Share News

దారికి వచ్చేదెన్నడో?

ABN , Publish Date - Oct 05 , 2025 | 10:29 PM

జిల్లా కేంద్రం పాడేరు నుంచి పెదబయలు మీదుగా ముంచంగిపుట్టు మండలానికి వెళ్లే మెయిన్‌రోడ్డు గోతులమయం కావడంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు.

దారికి వచ్చేదెన్నడో?
పాడేరు- పెదబయలు మార్గంలో పెదబయలుకు సమీపంలోని రోడ్డు దుస్థితి

అధ్వానంగా పాడేరు- ముంచంగిపుట్టు మెయిన్‌ రోడ్డు

మొత్తం 54 కిలోమీటర్లలో 30 కిలోమీటర్ల రోడ్డు గోతులమయం

పెదబయలుకు అటు, ఇటు ఆరు కిలోమీటర్ల రహదారి మరీ ఘోరం

రాకపోకలకు డ్రైవర్లు, ప్రయాణికుల అవస్థలు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లా కేంద్రం పాడేరు నుంచి పెదబయలు మీదుగా ముంచంగిపుట్టు మండలానికి వెళ్లే మెయిన్‌రోడ్డు గోతులమయం కావడంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. అలాగే పెదబయలు మండల కేంద్రానికి అటు, ఇటూ మూడు కిలోమీటర్ల రోడ్డు మరింత అధ్వానంగా ఉండడంతో వాహనచోదకులు ప్రమాదానికి గురవుతున్నారు.

పాడేరు నుంచి ముంచంగిపుట్టుకు 54 కిలోమీటర్లు కాగా, అందులో 30 కిలోమీటర్ల రోడ్డు గోతులమయంగా మారింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణం దుర్లభంగా ఉంది. పాడేరు నుంచి పెదబయలు మండలంలోని గంపరాయి, తురకలవలస, చుట్టుమెట్ట, అరడకోట, అడుగులపుట్టు, బంగారుమెట్ట, పన్నెడ, పెదబయలు, చట్రాయిపుట్టు, తమరాడ, ముంచంగిపుట్టు మండలంలో బంగారుమెట్ట, కిలగాడ, వనబసింగి, చోటముకిపుట్టు ప్రాంతాల్లో రోడ్డు దారుణంగా ఉంది. దీనికి తోడు ఎడతెరిపి లేని వర్షాలతో ఆయా గోతుల్లో వర్షపు నీరు చేరడంతో రాకపోకలు సాగించడం కష్టంగా ఉందని పలువురు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే... పెదబయలు మండల కేంద్రానికి అటు మూడు, ఇటు మూడు కిలోమీటర్ల రోడ్డును గత ఎనిమిదేళ్లుగా కనీస మరమ్మతులు చేయకుండా వదిలేశారు. పాడేరు నుంచి ముంచంగిపుట్టు మండల కేంద్రం వరకు ఉన్న మెయిన్‌రోడ్డు మొత్తం 54 కిలోమీటర్లు. ఈ మెయిన్‌ రోడ్డు పనులను ఎనిమిదేళ్ల క్రితమే రోడ్లు, భవనాల శాఖ ద్వారా సుమారుగా రూ.45 కోట్ల వ్యయంతో చేపట్టారు. కానీ పెదబయలు మండల కేంద్రం నుంచి పాడేరు వైపునకు మూడు కిలోమీటర్లు, ముంచంగిపుట్టు వైపు మరో మూడు కిలోమీటర్ల రోడ్డును నిర్మించలేదు. దీంతో ఈ ఆరు కిలోమీటర్ల రోడ్డు గత ఏడేళ్లుగా గతుకులు, రోడ్డు అంచుల కోతతో అధ్వానంగానే ఉంది. ఆఖరుకు మండల కేంద్రం పెదబయలులోని రోడ్డు సైతం మెరుగుపడలేదు. గత ఐదేళ్లు వైసీపీ అఽధికారంలో ఉండగా ఈ రోడ్డును మెరుగుపరిచేందుకు ఎటువంటి కృషి జరగకపోగా, ప్రస్తుత ప్రభుత్వంలోనూ అదే దుస్థితి కొనసాగడం గమనార్హం.

నిత్యం నరకం చూస్తున్న డ్రైవర్లు, ప్రయాణికులు

పాడేరు నుంచి పెదబయలు మీదుగా ముంచంగిపుట్టు, జోలాపుట్టు, అటుగా ఒడిశా రాష్ట్రానికి రాకపోకలు సాగిస్తున్న డ్రైవర్లు, ప్రయాణికులు నిత్యం నరకం చూస్తున్నారు. మొత్తం రోడ్డు గతుకులతో పాటు పెదబయలు మండలం బంగారుమెట్ట నుంచి మండల కేంద్రానికి ఉన్న మూడు కిలోమీటర్లు, అలాగే పెదబయలు నుంచి ముంచంగిపుట్టు వెళ్లే మరో మూడు కిలోమీటర్ల మెయిన్‌ రోడ్డు గతుకులతో పాటు రోడ్డు అంచులు సైతం బాగా కోతకు గురయ్యాయి. దీంతో ఈ రోడ్డుపై వన్‌వే మార్గంలో ప్రయాణించినట్టుగానే వాహనాల రాకపోకలు సాగించాల్సిన దుస్థితి కొనసాగుతున్నది. పొరపాటున నాలుగు చక్రాల వాహనాలు ఎదురెదురుగా వస్తే అంతే సంగతులు, ఇక ద్విచక్ర వాహనానికి ఏదైనా భారీ వాహనం ఎదురుపడితే ఇక అవస్థలు పడాల్సిందే. అలాగే వర్షాలు కురిస్తే ఈ సమస్య మరింత జఠిలమవుతున్నది. రోడ్డు గతుకుల్లో, రోడ్డంచుల్లోని గుంతల్లో వర్షం నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు మరింత ఇబ్బందిగా ఉంటుందని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులకు సైతం స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రయాణికులు అనేక మార్లు విన్నంచుకుంటున్నప్పటికీ ఫలితం దక్కడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 05 , 2025 | 10:30 PM