ప్రోటోకాల్ పాటించరా..
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:54 PM
ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక ప్రజా ప్రతినిధులను ఆహ్వానించడం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదని పలువురు జడ్పీటీసీ సభ్యులు, మండలాధ్యక్షులు ఆరోపించారు.
జడ్పీలో సభ్యుల ఆందోళన
అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదంటూ పోడియం వద్ద నిరసన
విశాఖపట్నం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక ప్రజా ప్రతినిధులను ఆహ్వానించడం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదని పలువురు జడ్పీటీసీ సభ్యులు, మండలాధ్యక్షులు ఆరోపించారు. జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన మంగళవారం జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో అనకాపల్లి మండలాధ్యక్షుడు సూరిబాబు ప్రోటోకాల్ వ్యవహారాన్ని ప్రస్తావించారు. అనకాపల్లి మండలంలో అంగన్‌వాడీ భవన ప్రారంభోత్సవానికి స్థానిక సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యురాలి ఆహ్వానించ లేదని, దీనిపై సీడీపీవోకు లేఖ రాస్తే అసలు భవనమే ప్రారంభం కాలేదని లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారన్నారు. పరవాడ జడ్పీటీసీ సభ్యుడు సన్యాసిరాజు మాట్లాడుతూ తన సొంత గ్రామం తానాంలో ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదని పేర్కొనడంతో వైసీపీ సభ్యులు మూకుమ్మడిగా లేచి పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. సభ్యుల ఆందోళనతో చైర్‌పర్సన్ ఏకీభవిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలకు తననూ ఆహ్వానించడం లేదన్నారు. సభ్యుల ఆవేదనపై అనకాపల్లి కలెక్టర్ విజయ్‌కృష్ణణ్ స్పందిస్తూ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ప్రోటోకాల్ పాటించాల్సిందేని పేర్కొన్నారు. అధికారులు అందుకు అనుగుణంగా వ్యవహరించాలని ఆదేశించారు.
క్రికెటర్ కరుణకుమారికి సన్మానం
అంధ మహిళల టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకున్న భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అల్లూరి సీతారామరాజు జిల్లా వాసి పాంగి కరుణకుమారిని జడ్పీ హాలులో సత్కరించారు. జిల్లా పరిషత్ తరపున చైర్‌పర్సన్ సుభద్ర రూ.39,900 విలువ గల క్రికెట్ కిట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు హరేంధిరప్రసాద్, విజయకృష్ణన్, దినేష్‌కుమార్, జడ్పీ సీఈవో నారాయ ణమూర్తి, డిప్యూటీ సీఈవో రాజకుమార్, జడ్పీటీసీ సభ్యులు, మండలాధ్యక్షులు పాల్గొన్నారు.