Share News

ఎక్కడి పనులు అక్కడే

ABN , Publish Date - Nov 30 , 2025 | 12:54 AM

జిల్లాలో గత ప్రభుత్వం ముందుచూపు లేకుండా పాఠశాలల్లో నిర్మాణం చేపట్టిన అదనపు భవనాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. పాఠశాలల్లో మౌలికవసతుల కల్పన పేరుతో నాడు-నేడు పథకాన్ని అమలు చేసిన వైసీపీ పాలకులు.. ఆయా పనులు చేపట్టిన పాఠశాలల కమిటీలకు, కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించలేదు. దీంతో అర్ధంతరంగా పనులు ఆపేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ‘మన బడి-మన భవిష్యత్తు’ పథకం కింద అసంపూర్తిగా వున్న భవన నిర్మాణాలను పూర్తిచేయాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అడుగు మందుకు పడడంలేదు.

ఎక్కడి పనులు అక్కడే
అచ్యుతాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో పూర్తికాని అదనపు తరగతి గదుల భవన నిర్మాణం

అసంపూర్తిగా పాఠశాలల అదనపు భవనాలు

గత ప్రభుత్వ హయాంలో ‘నాడు-నేడు’ కింద పనులు

కాంట్రాక్టర్లకు పూర్తిస్థాయిలో అందని బిల్లులు

పలుచోట్ల అర్ధంతరంగా ఆగిన పనులు

కూటమి అధికారంలో వచ్చి ఏడాదిన్నర దాటినా మోక్షం లేని వైనం

వసతి కొరతతో విద్యార్థుల ఇక్కట్లు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో గత ప్రభుత్వం ముందుచూపు లేకుండా పాఠశాలల్లో నిర్మాణం చేపట్టిన అదనపు భవనాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. పాఠశాలల్లో మౌలికవసతుల కల్పన పేరుతో నాడు-నేడు పథకాన్ని అమలు చేసిన వైసీపీ పాలకులు.. ఆయా పనులు చేపట్టిన పాఠశాలల కమిటీలకు, కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించలేదు. దీంతో అర్ధంతరంగా పనులు ఆపేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ‘మన బడి-మన భవిష్యత్తు’ పథకం కింద అసంపూర్తిగా వున్న భవన నిర్మాణాలను పూర్తిచేయాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అడుగు మందుకు పడడంలేదు.

గత వైసీపీ ప్రభుత్వం ‘మన బడి నాడు-నేడు’ కార్యక్రమం కింద జిల్లాలో గత 2023-24 సంవత్సరంలో రూ.254 కోట్ల అంచనా వ్యయంతో వివిధ పాఠశాలల్లో 604 నిర్మాణ పనులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా అదనపు తరగతి గదుల నిర్మాణం, మరుగుదొడ్లు, నీటివసతి కల్పన, విద్యుత్‌ సదుపాయం వంటి పనులు చేపట్టాలి. కొన్నిచోట్ల పాఠశాల విద్యా కమిటీలు నిర్మాణ పనులు చేపట్టగా, మరికొన్నిచోట్ల కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు. అయితే మొదటి దశ పనులు పూర్తి చేసిన తరువాత బిల్లులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయగా.. నిధులు విడుదలలో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో ఆయా కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. గత ఏడాది మార్చి చివరినాటికి మొత్తం రూ.131 కోట్ల విలువైన నిర్మాణాలు జరగ్గా.. ఇందులో రూ.18 కోట్ల మేర బిల్లులు అందలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ‘మన బడి-మన భవిష్యత్తు’ పథకం కింద పాఠశాలల్లో అసంపూర్తిగా వున్న భవన నిర్మాణాలు, ఇతర పనులు పూర్తి చేయాలని భావించింది. పాత బిల్లులతోపాటు అసంపూర్తిగా వున్న భవనాల పనులు పూర్తిచేయాలంటే రూ.20 కోట్లు అవసరమని సమగ్ర శిక్ష ఇంజనీరింగ్‌ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. కానీ ఇంతవరకు గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదు. వాస్తవంగా పాఠశాలల తల్లిదండ్రుల కమిటీలు, ప్రధానోపాధ్యాయుల ఉమ్మడి బ్యాంకు ఖాతాల్లో కొంత నగదు ఉన్నప్పటికీ.. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బదిలీపై వెళ్లిపోవడం, పాఠశాలల కమిటీలు మారిపోవడంతో ఆ నిధులు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. మిగిలిన పాఠశాలలకు సంబంధించి కొంతమేర నిధులు అందుబాటులో వున్నప్పటికీ.. పనులు పూర్తిచేయడానికి చాలవు.

అచ్యుతాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో 700 విద్యార్థులు వున్నారు. ప్లస్‌టులో మరో 200 మంది చదువుతున్నారు. గత ప్రభత్వు హయాంలో ‘నాడు-నేడు’ కార్యక్రమం కింద రూ.18 లక్షల అంచనా వ్యయంతో మూడు అదనపు గదుల నిర్మాణ పనులు చేపట్టారు. కానీ ఇంతవరకు పూర్తికాలేదు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 17 తరగతి గదులు వున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య అధికంగా వుండడంతో వసతి చాలడంలేదు. అనకాపల్లి మండలం కొండకొప్పాక జడ్పీ ఉన్నత పాఠశాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అదనపు గదుల నిర్మాణ పనులు తుది దశలో నిలిచిపోవడంతో వసతి కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు పాఠశాలలే కాదు.. జిల్లాలో అన్ని మండలాల్లో సుమారు 240 భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా వున్నాయి. ఇటువంటి పరిస్థితి దేవరాపల్లి, కె.కోటపాడు, రోలుగుంట, రావికమతం, నాతవరం, గొలుగొండ మండలాల్లోని శివారు గ్రామాల్లో అధికంగా వుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో అసంపూర్తి భవన నిర్మాణాలపై సమగ్ర శిక్ష ఇంజనీరింగ్‌ విభాగం ఈఈ నరసింగరావును ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి వివరణ కోరగా... అవసరమైన నిధులు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదిక అందజేశామని తెలిపారు. పరిపాలన పరమైన ఆమోదం లభించిన వెంటనే పనులు చేపట్టి పూర్తిచేస్తామన్నారు.

Updated Date - Nov 30 , 2025 | 12:54 AM