తాచేరుపై వంతెన నిర్మాణం ఎప్పుడో?
ABN , Publish Date - Apr 21 , 2025 | 12:51 AM
మండలంలోని విజయరామరాజుపేట వద్ద తాచేరు నదిపై వంతెన కూలిపోయి పదహారు నెలలైనప్పటికీ కొత్త వంతెన నిర్మాణానికి అతీగతీ లేదు. తాత్కాలికంగా నిర్మించిన డైవర్షన్ రోడ్డు వర్షా కాలంలో వరద నీటితో మునిగిపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది.
16 నెలల క్రితం కూలిన పాత బ్రిడ్జి
వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం
నెల రోజుల తరువాత తాత్కాలికంగా డైవర్షన్ రోడ్డు నిర్మాణం
గత ఏడాది వరద ధాటికి కొట్టుకుపోయిన రోడ్డు
ప్రతిపాదనల్లోనే కొత్త వంతెన నిర్మాణం
బుచ్చెయ్యపేట, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని విజయరామరాజుపేట వద్ద తాచేరు నదిపై వంతెన కూలిపోయి పదహారు నెలలైనప్పటికీ కొత్త వంతెన నిర్మాణానికి అతీగతీ లేదు. తాత్కాలికంగా నిర్మించిన డైవర్షన్ రోడ్డు వర్షా కాలంలో వరద నీటితో మునిగిపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. విశాఖ, అనకాపల్లి, చోడవరం వైపు నుంచి మాడుగుల, పాడేరు వైపునకు వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి కావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
బుచ్చెయ్యపేట మండలంలో వడ్డాది నుంచి చోడవరం వైపు వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డులో విజయరామరాజుపేట వద్ద తాచేరు నదిపై బ్రిటీష్ హయాంలో వంతెన నిర్మించారు. వంతెన సామర్థ్యం 30 టన్నులు. కానీ 60-70 టన్నుల బరువైను గ్రానైట్ రాళ్లను రవాణా చేసే వాహనాలు ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగించడంతో బలహీనంగా మారి శిథిలావస్థకు చేరింది. ఈ విషయం ఆర్‌అండ్‌బీ అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ అధిక లోడుతో వెళ్లే వాహనాలను నియంత్రించలేకపోయారు. అంతా అనుకున్నట్టే 2023 డిసెంబరు 20న వంతెన కూలిపోయింది. దీంతో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలోకి మళ్లించాల్సి వచ్చింది. సుమారు నెల రోజుల తరువాత నదికి అడ్డగా సిమెంట్ తూములు వేసి, వాటిపై గ్రావెల్ పోసి కాజ్‌వే నిర్మించారు. ఇది లోతట్టుగా ఉండడంతో నదిలో నీటి ప్రవాహం పెరిగితే రోడ్డు పైనుంచి నీరు పారుతున్నది. గత ఏడాది వర్షాకాలంలో వరద ధాటికి గ్రావెల్‌తోపాటు తూములు కూడా కొట్టుకుపోయాయి. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. అధికారులు కొత్తగా తూములువేసి, గ్రావెల్‌తో డైవర్షన్ రోడ్డును పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో గత ఏడాది జూన్ 17న ఎంపీ సీఎం రమేశ్, చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్.రాజు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు ఇక్కడకు వచ్చి పరిశీలించారు. కొత్త వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. కాగా వడ్డాది నుంచి చోడవరం మండలం వెంకన్నపాలెం జంక్షన్ వరకు కొత్త కల్వర్టులు నిర్మించాల్సి వుందని, వీటితోపాటు తాచేరు నదిపై కొత్తవంతెన నిర్మాణానికి రూ.5 కోట్లతో ప్రతిపాదలు తయారు చేసి పంపామని ఆర్‌అండ్‌బీ చోడవరం ఏఈ సత్యప్రసాద్ తెలిపారు. అనుమతులు వచ్చిన వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి వంతెన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.