డిగ్రీ ప్రవేశాలు ఎప్పుడు?
ABN , Publish Date - Jun 26 , 2025 | 01:07 AM
సాధారణ డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఇంటర్ పరీక్షా ఫలితాలు వెలువడి రెండు నెలలు కావస్తున్నప్పటికీ డిగ్రీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ కాలేదు. అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియక పలువురు విద్యార్థులు కళాశాలల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
రెండునెలల నుంచి నిరీక్షిస్తున్న విద్యార్థులు
ఏప్రిల్‌లో ఇంటర్ ఫలితాలు వెల్లడి
ఇంతవరకు నోటిఫికేషన్ విడుదల చేయని ఉన్నత విద్యా శాఖ అధికారులు
ఇంజనీరింగ్ కౌన్సెంగ్ మొదలైతే డిగ్రీలో ప్రవేశాలపై ప్రభావం
నర్సీపట్నం, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): సాధారణ డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఇంటర్ పరీక్షా ఫలితాలు వెలువడి రెండు నెలలు కావస్తున్నప్పటికీ డిగ్రీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ కాలేదు. అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియక పలువురు విద్యార్థులు కళాశాలల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరికకు కౌన్సెలింగ్ మొదలైతే.. ఆ ప్రభావం బీఎస్సీ, బీఏ, బీకాం వంటి సాధారణ కోర్సులు నిర్వహిస్తున్న కళాశాలలపై పడుతుందని ఆయా కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు. పాడేరు, చింతపల్లి తదితర గిరిజన ప్రాంతాలతోపాటు, మైదాన ప్రాంతంలో నర్సీపట్నం, చోడవరం, పాయకరావుపేట నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో ఇంటర్ పాసైన పలువరు విద్యార్థులు నర్సీపట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరడానికి వస్తున్నారు. అయితే ప్రవేశాలకు షెడ్యూల్ రాకపోవడంతో కళాశాల సిబ్బంది, ఆయా విద్యార్థుల పేర్లు, ఫోన్ నంబర్లు తీసుకొని పంపిస్తున్నారు.
డబుల్ మేజర్ సబ్జెక్టుకి మార్పు
డిగ్రీ కోర్సులో గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానాన్ని డబుల్ మేజర్ సబ్జెక్టుకి మార్చడానికి ఉన్నత విద్యా శాఖ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిసింది. అయితే దీనిపై ఇంకా తర్జనభర్జనలు సాగుతున్నాయి. అదే విధంగా డిగ్రీ ప్రవేశాలు ఆఫ్‌లైన్‌లో చేయాలా లేకపోతే ఆన్‌లైన్‌లో చేయాలా? అన్న దానిపై ఉన్నత విద్యా శాఖ అధికారులు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఉన్నత విద్యాశాఖ విధాన పరమైన నిర్ణయాల్లో జాప్యం కారణంగా ఇంటర్ పాసై, సాధారణ డిగ్రీలో చేరాలనుకున్న విద్యార్థులు రెండు నెలల నుంచి ఖాళీగా వుంటున్నారు. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో రెండు, మూడు సంవత్సరాలకు మాత్రమే బోధన జరుగుతున్నది. ఫస్టియర్ పాఠాలు బోధించాల్సిన పీరియడ్‌లలో అధ్యాపకులు ఖాళీగా వుంటున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ఎంట్రెన్స్ పరీక్షలో ఆశించిన ర్యాంకు రాని విద్యార్థులు సాధారణ డిగ్రీ కోర్సుల్లో చేరడానికి మొగ్గు చూపుతుంటారు. అయితే జూలై మొదటి వారంలోపు డిగ్రీ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల కాకపోతే ఆయా విద్యార్థుల్లో పలువురు ఇంజనీరింగ్ లేదా ఫార్మా కోర్సుల్లో చేరే అవకాశాలు వున్నాయని నర్సీపట్నంలో ఒక ప్రైవేటు డిగ్రీ కళాశాల నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్ ఫలితాలు వెలువడిన వెంటనే డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తే కళాశాలల్లో ఎక్కువ సీట్లు భర్తీ అయ్యే అవకాశం వుంటుందని అంటున్నారు.