Share News

ఉప ఖజానా దొంగలపై కొరడా

ABN , Publish Date - Nov 08 , 2025 | 01:18 AM

సీతమ్మధారలోని డివిజనల్‌ సబ్‌ ట్రెజరీలో పింఛన్‌దారుల పేరిట సొమ్ములు స్వాహా చేసిన ఉద్యోగులపై ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించింది.

ఉప ఖజానా దొంగలపై కొరడా

సీతమ్మధార సబ్‌ ట్రెజరీలో కుంభకోణంపై చర్యలు

2011-2017 మధ్య రూ.6 కోట్లు స్వాహా అయినట్టు విజిలెన్స్‌ నివేదిక

11 మంది సీనియర్‌ అకౌంటెంట్లకు చార్జిమెమోలు

విశాఖపట్నం, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి):

సీతమ్మధారలోని డివిజనల్‌ సబ్‌ ట్రెజరీలో పింఛన్‌దారుల పేరిట సొమ్ములు స్వాహా చేసిన ఉద్యోగులపై ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించింది. అందుకు బాధ్యులైన 11 మంది సీనియర్‌ అకౌంటెంట్లకు చార్జిమెమోలు జారీ చేయాలని ఖజానా శాఖ విశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఈ మేరకు పది రోజుల క్రితం వారందరికీ డీడీ చార్జిమెమోలు ఇచ్చారు.

నగరంలో వేలాది మంది రిటైర్డు ఉద్యోగులకు ప్రతినెలా సీతమ్మధార డివిజనల్‌ సబ్‌ ట్రెజరీ నుంచి పింఛన్లు బట్వాడా చేస్తుంటారు. ఏడాదికి ఒకసారి ప్రతి పింఛన్‌దారుడు లైఫ్‌ సర్టిఫికెట్‌ను ట్రెజరీకి అందజేయాలి. అదేవిధంగా ఎవరైనా చనిపోయినట్టయితే కుటుంబ సభ్యులు డెత్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలి. 2011 సంవత్సరం వరకూ సర్టిఫికెట్లు మాన్యువల్‌గా తీసుకుని అప్‌లోడ్‌ చేసే విధానం ఉండేది. ఈ నేపథ్యంలో పింఛన్‌దారుడు చనిపోయినట్టు కుటుంబ సభ్యులు డెత్‌ సర్టిఫికెట్‌ ఇచ్చినా సబ్‌ ట్రెజరీ సిబ్బంది దానిని అప్‌లోడ్‌ చేయకుండా ఆ మొత్తం ప్రతి నెలా వేరొక బ్యాంకు అకౌంట్‌లో జమ చేసి డ్రా చేసుకునేవారు. మరికొంతమంది విషయంలో పింఛన్‌దారుడు చనిపోయినట్టు సర్టిఫికెట్‌ తీసుకువచ్చిన కుటుంబ సభ్యులతో ట్రెజరీ ఉద్యోగులు కుమ్మక్కై వచ్చిన పింఛన్‌ చెరిసగం పంచుకున్నారు. ఇలా 2011 నుంచి 2017 వరకూ సుమారు రూ.ఆరు కోట్ల వరకు స్వాహా జరిగింది. సొమ్ములు పక్కదారిపట్టినట్టు 2018లో వెలుగులోకి రావడంతో అప్పట్లో కొందరు ఉద్యోగులను సస్పెండ్‌ చేయగా, ఇద్దరు, ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వెంకటనరసింగరావు అనే ఉద్యోగి నుంచి సుమారు రూ.95 లక్షలు రికవరీ చేశారు. ఈ కుంభకోణంపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ చేపట్టింది. సుదీర్ఘంగా విచారించి 2021లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అప్పటి నుంచి పలుమార్లు విజిలెన్స్‌ అధికారులు వార్షిక నివేదికలలో ట్రెజరీ కుంభకోణం విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. చివరకు ఈ ఏడాది ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. దీంతో 2011 నుంచి 2017 వరకు జరిగిన పింఛన్‌ సొమ్ముల స్వాహాకు సంబంధించి అప్పట్లో సీతమ్మధార డివిజనల్‌ సబ్‌ట్రెజరీలో పనిచేసి ప్రస్తుతం సీనియర్‌ అకౌంటెంట్లుగా ఉన్న 11 మందిపై చర్యలు తీసుకోవాలని విశాఖలోని ఖజానా కార్యాలయం డీడీని ఖజానా రాష్ట్ర డైరెక్టర్‌ ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుతం జిల్లా కార్యాలయంతోపాటు అనకాపల్లి జిల్లాలో పనిచేస్తున్న 11 మందికి ఆయన చార్జిమెమోలు జారీచేశారు. పింఛన్ల సొమ్ము స్వాహాకు సంబంధించిన వ్యవహారంలో ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. చార్జిమెమోలు అందుకున్న వారిలో చినఅప్పలరాజు, శ్రావ్య గోపాల్‌, హైమా, పైడిరాజు, అశోక్‌, రాజు ప్రకాశ్‌, బేబీ చైతన్య, తదితరులు ఉన్నారు. వీరిలో కొందరు కొంత సమయం కావాలని డీడీని కోరారు.


రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొన్న ద్విచక్ర వాహనచోదకుడు

కూర్మన్నపాలెం, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి):

జాతీయ రహదారిపై అగనంపూడి వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు. ఇందుకు సంబంధించి దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గాజువాక పైడిమాంబ కాలనీకి చెందిన వల్లూరు శ్రీనివాసరావు, భార్య రమణమ్మ (58), కుమారుడు తారక్‌తో కలిసి అగనంపూడిలో అద్దెకు ఉంటున్నారు. పాల బూత్‌ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రమణమ్మ శుక్రవారం పని మీద కూర్మన్నపాలెం వచ్చింది. తిరిగి ఆటోలో అగనంపూడి చేరుకుంది. ఆటో దిగి ఇంటికి వెళ్లేందుకు జాతీయ రహదారి దాటుతుండగా అనకాపల్లి నుంచి గాజువాక వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న మునగపాక మండలం చూచుకొండ గ్రామానికి చెందిన సారిక నాగరాజు (48), అతని కుమారుడు జవహర్‌లు ఢీకొట్టారు. దీంతో రమణమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న దువ్వాడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. తీవ్ర గాయాలపాలైన నాగరాజు, జవహర్‌లను కేజీహెచ్‌కు తరలించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ సారిక నాగరాజు (48) మృతిచెందారు. జవహర్‌కు గాయాలయ్యాయి. డిగ్రీ పూర్తిచేసిన జవహర్‌ ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. తారక్‌ ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జవహర్‌ నుంచి ఫిర్యాదు రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Updated Date - Nov 08 , 2025 | 01:18 AM