Share News

కాఫీ ధరలు ప్రకటించడంలో జాప్యమేల?

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:33 PM

గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు పండించిన కాఫీకి మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తున్న గిరిజన సహకార సంస్థ (జీసీసీ), ఐటీడీఏ నిర్వహణలో ఉన్న ది విశాఖ చింతపల్లి గిరిజన కాఫీ ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం లిమిటెడ్‌(మ్యాక్స్‌) ధరలు ప్రకటించడంలో జాప్యం చేస్తున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాది జీసీసీ, మ్యాక్స్‌ అధికారులు అక్టోబరులోనే కాఫీ ధరలను ప్రకటించి నవంబరు మొదటి వారం నుంచి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించేవారు. ఈ ఏడాది నవంబరు మొదటి వారం ముగిసినప్పటికి అపెక్స్‌ కమిటీ సమావేశం కాకపోవడంతో కాఫీ ధరలు ప్రకటించలేదు.

కాఫీ ధరలు ప్రకటించడంలో జాప్యమేల?
కొత్తపల్లి గ్రామంలో కోతదశకు వచ్చిన కాఫీ పండ్లు

నవంబరు మొదటి వారం ముగిసినా

సమావేశం కాని అపెక్స్‌ కమిటీ

మ్యాక్స్‌, జీసీసీ ధరల కోసం రైతుల ఎదురుచూపు

వర్షాలు అనుకూలించడంతో ఈ ఏడాది

ముందుగా దిగుబడులు ప్రారంభం

సేకరణ ప్రారంభించిన గిరిజన రైతులు

చింతపల్లి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు పండించిన కాఫీకి మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తున్న గిరిజన సహకార సంస్థ (జీసీసీ), ఐటీడీఏ నిర్వహణలో ఉన్న ది విశాఖ చింతపల్లి గిరిజన కాఫీ ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం లిమిటెడ్‌(మ్యాక్స్‌) ధరలు ప్రకటించడంలో జాప్యం చేస్తున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాది జీసీసీ, మ్యాక్స్‌ అధికారులు అక్టోబరులోనే కాఫీ ధరలను ప్రకటించి నవంబరు మొదటి వారం నుంచి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించేవారు. ఈ ఏడాది నవంబరు మొదటి వారం ముగిసినప్పటికి అపెక్స్‌ కమిటీ సమావేశం కాకపోవడంతో కాఫీ ధరలు ప్రకటించలేదు. కాగా ప్రైవేటు వర్తకులు, ఎఫ్‌పీవోలు కాఫీ పండ్లు కిలోకి రూ.60 ధరకు కొనుగోలు ప్రారంభించారు. ప్రభుత్వరంగ సంస్థలు ధరలు ప్రకటించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

గిరిజన ప్రాంతంలో 2.45 లక్షల మంది ఆదివాసీ రైతులు 2.58 లక్షల ఎకరాల్లో కాఫీని సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది 15 వేల మెట్రిక్‌ టన్నుల క్లీన్‌ కాఫీ దిగుబడులు వస్తున్నాయి. ఈ నిల్వల్లో దాదాపు 50 శాతం దిగుబడులను గిరిజన సహకార సంస్థ, మ్యాక్స్‌ మార్కెటింగ్‌ చేస్తున్నది. గత ఏడాది గిరిజన సహకార సంస్థ గరిష్ఠంగా కాఫీ పార్చిమెంట్‌ కిలోకి రూ.400, చెర్రీ కిలోకి రూ.250, ఆర్గానిక్‌ చెర్రీకి రూ.330, మ్యాక్స్‌ కిలో పండ్లకు బోనస్‌ కలుపుకుని రూ.60 ధరను రైతులకు చెల్లించారు. గత ఏడాది కాఫీకి రికార్డు స్థాయిలో ధరలు పెరిగాయి. ఈ ఏడాది కాఫీ ధరలు ఏ విధంగా ఉంటాయి?, జీసీసీ, మ్యాక్స్‌ కాఫీ పండ్లు, పార్చిమెంట్‌, చెర్రీలకు ఏ స్థాయిలో మద్ధతు ధర ప్రకటిస్తాయని రైతులు ఎదురు చూస్తున్నారు.

సమావేశంకాని అపెక్స్‌ కమిటీ

కాఫీ ధరలు నిర్ణయించేందుకు జీసీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, కేంద్ర కాఫీ బోర్డు అధికారులు సమావేశమై గత రెండేళ్ల కాఫీ ధరలను విశ్లేషించి, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో కాఫీ పంటకు ఉన్న డిమాండ్‌ ఆధారంగా కాఫీ ధరలను నిర్ణయిస్తారు. ప్రతి ఏడాది అపెక్స్‌ కమిటీ సమావేశం అక్టోబరులో జరుగుతున్నది. ఈ ఏడాది నవంబరు మొదటి వారం వచ్చినా అపెక్స్‌ కమిటీ సమావేశం కాలేదు. అపెక్స్‌ కమిటీ సమావేశం కాకుండా జీసీసీ, మ్యాక్స్‌ ధరలను ప్రకటించే పరిస్థితి లేదు.

అనుకూలించిన వర్షాలు

ఈ ఏడాది కాఫీ పంటకు వర్షాలు అనుకూలించాయి. కాఫీ పంటకు మార్చి, ఏప్రిల్‌, మే నెలలో వర్షాలు అత్యంత కీలకం. ఈ ఏడాది ఏప్రిల్‌, మేలో సాధారణ వర్షపాతానికి మించి వర్షపాతం నమోదైంది. జూలై, ఆగస్టు, సెప్టెంబరులోనూ మంచి వర్షాలు పడ్డాయి. వాతావరణం అనుకూలించడంతో ఈ ఏడాది కాఫీ దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి.

ముందుగానే దిగుబడులు

సాధారణంగా కాఫీ దిగుబడులు నవంబరు నాలుగో వారం, డిసెంబరు మొదటి వారం నుంచి కాఫీ పంట కోత దశకు వస్తుంది. ఈ ఏడాది నవంబరు మొదటి వారంలోనే కాఫీ పండ్లు కోతకు వచ్చాయి. చింతపల్లి, జీకేవీధి మండలాల్లో కోత దశకు వచ్చిన పండ్లను ఆదివాసీ రైతులు సేకరిస్తున్నారు. సేకరించిన పండ్లను కొంత మంది రైతులు పార్చిమెంట్‌ తయారు చేస్తుండగా, మరికొంత మంది వ్యక్తులు ప్రైవేటు వర్తకులకు విక్రయిస్తున్నారు. తుఫాన్‌ హెచ్చరికలు ఉండడంతో కోత దశకు వచ్చిన కాఫీ పండ్లను రైతులు సేకరించుకోవాలని కేంద్ర కాఫీ బోర్డు అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు పండ్ల సేకరణ పనులు ముమ్మరం చేశారు.

జీసీసీ, మ్యాక్స్‌ కాఫీ కోనుగోలు ప్రారంభించాలి

జీసీసీ, మ్యాక్స్‌లు కాఫీ పండ్లు, పార్చిమెంట్‌, చెర్రీలకు వెంటనే ధరలు ప్రకటించాలి. కాఫీ పండ్లు కోత దశకు రావడంతో రైతులు పంట సేకరణ పనులు ప్రారంభించారు. తొలి విడతగా వచ్చిన కాఫీ పండ్లను ప్రైవేటు వర్తకులకు విక్రయించాల్సి వస్తుంది. రైతులకు గరిష్ఠ ధరలు అందించేందుకు జీసీసీ, మ్యాక్స్‌ కాఫీ కొనుగోలు ప్రారంభించాలి.

- బేరా సత్యనారాయణ పడాల్‌, కాఫీ రైతు, యర్రబొమ్మలు

Updated Date - Nov 07 , 2025 | 11:33 PM