సింహగిరి దుర్ఘటనపై పూర్తిస్థాయి విచారణ ఎప్పుడు?
ABN , Publish Date - May 25 , 2025 | 01:17 AM
అప్పన్న చందనోత్సవం రోజున గోడ కూలి ఏడుగురు మరణించిన ఘటనపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ పూర్తిస్థాయి నివేదిక సమర్పించేందుకు ఇంకా విచారణ ప్రారంభించలేదు.
ఇక మిగిలింది ఐదు రోజులే...
ఈ నెల మొదటి వారంలో అధికారులు సమర్పించింది ప్రాథమిక నివేదికే...
ముగ్గురిపై క్రిమినల్ కేసులు నమోదైనా తదుపరి చర్యలు శూన్యం
ముందస్తు బెయిల్‌కు యత్నాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
అప్పన్న చందనోత్సవం రోజున గోడ కూలి ఏడుగురు మరణించిన ఘటనపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ పూర్తిస్థాయి నివేదిక సమర్పించేందుకు ఇంకా విచారణ ప్రారంభించలేదు. సింహగిరిపై గత నెల 30వ తేదీన ప్రమాదం జరగ్గా అదేరోజు ప్రభుత్వం ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీని వేసింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్‌కుమార్, నీటి పారుదల శాఖ సీఈ వెంకటేశ్వరరావు, ఈగల్ ఐజీ రవికృష్ణలను నియమించగా వారు ఆ మరుసటిరోజే విశాఖపట్నం వచ్చి విచారణ చేపట్టారు. మూడు రోజులు ఇక్కడే ఉండి, అందరినీ విచారించి ఈ నెల ఐదో తేదీన ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించారు. వెంటనే ప్రభుత్వం ఆ ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ ఏడుగురు అధికారులను సస్పెండ్ చేసింది. వారిలో దేవస్థానం ఇన్‌చార్జి ఈఓ కె.సుబ్బారావు, ఈఈ డీజీ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈఈ కేఎస్‌ఎన్ మూర్తి, జేఈ కె.బాబ్జీలతో పాటు ఏపీటీడీసీకి చెందిన కె.రమణ (ఈఈ), ఏబీవీఎల్‌ఆర్ స్వామి (డిప్యూటీ ఈఈ), పి.మదన్‌మోహన్ (ఏఈ) ఉన్నారు. కాంట్రాక్టర్ కె.లక్ష్మీనారాయణ (లక్ష్మణరావు)తో పాటు ఈఈ శ్రీనివాసరాజు, రమణలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆ ముగ్గురు అధికారులపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదుచేశారు. వారిని పిలిచి విచారించి, అవసరమైతే అరెస్టు చేయాల్సి ఉంది. సుమారు ఇరవై రోజులు కావస్తోంది. దీనిపై పోలీసుల నుంచి పెద్దగా స్పందన లేదు. కేసులు నమోదైన అధికారులు ముందస్తు బెయిల్ కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
పూర్తి విచారణ ఎప్పుడు?
నెల రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని త్రిసభ్య కమిటీని ప్రభుత్వం ఆనాడే కోరింది. అందుకు మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు ఇక్కడే ఉన్న కమిటీ సభ్యులు ఆ తరువాత విజయవాడ వెళ్లిపోయారు. పూర్తిస్థాయి విచారణకు ఇక్కడికి రాలేదు. ఎవరినీ సంప్రతించలేదు. దేవస్థానంలో కేంద్ర ప్రభుత్వ పథకం ‘ప్రసాద్’ పనులు సవ్యంగా జరగడం లేదని, వాటికి సంబంధించి ముందుగా అనుకున్న మాస్టర్ ప్లాన్‌ను మార్చారని, దానికి ఉన్నతాధికారుల ఆమోదం లేదని కూడా అప్పుడే గుర్తించారు. ఇప్పటికీ ఆ పనుల్లో పురోగతి లేదు. ఆ పనులను పర్యవేక్షిస్తున్న ఆరుగురు ఇంజనీరింగ్ అధికారులను సస్పెండ్ చేయడంతో వాటిని ముందుకు నడిపించేవారు లేరు. వేరొకరికి అదనపు బాధ్యతలు అప్పగించినా, మార్పు చేసిన ప్లాన్‌కు ఆమోదం లేనందున ముందుకు వెళ్లలేకపోతున్నారు. అదొక్కటే కాకుండా చందనోత్సవం నిర్వహణలో అనేక లోపాలు బయటపడ్డాయి. టికెట్ల విక్రయాలు, దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం వంటి అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి ఏటా ఈ ఉత్సవం వైఫల్యాలపై ప్రభుత్వానికి నివేదికలు సమర్పించడం తప్పితే అటు నుంచి ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఇక్కడి అధికారులు, సిబ్బందిలో భయం లేకుండా పోయింది. ఇప్పుడు కూడా గోడ కూలి ఏడుగురు మరణించడం వల్ల చర్యలు చేపట్టారే తప్ప ఉత్సవ నిర్వహణలో లోపాలకు సంబంధించి ఎటువంటి విచారణ జరగలేదు. చర్యలూ లేవు. ప్రభుత్వం తాత్కాలిక నివేదిక చర్యలతో ఆగిపోకుండా పూర్తి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. చందనోత్సవం అంటే అధికారులు అత్యంత జాగ్రత్తగా పనిచేసేలా చర్యలు చేపట్టాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.