుత్వం ఈ ల్యాబ్ నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు.
- 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులకు శ్రీకారం
- సబ్బవరంలో ఐదు ఎకరాల్లో భవన నిర్మాణం ప్రారంభం
- వైసీపీ ప్రభుత్వం వచ్చాక గ్రహణం
- 2022 నాటికి 90 శాతం పనులు పూర్తి
- నిధులు విడుదల చేయకపోవడంతో బ్రేక్
- పిచ్చిమొక్కలతో నిండిపోయిన భవనం పరిసరాలు
- కూటమి ప్రభుత్వంలోనైనా పనులు పూర్తవుతాయని రైతుల ఆశాభావం
సబ్బవరం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఎంతో మేలు చేసే అగ్రి ల్యాబ్ అందుబాటులోకి రాకుండాపోయింది. గత వైసీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ల్యాబ్ నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. దీంతో ఈ ల్యాబ్ భవనం పరిసరాలు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. భవనం తలుపులు, కిటికీలు పాడైపోతున్నాయి. కూటమి ప్రభుత్వం ఈ ల్యాబ్ నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు.
పంటల సాగుకు విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులతో పాటు భూసార పరీక్షలు కీలకం. భూసార పరీక్షా కేంద్రాలు గతంలో ఉమ్మడి విశాఖ జిల్లాలోని జేడీ కార్యాలయంలో ఉండేవి. అయితే వీటిని రైతులకు మరింత చేరువ చేసేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక సమీకృత వ్యవసాయ ప్రయోగశాలను, ఉమ్మడి విశాఖ జిల్లా మొత్తానికి సబ్బవరంలో ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది.
అగ్రి ల్యాబ్‌కు సబ్బవరంలో ఐదు ఎకరాల భూమిని 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం కేటాయించింది. భవన నిర్మాణానికి రూ.3.5 కోట్లు, మౌలిక సదుపాయలు, ల్యాబ్ పరికరాల కోసం రూ.2.5 కోట్లు కేటాయించింది. అన్ని వసతులతో 2019 ఖరీఫ్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని భావించింది. కాగా 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ల్యాబ్ పనులకు గ్రహణం పట్టింది. అయితే నిధులు మంజూరై, పరిపాలనా పరమైన అనుమతులు ఉండడంతో 2020లో అగ్రి ల్యాబ్ పనుల బాధ్యతను రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించింది. భవన నిర్మాణ వ్యయాన్ని రూ.3.5 కోట్లు నుంచి రూ.3.25 కోట్లకు కుదించి టెండర్ పిలిచింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో టెండర్ నిర్వహించి తక్కువ కోట్ చేసిన సంస్థకు పనులు అప్పగించింది. 2021 ఖరీఫ్ నాటికి అందుబాటులోకి తీసుకు వస్తామని అప్పటి నేతలు, అధికారులు ప్రకటించారు. అయితే నత్తనడకన సాగిన పనులు 2022 నాటికి 90 శాతం మేర పనులు పూర్తయ్యాయి. ఇంకా రూ.40 లక్షలకు సంబంధించిన పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. గత ప్రభుత్వం ఆ నిధులు మంజూరు చేయకపోవడంతో 2023 నుంచి పనులు ముందుకు కదల్లేదు. విద్యుత్, ఫ్లోరింగ్, ప్లంబింగ్ పనులు, భవనం చుట్టూ ప్రహరీ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతో ప్రస్తుతం భవనం పరిసరాలు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి.
అగ్రి ల్యాబ్‌తో రైతులకు ఎంతో మేలు
అగ్రి ల్యాబ్ నిర్మాణం పూర్తయితే రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. మట్టి నమూనాలు, ఎరువులు, విత్తనాల పరీక్షలను ఇక్కడ ఉచితంగా నిర్వహిస్తారు. మట్టి నమూనా పరీక్షల ఆధారంగా పొలంలో ఏ పంట సాగు చేయాలి?, ఏయే సూక్ష్మపోషకాలు(ఎరువులు) వేయాలి? అనేది తెలుస్తుంది. ప్రైవేటు దుకాణాల్లో రైతులు కొనుగోలు చేసే రసాయన ఎరువులు, విత్తనాల నమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షిస్తారు. నిర్దేశించిన ప్రమాణాలు లేకపోతే సంబంధిత వ్యాపారులు, సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కూటమి ప్రభుత్వంలోనైనా ఈ ల్యాబ్ అందుబాటులోకి వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.