ఏయూలో ఎందుకిలా!?
ABN , Publish Date - Nov 05 , 2025 | 01:18 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏదో ఒక సమస్యపై తరచూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
విద్యార్థుల వరుస ఆందోళనలు
వీసీ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసనలు
గత ప్రభుత్వ హయాంలో సమస్యలున్నా మౌనం
కార్యాలయం ఎదుట ఇనుప గ్రిల్స్ ఏర్పాటుచేసినా ప్రశ్నించేందుకు సాహసించని వైనం
తాజాగా రోడ్డెక్కి మరీ బైఠాయింపు
శతాబ్ది ఉత్సవాల వేళ వర్సిటీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై సీనియర్ ప్రొఫెసర్ల ఆందోళన
విశాఖపట్నం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏదో ఒక సమస్యపై తరచూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వీసీ కార్యాలయం వద్దకు చేరుకుని బైఠాయిస్తున్నారు. గతంలో ఉన్నతాధికారులను ప్రశ్నించడానికి, అసలు సమస్యను చెప్పుకోవడానికి కూడా ముందుకురాని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు...ఇప్పుడు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వర్సిటీలో పాలకులు మారారు. తొలుత ప్రొఫెసర్ జి.శశిభూషణ్ ఇన్‌చార్జి వీసీగా నియమితులు కాగా, ఆ తరువాత పూర్తిస్థాయి వైస్ చాన్సలర్‌గా ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ బాధ్యతలు చేపట్టారు. గతంలో శశిభూషణ్, ఇప్పుడు రాజశేఖర్ హయాంలో అనేకమార్లు విద్యార్థులు ఆందోళనలు నిర్వహించారు. అదే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. వైసీపీ హయాంలో విద్యార్థి సంఘాలు గానీ, విద్యార్థులుగానీ తమ సమస్యలను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లేందుకు వీలుండేది కాదు. ఇప్పుడు అందుకు అవకాశం ఉన్నప్పటికీ అనేక సందర్భాల్లో విద్యార్థులు ఆందోళనబాట పట్టడం వెనుక కారణాలేమిటో అంతుబట్టడం లేదు. ముఖ్యంగా శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ విద్యార్థులు తరచూ ఆందోళనలకు దిగడం వర్సిటీ ప్రతిష్టను దిగజార్చుతుందని సీనియర్ ప్రొఫెసర్లు పేర్కొంటున్నారు. విద్యార్థుల ఆందోళనలను వెనకుండి ఎవరో నడిపిస్తున్నారనే అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయమై వర్శిటీలోనూ చర్చ జరుగుతోంది.
అరడజనుసార్లు ఆందోళనలు
పాలకులు మారిన తరువాత వివిధ కారణాలతో అరడజనుసార్లకుపైగా విద్యార్థులు ఆందోళనలు చేశారు. తొలిసారి గత ఏడాది ఆగస్టులో భోజనం సరిగా లేదంటూ వివిధ వసతి గృహాలకు చెందిన విద్యార్థులు వీసీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. దీనిని అప్పటి ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ జి.శశిభూషణ్ సీరియస్‌గా తీసుకుని పరిష్కరించే ప్రయత్నం చేశారు. విద్యార్థుల ఆధ్వర్యంలో మెస్ కమిటీలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అలాగే, ఎప్పటికప్పుడు మెస్‌లను తనిఖీ చేసేలా అధికారులకు బాధ్యతలు అప్పగించారు. అయితే, మెస్ కమిటీల నిర్వహణ బాధ్యతలు తీసుకునేందుకు చాలామంది విద్యార్థులు ముందుకురాలేదు. కొద్దినెలలు గడిచిన తరువాత మరోసారి అదే విధమైన ఆరోపణలతో విద్యార్థులు ఆందోళన చేశారు. ఆ తరువాత పూర్తిస్థాయి వీసీగా ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ బాధ్యతలు చేపట్టారు. ఆయన వచ్చిన తరువాత విద్యార్థుల ఆందోళనలు మరింత పెరిగాయి. భోజనం సరిగా లేదని ఒకసారి, భోజనంలో పురుగులు, జెర్రిలు ఉంటున్నాయని మరోసారి విద్యార్థులు నిరసన తెలియజేశారు. క్యాంపస్‌లోని ఆరోగ్య కేంద్రంలో సమస్యలను పరిష్కరించాలంటూ ఒకసారి ఆందోళన చేపట్టారు. ఆ తరువాత వసతి గృహాల్లో అదనపు బిల్లులు వసూలు చేస్తున్నారంటూ మహిళా ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థినులు ఆందోళన చేశారు. కొద్దిరోజుల కిందట హాస్టల్ విద్యార్థి ఒకరు గుండెపోటుతో చనిపోయారు. ఈ నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి చనిపోయాడంటూ పదుల సంఖ్యలో విద్యార్థులు వీసీ కార్యాలయంలోకి వెళ్లి గొడవ చేశారు. వర్సిటీలో ఐఐఎంకు కేటాయించిన భవానాన్ని ఆర్ట్స్ అండ్ కామర్స్ విభాగానికి కేటాయించాలని కోరుతూ మంగళవారం పలువురు విద్యార్థులు వీసీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.
అప్పుడు మౌనమేలా.?
గతంలో విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులను కలిసేందుకు కూడా అవకాశం ఉండేది కాదు. వీసీ కార్యాలయం ఎదుట ఇనుప కంచెలు (గ్రిల్స్) ఉండేవి. అప్పుడు ఏ విద్యార్థి సంఘం కనీసం ప్రశ్నించే ప్రయత్నం చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత శశిభూషణ్ ఇన్‌చార్జి వీసీగా ఉన్న సమయంలో ఆ ఇనుప గ్రిల్స్‌ను తొలగించారు. ఇక ఆరోగ్య కేంద్రం అత్యంత దారుణ స్థితికి చేరుకోవడానికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణం. అయితే గత ప్రభుత్వ హయాంలో ఎవరూ ప్రశ్నించే సాహసం చేయలేకపోయారు. కానీ, ఇప్పుడు ఏదో ఒక సమస్యపై ఆందోళనలకు దిగుతుండడం క్యాంపస్‌లో చర్చనీయాంశంగా మారింది. క్యాంపస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించాలనే వాదన వినిపిస్తోంది.