ఎక్కడ పనులు అక్కడే
ABN , Publish Date - Dec 15 , 2025 | 01:16 AM
నగర శివారు ప్రాంతాల్లో సెంటు భూమిలో ఇళ్ల నిర్మాణాలు అటకెక్కాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు అందకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. ఆయా లేఅవుట్‌లలో పనులుచేసే బిహార్ కూలీలు సొంత ఊళ్లకు పయనమయ్యారు. సుమారు నాలుగు నెలలుగా బిల్లులు అందకపోవడంతో అప్పులు ఇచ్చిన వారి నుంచి పలువురు కాంట్రాక్టర్లు తప్పించుకు తిరుగుతున్నారు.
హౌసింగ్ లేఅవుట్‌ల నుంచి ఇళ్లకు బిహారీ కూలీలు
నాలుగు నెలలుగా పెండింగ్‌లో బిల్లులు
పనులు చేయలేక చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు
ఇప్పటివరకు రూ.90 కోట్ల బకాయిలు
బిల్లులు మంజూరుపై ఉన్నతాధికారుల కొర్రీలు
విశాఖపట్నం/ఆనందపురం/ ఉక్కు టౌన్‌షిప్,
నగర శివారు ప్రాంతాల్లో సెంటు భూమిలో ఇళ్ల నిర్మాణాలు అటకెక్కాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు అందకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. ఆయా లేఅవుట్‌లలో పనులుచేసే బిహార్ కూలీలు సొంత ఊళ్లకు పయనమయ్యారు. సుమారు నాలుగు నెలలుగా బిల్లులు అందకపోవడంతో అప్పులు ఇచ్చిన వారి నుంచి పలువురు కాంట్రాక్టర్లు తప్పించుకు తిరుగుతున్నారు.
ప్రధానంగా పెట్రోల్‌బంకులు, హార్డవేర్ షాపులు, కిరాణా దుకాణాలకు భారీగా బకాయిలు పడ్డారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బిల్లులు రాకపోవడంతో ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ప్రభావం పడింది. వర్షాలు తగ్గడంతో పనులు ముమ్మరంగా సాగాల్సిన సమయంలో కూలీలను కొనసాగించలేక కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు.
వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని కలెక్టర్ ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. రోజుకు కనీసం 200 ఇళ్లు పూర్తి, మరికొన్ని ఇళ్ల నిర్మాణంలో పురోగతి ఉండాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుకావని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. హౌసింగ్ ఉన్నతాధికారుల తీరు ప్రభుత్వ పాలనపై పడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇళ్లు పూర్తిచేయాలని మరోవైపు లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
ఆప్షన్-3 కింద జిల్లాలో 65 లేఅవుట్‌లలో 1,14,821 ఇళ్లు కేటాయించగా వాటిలో 80,400 ఇళ్లు మంజూరుచేశారు. ఇప్పటివరకు 33,392 పూర్తిచేశారు. మిగిలిన 47,008 వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో 3,692 ఇళ్లకు కోలమ్స్ వేయగా 18,481 ఇళ్లకు పునాదులు వేశారు. మరో 12,300 ఇళ్లు బేస్‌మెంట్ స్థాయికి వెయ్యి ఇళ్లు గోడలు వరకు, నాలుగువేల ఇళ్లు రూఫ్‌స్థాయికి, స్లాబ్ వేసేందుకు ఏడువేల ఇళ్లు ఉన్నాయి. ఇంకా 34వేల ఇళ్లు మంజూరుచేయాల్సి ఉంది. మొత్తం 65 లేఅవుట్‌లలో పనులకు సంబంధించి రూ.90 కోట్ల వరకు బిల్లులు ఇవ్వాల్సి ఉందని అంచనావేస్తున్నారు. నాలుగు నెలల నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోడంతో పనులపై ప్రభావం పడింది.
మాట తప్పిన అధికారులు
బిల్లులు ఇస్తామని హౌసింగ్ అధికారుల భరోసాతో గత నెల రెండో వారం వరకు నెమ్మదిగా పనులు చేశారు. ఆ తరువాత కూలీల నుంచి ఒత్తిడి రావడంతో కాంట్రాక్టర్లు లేఅవుట్‌లకు వెళ్లక వర్క్ ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులతో పనులు చేయించారు. అయినా చెల్లింపులు లేకపోవడంతో కూలీలు సొంత రాష్ట్రానికి పయనమయ్యారు. ప్రతి లేఅవుట్‌లో మిషనరీ, మెటీరియల్ కాపలా కోసం కొంతమంది స్థానిక కూలీలను నియమించుకుని చిన్నపాటి పనులు చేస్తున్నారు. ఒకే చోట వందల మంది కూలీలతో పనులకు కాంట్రాక్టర్లు వెనుకంజవేశారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్ల నుంచి ఒత్తిడి రావడంతో గత నెలలో హౌసింగ్ అధికారులు యాప్‌ను రూపొందించి లేఅవుట్ వారీగా పనుల పురోగతి వివరాలు అప్‌లోడ్ చేయమన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఇళ్ల పురోగతిని దశలవారీగా యాప్‌లో అప్‌లోడ్ చేశారు. కాంట్రాక్టర్లు హౌసింగ్ మంత్రి కొలుసు పార్థసారధి దృష్టికి సమస్యను తీసుకెళ్లగా బిల్లులు మంజూరుచేయాలని ఆదేశించారు. అయినా హౌసింగ్ ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలున్నాయి. వచ్చే ఏడాది ఉగాదికి ఐదు లక్షల ఇళ్లను ప్రారంభిస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో విశాఖ జిల్లాలో ఇళ్ల నిర్మాణాల పూర్తిపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇళ్లు పూర్తిచేస్తే గృహప్రవేశాలు చేద్దామని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.