Share News

టీడీపీ పార్లమెంట్‌ పగ్గాలు ఎవరికో!?

ABN , Publish Date - Aug 27 , 2025 | 12:59 AM

లుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంట్‌ అధ్యక్షుడి ఎన్నికపై పార్టీ అధిష్ఠానం దృష్టి కేంద్రీకరించింది. పార్లమెంటు నియోజకవర్గం పార్టీ అధ్యక్షుడు, కార్యదర్శి, అనుబంధ సంస్థల కమిటీల నియామకాల కోసం ఇటీవల అనకాపల్లిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు అధ్యక్షతన త్రీ మెన్‌ కమిటీ సమావేశమైంది.

టీడీపీ పార్లమెంట్‌ పగ్గాలు ఎవరికో!?

‘అనకాపల్లి’ కమిటీ ఎంపికపై కసరత్తు

జిల్లా నాయకుల అభిప్రాయలు సేకరించిన త్రీ మెన్‌ కమిటీ

రేసులో పలువురు సీనియర్‌ నేతలు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంట్‌ అధ్యక్షుడి ఎన్నికపై పార్టీ అధిష్ఠానం దృష్టి కేంద్రీకరించింది. పార్లమెంటు నియోజకవర్గం పార్టీ అధ్యక్షుడు, కార్యదర్శి, అనుబంధ సంస్థల కమిటీల నియామకాల కోసం ఇటీవల అనకాపల్లిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు అధ్యక్షతన త్రీ మెన్‌ కమిటీ సమావేశమైంది. త్రీమెన్‌ కమిటీ సభ్యులైన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఏపీ స్టేట్‌ మినిమమ్‌ వేజస్‌ అడ్వైజరీ ఛైర్మన్‌ శ్రీనివాసులురెడ్డి, ఏపీ ఇండస్ట్రియల్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ డేగల ప్రభాకర్‌.. అనకాపల్లి జిల్లా ముఖ్య నేతలతో సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. ప్రస్తుతం పార్టీ అధికారంలో వుండడంతో పార్లమెంటు పగ్గాలు చేపట్టేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. అయితే పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షుడు, కార్యదర్శి, ఇతర అనుబంధ సంఘాల నియామకంపై త్రీమెన్‌ కమిటీ సభ్యులు.. జిల్లాలో టీడీపీ సీనియర్‌ నేతలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, పలు కార్పొరేషన్‌ల ఛైర్మన్‌లతో సుదీర్ఘంగా చర్చించారు. పదవులు ఆశిస్తున్న వారి పేర్లతో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జాబితాను రూపొందించారు. పార్లమెంట్‌ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో ప్రస్తుత అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, సీనియర్‌ నాయకులు దాడి రత్నాకర్‌, లాలం కాశీనాయుడు, మాదంశెట్టి నీలబాబు, కాయల మురళి, డాక్టర్‌ నారాయణరావు పేర్లు వినిపిస్తున్నాయి. తమకు అవకాశం కల్పించాలని పలువురు నేతలు ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. అయితే సీనియారిటీ, విధేయత, రాజకీయ అనుభవం, సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకొని కమిటీని నియమించాలని పార్టీ అధిష్ఠానంం భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం టీడీపీ పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షుడిగా బత్తుల తాతయ్యబాబు కొనసాగుతున్నారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆయననే కొనసాగించాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు త్రీమెన్‌ కమిటీ వద్ద జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ప్రతిపాదన చేసినట్టు సమాచారం. కొత్తగా నియమించనున్న టీడీపీ పార్లమెంట్‌ పార్టీ కమిటీలో ఒక అధ్యక్షుడు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఏడుగురు కార్యదర్శలు, ఏడుగురు కార్యనిర్వాహక కార్యదర్శులు, ఏడుగురు అధికార ప్రతినిధులు ఉంటారు. ప్రధాన కమిటీ నియామకం పూర్తయిన తరువాత 17 అనుబంధ సంఘల కార్యవర్గాలను నియమిస్తారు.

Updated Date - Aug 27 , 2025 | 12:59 AM