Share News

బెన్నవోలులో తెల్లసుద్ద మైనింగ్‌

ABN , Publish Date - Nov 18 , 2025 | 01:52 AM

మండలంలోని బెన్నవోలు కొండపై సుదీర్ఘ విరామం తరువాత తెల్లసుద్ద క్వారీలో తవ్వకాలకు రంగం సిద్ధం అవుతున్నది.

బెన్నవోలులో తెల్లసుద్ద మైనింగ్‌

వైట్‌ క్లే తవ్వకాలకు ప్రైవేటు కంపెనీ దరఖాస్తు

గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ

సమస్యలు తలెత్తుతాయని స్థానికుల ఆందోళన

వచ్చే ఏడాది నుంచి వైట్‌ క్లే తవ్వకాలు ప్రారంభం?

జీవనోపాధి కోల్పోతామని పలువురి ఆవేదన

చోడవరం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని బెన్నవోలు కొండపై సుదీర్ఘ విరామం తరువాత తెల్లసుద్ద క్వారీలో తవ్వకాలకు రంగం సిద్ధం అవుతున్నది. సిరామిక్‌ టైల్స్‌ తయారీలో ఉపయోగించే తెల్లసుద్ద (వైట్‌ క్లే) నిక్షేపాలు బెన్నవోలు గ్రామానికి ఆనుకుని ఉన్న కొండల్లో పుష్కలంగా ఉన్నాయి. గతంలో యానాంలో వున్న రీజెన్సీ సిరామిక్‌ పరిశ్రకు ఇక్కడి నుంచి వైట్‌ క్లేను తరలించారు. రీజెన్సీ ఇండస్ట్రీకి 2013 వరకు లీజు ఉండేది. అయితే కార్మికుల ఆందోళనల కారణంగా రీజెన్సీ సిరామిక్‌ పరిశ్రమ 2008లో మూతపడడంతో బెన్నవోలు కొండల్లో తెల్లసుద్ద తవ్వకాలు నిలిచిపోయాయి. మళ్లీ ఇప్పుడు వైట్‌ క్లే తవ్వకాలకు ‘శ్రీలక్ష్మీ నరసింహ మెటల్స్‌ అండ్‌ శాండ్‌ ఇండస్ట్రీ’ దరఖాస్తు చేసుకోగా, కాలుష్య నియంత్రణ అనుమతుల కోసం ఈ నెల 15న బెన్నవోలులో ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. బెన్నవోలును ఆనుకుని ఉన్న 41.99 ఎకరాల్లో తెల్లసుద్దను తవ్వుకునేందుకు ఈ సంస్థకు అనుమతులు ఇవ్వనున్నారు. ఏడాదికి 3.6 లక్షల టన్నుల వైట్‌ క్లేను తవ్వి తరలించేందుకు ప్రభుత్వం అనుమతిస్తున్నది. టన్నుకు రూ.130 చొప్పున ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి వుంటుంది. నెలకు 30 వేల టన్నుల చొప్పున వైట్‌ క్లేను తవ్వుతారు. దీనిని 150 భారీ వాహనాల్లో రవాణా చేస్తారు. దీనివల్ల నీటి వనరులకు, పంట పొలాలకు ముప్పు వాటిల్లుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాభిప్రాయ సేకరణలో భిన్నస్వరాలు

బెన్నవోలు కొండపై వైట్‌ క్లే తవ్వకాల కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో తవ్వకాలకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వైట్‌ క్లే తవ్వకాల వల్ల కాలుష్య సమస్యలు ఉత్పన్నం అవుతాయని, పరిసరాల్లోని వ్యవసాయ భూములు నిర్జీవంగా మారతాయని అధికారుల ఎదుట తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరికొందరు ఇక్కడ వైట్‌ క్లే తవ్వకాలు జరపవద్దని స్పష్టం చేశారు. స్థానికుల అభిప్రాయాలను పక్కనపెడితే ఇక్కడ వచ్చే ఏడాది నుంచే వైట్‌ క్లే తవ్వకాలు ప్రారంభం కావడం తఽథ్యమని అధికారవర్గాల సమాచారం.

కొండను నమ్ముకుని దశాబ్దాలుగా ఉపాధి

బెన్నవోలు కొండపై లభించే తెల్లసుద్దను తవ్వుకుని అమ్ముకోవడం ద్వారా స్థానికంగా 12 కుటుంబాలు వారు జీవనోపాధి పొందుతున్నారు. తెల్లసుద్దను పిండి చేసి, ముగ్గుపిండిగా అమ్ముతుంటారు. ఇక్కడ మైనింగ్‌కు ప్రభుత్వం అనుమతులు ఇస్తే తాము ఉపాధి కోల్పోతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా లీజు తీసుకోనున్న సంస్థ... ఇక్కడ ఉన్న కుటుంబాలు సుద్ద తవ్వుకునేందుకు అనుమతి ఇస్తామని చెబుతుండగా.. కొండ మొత్తం తవ్వుకుపోతే భవిష్యత్తులో తమకు ఏమీ మిగలదని అంటున్నారు.

ఉపాధిని దెబ్బతీయవద్దు

రంగాల దేవుళ్లు, రంగాల త్రినాథ్‌, బెన్నవోలు

తెల్లసుద్ద కొండను నమ్ముకుని ఎంతోకాలంగా జీవిస్తున్నాం. ఇక్కడ సుద్దను తవ్వుకుని, ఊరూరూ తిరుగుతూ అమ్ముకుంటున్నాం. సంక్రాంతి పండుల సమయంలో ఆదాయం బాగుంటుంది. లీజుకు తీసుకున్న సంస్థ.. యంత్రాలతో తవ్వకాలు నిర్వహిస్తే ఉపాధి కోల్పోతాం. ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి

Updated Date - Nov 18 , 2025 | 01:52 AM