Share News

క్లాప్‌ కాంట్రాక్టర్‌పై కొరడా

ABN , Publish Date - Nov 11 , 2025 | 01:42 AM

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) వాహనాల కాంట్రాక్టర్‌ను లోడర్లకు వేతనాలు ఇచ్చే బాధ్యత నుంచి తప్పించాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్డ్‌ నిర్ణయించారు.

క్లాప్‌ కాంట్రాక్టర్‌పై కొరడా

లోడర్లకు వేతనాలు చెల్లించే బాధ్యతల నుంచి ఉద్వాసన

ఇకపై జీవీఎంసీ టెండర్లలో పాల్గొనకుండా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని కమిషనర్‌ ఆదేశం

తక్కువ మందిని పనిలో పెట్టుకుని, ఎక్కువ మందిని చూపిస్తున్నట్టు విచారణలో నిర్ధారణ

క్లాప్‌ వాహనాల నిర్వహణపైనా త్వరలో చర్యలు

విశాఖపట్నం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి):

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) వాహనాల కాంట్రాక్టర్‌ను లోడర్లకు వేతనాలు ఇచ్చే బాధ్యత నుంచి తప్పించాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్డ్‌ నిర్ణయించారు. వాహనాలకు చెత్తను లోడు చేసేందుకు తక్కువ మందిని పనిలో పెట్టుకుని, ఎక్కువ మందిని చూపిస్తూ జీవీఎంసీ నుంచి భారీగా దోపిడీకి పాల్పడినట్టు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. లోడర్లకు ఇకపై మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా వేతనాలు అందజేయాలని ఆదేశిస్తూ ప్రజారోగ్య విభాగం అధికారులు ఉత్తర్వులు జారీచేశారు.

క్లాప్‌ వాహనాల ద్వారా ఇంటింటికీ చెత్తసేకరణ సరిగా జరగడం లేదని, తక్కువ మందిని పనిలో పెట్టుకుని పూర్తిస్థాయిలో చేస్తున్నట్టు చూపిస్తూ జీవీఎంసీ నుంచి బిల్లు పొందుతుండడంపై గత నెల 19న ‘చెత్తసేకరణలో దోపిడీ’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. దీనిపై కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ విచారణ జరిపించగా...చాలా వార్డుల పరిధిలో క్లాప్‌ వాహనాలు సరిగా చెత్తసేకరణ చేయడం లేదని, రికార్డుల్లో చూపించిన సిబ్బందిలో 20 శాతం మంది మాత్రమే క్షేత్రస్థాయిలో ఉంటున్నారని నిర్ధారణ అయింది. జీవీఎంసీ పరిధిలో 600కిపైగా లోడర్లు ఉండాలి. ఒక్కో క్లాప్‌ వాహనం వెనుక ఒకరు వెళ్లి ఇంటి నుంచి చెత్తను తీసుకుని వాహనంలో వేయాలి. ఇందుకోసం లోడర్‌కు రోజుకు రూ.450 చొప్పున కాంట్రాక్టర్‌ ద్వారా జీవీఎంసీ చెల్లిస్తోంది. అయితే జీవీఎంసీ పరిధిలో 200కి మంచి లోడర్లు పనిచేయడం లేదని ప్రజారోగ్యశాఖ అధికారులకు తెలిసినా ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తూ వచ్చారు. దీంతో కాంట్రాక్టర్‌ దోపిడీకి అడ్డులేకుండా పోయింది. ఇదిలావుండగా 22వ వార్డు పరిధిలో ఏడుగురు లోడర్లు పనిచేయాల్సి ఉండగా, ఇద్దరితోనే పనిచేయిస్తూ, ఏడుగురి పేరిట 18 నెలలపాటు బిల్లు డ్రా చేసినట్టు ఆ వార్డు కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ పూర్తి ఆధారాలను అందజేశారు. వీటన్నింటినీ పరిశీలించిన కమిషనర్‌ లోడర్లకు వేతనాలు ఇచ్చే బాధ్యత నుంచి క్లాప్‌ కాంట్రాక్టర్‌ను పక్కనపెట్టారు. ఆ బాధ్యతను ఒక్కో జోన్‌లో ఒక్కో ఎస్‌ఎల్‌ఎఫ్‌కు అప్పగించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అదేవిధంగా ఇకపై జీవీఎంసీలో ఎలాంటి టెండర్‌లో కూడా క్లాప్‌ కాంట్రాక్టు సంస్థ (శ్రీదుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్‌) పాల్గొనడానికి అర్హత లేకుండా బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చారు. మరోవైపు క్లాప్‌ వాహనాల పనితీరుపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు ఉన్నాయి. వాహనాలు తమకు కేటాయించిన ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లడం లేదని, ఒక ట్రిప్పు తిరిగితే మూడు ట్రిప్పులు వేసినట్టు చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ప్రజలు తమ ఇళ్లలోని చెత్తను రోడ్లపైకి తెచ్చిపడేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కూడా కమిషనర్‌ దృష్టిపెట్టారని, త్వరలో క్లాప్‌ వాహనాల విషయంలో కూడా సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Nov 11 , 2025 | 01:42 AM