జీవీఎంసీకి కమిషనర్ వచ్చేనా?
ABN , Publish Date - May 05 , 2025 | 12:12 AM
రాష్ట్రంలోనే అతిపెద్ద మునిసిపల్ కార్పొరేషన్‌గా గుర్తింపు పొందిన మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ)ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నాలుగు నెలలుగా ఖాళీగా పోస్టు
భర్తీపై దృష్టి సారించని సర్కారు
కలెక్టర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు
కొరవడిన పర్యవేక్షణ
అధికారులు, సిబ్బందిలో నిస్తేజం
గాడి తప్పిన పారిశుధ్య నిర్వహణ
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలోనే అతిపెద్ద మునిసిపల్ కార్పొరేషన్‌గా గుర్తింపు పొందిన మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ)ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు నాలుగునెలలుగా కమిషనర్ పోస్టును భర్తీ చేయకపోవడం దీనికి నిదర్శనంగా పేర్కొంటున్నారు. కలెక్టర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినా, పనిఒత్తిడితో జీవీఎంసీపై దృష్టిసారించలేకపోతున్నారని, అత్యవసర ఫైళ్లు మినహా మిగిలిన వాటి జోలికి వెళ్లడం లేదని సమాచారం. అంతేకాదు క్షేత్రస్థాయి పర్యటనలు లేకపోవడంతో అధికారులు, కిందిస్థాయి సిబ్బందిలో అలసత్వం పెరిగి నగరంలో పారిశుధ్య నిర్వహణ, అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతోందని నగరవాసులు వాపోతున్నారు.
సుమారు 681 చదరపు కిలోమీటర్ల పరిధి, 21 లక్షలకు పైగా జనాభా, ఎనిమిది జోన్లు, రూ.4,500 కోట్లు వార్షిక బడ్జెట్ ఉన్న జీవీఎంసీ రాష్ట్రంలోనే అతి పెద్ద కార్పొరేషన్. ఇక్కడ ఏటా రూ.వెయ్యి కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. ఇంతటి ప్రాధాన్యం ఉండడంతో జీవీఎంసీ కమిషనర్ పోస్టు కోసం ఐఏఎస్ అధికారుల్లో పోటీ ఉంటుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పి.సంపత్‌కుమార్‌ను జీవీఎంసీ కమిషనర్‌గా నియమించింది. సమర్ధ అధికారిగా గుర్తింపు తెచ్చుకోవడంతో మునిసిపల్, పట్టణాభివృద్ధిశాఖ కమిషనర్‌గా ఈ ఏడాది జనవరిలో బదిలీ చేసింది. ఆ స్థానంలో మరో అధికారిని నియమించలేదు. కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. కలెక్టర్‌కు తన సాధారణ విధులు నిర్వర్తించడానికే సమయం సరిపోతుండడంతో జీవీఎంసీపై దృష్టిసారించే అవకాశం కనిపించడం లేదు. పూర్తిస్థాయి కమిషనర్ ఉంటే ప్రతి రోజూ క్షేత్రస్థాయి పర్యటనలు చేసి, పారిశుధ్య నిర్వహణ, వీధిలైట్లు, రోడ్లు, తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను గుర్తించడం, వార్డుల్లో జరిగే అభివృద్ధి పనులను తనిఖీ చేసి, అధికారులకు సూచనలు, ఆదేశాలు ఇచ్చే వీలుంటుంది. నగరవాసులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు, తెలుసుకునే అవకాశం లభిస్తుంది. దీనివల్ల అధికారుల్లో జవాబుదారీతనం పెరిగి, సమర్థంగా పనిచేస్తారు. కాంట్రాక్టర్లు కూడా పనుల్లో నాణ్యత లోపిస్తే కమిషనర్ బిల్లులను నిలిపివేస్తారని, బ్లాక్‌లిస్టులో పెడతారని భయపడేవారు.
కుంటుపడుతున్న పాలన
జీఈఎంసీకి నాలుగు నెలలుగా కమిషనర్ లేకపోవడంతో క్షేత్రస్థాయి పర్యటనలు లేకుండా పోయాయి. దీంతో అధికారులు, కాంట్రాక్టర్లు, సిబ్బందిలో అలసత్వం పెరిగి, బాధ్యతలను గాలికి వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా నగరంలో ఎక్కడికక్కడ చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. వేసవి ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో జాతీయరహదారి, ఇతర ప్రధాన రహదారుల సెంటర్‌మీడియన్లు, గ్రీన్‌బెల్ట్‌లో మొక్కలు చనిపోతున్నాయి. ఉన్న వాటిని సరిగా ట్రిమ్మింగ్ చేయక కళావిహీనంగా గోచరిస్తున్నాయి. మరోవైపు పాలనాపరంగా ఇబ్బందులు తప్పడం లేదు. కలెక్టర్ రోజూ జీవీఎంసీకి వచ్చి సమీక్షలు నిర్వహించడం, పరిపాలనాపరమైన వ్యవహారాలను చక్కదిద్డడం, అధికారులకు ఆదేశాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అత్యవసర ఫైళ్లను మాత్రమే తనవద్దకు తీసుకురావాలని అధికారులకు సూచిస్తున్నారు. దీంతో మిగిలినవి పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. మరోవైపు అధికారులు మొక్కుబడిగా కార్యాలయానికి వచ్చిపోతున్నారు.
ఇద్దరు ఏడీసీలదే భారం
ప్రజారోగ్యం, రెవెన్యూ, వార్డు సచివాలయాల విభాగాలకు అదనపు ఏడీసీగా పనిచేసిన సోమన్నారాయణ బదిలీపై వెళ్లిపోగా ఆ స్థానంలో కొత్తవారిని నియమించలేదు. దీంతో ఇద్దరు ఏడీసీలే అన్ని వ్యవహారాలను చూసుకుంటున్నారు. వారిలో కూడా ఒకరు ఏపనిలోనూ నేరుగా జోక్యం చేసుకోవడం లేదు. దీంతో జీవీఎంసీలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ పోస్టును సత్వరమే భర్తీచేసేలా ప్రభుత్వంపై ప్రజా ప్రతినిధులు ఒత్తిడి తేవాలని నగరవాసులు కోరుతున్నారు.