పింఛన్లకు వితంతువుల నిరీక్షణ
ABN , Publish Date - Jun 19 , 2025 | 01:22 AM
దేవుడు వరమిచ్చినా... పూజారి కరుణించలేదన్న చందంగా ఉంది జిల్లాలో అర్హులైన వితంతు పింఛన్‌దారుల పరిస్థితి. పింఛన్‌దారుడైన భర్త చనిపోతే, అతని భార్యకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించగా, జిల్లాలో అమలుచేసే విషయంలో అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వితంతువులకు ఆర్థిక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నది.
భర్త చనిపోయిన వారికి పెన్షన్లు ఇవ్వాలని ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఆమోదం
గ్రామ/ వార్డు సచివాలయాలకు అర్హుల జాబితాలు
క్షేత్రస్థాయిలో సర్వే చేసి తుది జాబితా అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు
అర్హుల తుది జాబితాలను ఇంతవరకు ఖరారు చేయని సచివాలయాల సిబ్బంది
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
దేవుడు వరమిచ్చినా... పూజారి కరుణించలేదన్న చందంగా ఉంది జిల్లాలో అర్హులైన వితంతు పింఛన్‌దారుల పరిస్థితి. పింఛన్‌దారుడైన భర్త చనిపోతే, అతని భార్యకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించగా, జిల్లాలో అమలుచేసే విషయంలో అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వితంతువులకు ఆర్థిక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నది.
గత వైసీపీ ప్రభుత్వం భర్తలను కోల్పోయిన వితంతువులకు పింఛన్‌లు మంజూరులో తీవ్ర జాప్యం చేసింది. దీంతో ఎన్టీఆర్ భరోసా పథకం కింద వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న భర్త మృతి చెందితే, ఆయా వితంతువుకు పింఛన్ అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఈ నెల మొదటి వారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదించింది. 2023 డిసెంబరు 4వ తేదీ నుంచి 2024 అక్టోబరు 31వ తేదీ వరకు జిల్లాలో 3,904 మంది పురుషులు పింఛన్ తీసుకుంటూ వివిధ కారణాలతో మృతిచెందారు. మండలాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే.. అనకాపల్లి మండలంలో 184 మంది, జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలో 135, అచ్యుతాపురంలో 171, బుచ్చెయ్యపేటలో 160, చీడికాడలో 129, చోడవరంలో 177, దేవరాపల్లిలో 157, గొలుగొండలో 144, కె.కోటపాడులో 197, కశింకోటలో 157, కోటవురట్లలో 151, మాకవరపాలెంలో 163, మునగపాకలో 125, నక్కపల్లిలో 147, నర్సీపట్నం మండలంలో 80, నర్సీపట్నం మునిసిపాలిటీలో 87, నాతవరంలో 187, పరవాడలో 98, పాయరావుపేటలో 192, రాంబిల్లిలో 122, రావికమతంలో 176, రోలుగంటలో 157, ఎస్.రాయవరంలో 166, సబ్బవరంలో 129, వి.మాడుగులలో 166, ఎలమంచిలి మునిపిపాలిటీలో 72, ఎలమంచిలి మండలంలో 77 మంది వున్నారు. వితంతువులైన వీరి భార్యలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తక్షణమే వితంతు పింఛన్‌లు అందించాలని నిర్ణయించి గ్రామ/ వార్డు సచివాలయాలకు ప్రభుత్వం అర్హుల జాబితాను పంపింది. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, అర్హుల నుంచి ధ్రువీకరణ పత్రాలను స్వీకరించి సెర్ప్ వెబ్‌సైట్‌లో మండల అధికారులు అప్‌లోడ్ చేయాలి. అయితే యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణ బిజీగా ఉన్న సచివాలయాల సిబ్బంది, వితంతువుల పింఛన్‌లకు అర్హుల జాబితాలను ఇంకా పూర్తి చేయలేదని తెలిసింది. వాస్తవానికి ఈ నెల 12వ తేదీ నుంచి కొత్తగా వితంతు పింఛన్‌లు మంజూరైన వారికి డబ్బులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇంతవరకు ఈ ప్రక్రియ మొదలు కాకపోవడంతో ఆయా లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా డీఆర్‌డీఏ అధికారులు చొరవ తీసుకొని కొత్తగా వితంతు మంజూరైన వారి వివరాలు సేకరించ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని పలువురు కోరుతున్నారు.