Share News

పంచగ్రామాల భూ సమస్యకు పరిష్కారమెన్నడో?

ABN , Publish Date - Dec 27 , 2025 | 01:02 AM

సింహాచలం దేవస్థానం పంచ గ్రామాల భూ సమస్య ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అనే చందంగా ఉంది. ప్రజలు ఆక్రమించుకున్న భూములకు ప్రత్యామ్నాయంగా భూములు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించి ఏడాది కావస్తోంది.

పంచగ్రామాల భూ సమస్యకు పరిష్కారమెన్నడో?

సింహాచలం దేవస్థానానికి ప్రత్యామ్నాయంగా భూములు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధం

నాలుగు ప్రాంతాల్లో 610 ఎకరాలు గుర్తింపు

దేవదాయ శాఖ ద్వారా న్యాయస్థానానికి అఫిడవిట్‌

గతం కంటే నిర్మాణాల సంఖ్య భారీగా పెరగడంతో నిర్ణయం సానుకూలంగా వస్తుందో లేదోననే అనుమానాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సింహాచలం దేవస్థానం పంచ గ్రామాల భూ సమస్య ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అనే చందంగా ఉంది. ప్రజలు ఆక్రమించుకున్న భూములకు ప్రత్యామ్నాయంగా భూములు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించి ఏడాది కావస్తోంది. దీనికి దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్‌గజపతిరాజు సూత్రప్రాయంగా అంగీకరించారు. ప్రతిపాదన సమ్మతమేనంటూ దేవదాయ శాఖ ద్వారా హైకోర్టుకు నివేదిక సమర్పించారు. అక్కడే కేసు ఆగిపోయింది. అనుకూలంగా నిర్ణయం వస్తుందా?...అనే దానిపై అనుమానాలు ఉన్నాయి.

అడవివరం, పురుషోత్తపురం, చీమలాపల్లి, వెంకటాపురం, వేపగుంటలను పంచ గ్రామాలుగా వ్యవహరిస్తున్నారు. జమిందారీ చట్టం రద్దు అయినప్పుడు ఈ గ్రామాల్లో తమకు వంశపారంపర్యంగా వచ్చిన భూములను విజయనగరం రాజులు సింహాచలం దేవస్థానానికి రాసిచ్చేశారు. ఈ ఐదు గ్రామాలు భీమిలి, విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. దేవస్థానం భూముల్లో కొన్ని దశాబ్దాల క్రితం రైతులు తోటలు వేసుకొని జీవనోపాధి పొందేవారు. నగరం విస్తరించడంతో వారి నుంచి కొందరు ఆ భూములను కొనుగోలు చేశారు. మరికొందరు ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారు. వాటిని క్రమబద్ధీకరణ చేయాలని కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నం జరుగుతోంది. 2008లో సర్వే నిర్వహించి 12,149 నిర్మాణాలు ఉన్నాయని, వాటి విస్తీర్ణం 420 ఎకరాలుగా నిర్ధారించారు. తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లో వీటిని క్రమబద్ధీకరించేందుకు ముందుకొచ్చింది. ప్రాంతాల వారీగా భూమి ధర నిర్ణయించి, ఆక్రమించిన స్థలానికి దేవస్థానానికి డబ్బులు చెల్లించాలని 578 నంబరుతో జీఓ ఇచ్చింది. అప్పుడు సుమారు 6,110 మంది క్రమబద్ధీకరణకు దరఖాస్తులు సమర్పించారు. కొన్నింటినే అధికారులు ప్రాసెస్‌ చేశారు. ఆ సమయంలో న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు కావడంతో మిగిలినవి పెండింగ్‌లో ఉండిపోయాయి.

రాష్ట్ర విభజన తరువాత 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తొలి కేబినెట్‌ మీటింగ్‌ పెట్టినప్పుడు ఈ అంశంపై చర్చించింది. దేవస్థానానికి ప్రత్యామ్నాయంగా 547 ఎకరాలు ఇస్తామని ప్రతిపాదించింది. దేవస్థానం ధర్మకర్త అశోక్‌గజపతిరాజు అంత సుముఖత వ్యక్తంచేయలేదు. ఆ తరువాత మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు ప్రారంభించింది. విశాఖ నగర శివార్లలోనే భూములు ఇస్తామని మరో ప్రతిపాదన చేసింది. దీనికి ఈసారి అశోక్‌గజపతిరాజు అంగీకారం తెలిపారు. దేవదాయ శాఖ ద్వారా హైకోర్టులో సమ్మతమేనంటూ నివేదిక సమర్పించారు. న్యాయస్థానం తీర్పు కోసం వేచి ఉన్నామని ప్రజా ప్రతినిధులు, అధికారులు చెబుతున్నారు.

అక్కడే పడింది మెలిక

హైకోర్టుకు దేవదాయ శాఖ సమర్పించిన నివేదికలో కొన్ని అంశాలు పంటి కింది రాళ్లలా తగులుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. తొలుత ప్రభుత్వం ప్రతిపాదించినప్పుడు దేవస్థానం భూముల్లో 12 వేల నిర్మాణాలే ఉన్నాయని, ఇప్పుడు వాటి సంఖ్య 50 వేలకు చేరిందని దేవదాయ శాఖ పేర్కొన్నట్టు సమాచారం. అంతేగాకుండా నాడు చిన్న చిన్న గృహాలు ఉంటే ఇప్పుడు వాటి స్థానంలో బహుళ అంతస్థులు వచ్చాయని సర్వే నంబర్ల వారీగా కొన్ని కేస్‌ స్టడీలు కూడా సమర్పించినట్టు తెలిసింది. ఇవి హైకోర్టు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయేమోని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

అడ్డం పడడానికికేసు?

దేవస్థానంలో భూముల వ్యవహారాలు చూసే ఒక అధికారి శారదాపీఠం స్వామికి అనుంగ శిష్యుడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దేవస్థానం వదిలి పీఠంలోనే విధులు నిర్వహించేవారు. అప్పుడు పీఠాధిపతికి చెప్పి, మిగిలిన పీఠాలతో కలిసి సింహాచలం దేవస్థానం భూములను ప్రభుత్వం నచ్చినట్టు ఉపయోగించుకోవడానికి వీల్లేదంటూ ఒక కేసు వేయించినట్టు తెలిసింది. అది కూడా ఈ భూ సమస్య పరిష్కారానికి అడ్డంకిగా ఉందని చెబుతున్నారు.

ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఇస్తామని చెప్పిన భూములు

------------------------------------------------------------------------------------

గ్రామం భూమి మార్కెట్‌ విలువ

-------------------------------------------------------------------------------------

గాజువాకలో 91.1 ఎకరాలు. రూ.970 కోట్లు

మల్కాపురంలో 293.54 ఎకరాలు. రూ.2,415.24 కోట్లు

పెదగంట్యాడలో 166.2 ఎకరాలు. రూ.1,206.61 కోట్లు

గుల్లపాలెంలో 60.05 ఎకరాలు రూ.639.41 కోట్లు

------------------------------------------------------------------------------------

మొత్తం 610.89 ఎకరాలు రూ.5,231.01 కోట్లు

---------------------------------------------------------------------------------------

Updated Date - Dec 27 , 2025 | 01:02 AM