ఏం చేస్తారో?
ABN , Publish Date - Dec 29 , 2025 | 12:41 AM
ముడసర్లోవ పార్కు సమీపంలో అసంపూర్తిగా నిలిచిపోయిన హార్స్‌రైడింగ్ ప్రాజెక్టును అధికారులు ఏం చేయబోతున్నారనే చర్చ నగరవాసుల్లో జోరుగా సాగుతోంది.
హార్స్‌రైడింగ్ పార్కుపై శేష ప్రశ్నలు
నగర వాసులకు గుర్రపుస్వారీ నేర్పేందుకు అడ్డగోలుగా అనుమతి
వైసీపీ హయాంలో ముడసర్లోవ వద్ద రూ.ఆరు కోట్లతో ప్రాజెక్టు
అప్పటి జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్‌వర్మ అత్యుత్సాహం
నిర్వహణ బాధ్యతలు ప్రైవేటుకు అప్పగించేందుకు ఎత్తుగడ
కూటమి ప్రభుత్వం రాగానే నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు
అప్పటికే కాంట్రాక్టర్‌కు రూ.3 కోట్ల చెల్లింపు
ప్రజాధనం ఎవరి నుంచి రాబడతారని ప్రశ్నిస్తున్న నగరవాసులు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
ముడసర్లోవ పార్కు సమీపంలో అసంపూర్తిగా నిలిచిపోయిన హార్స్‌రైడింగ్ ప్రాజెక్టును అధికారులు ఏం చేయబోతున్నారనే చర్చ నగరవాసుల్లో జోరుగా సాగుతోంది. వైసీపీ హయాంలో జీవీఎంసీ కౌన్సిల్ అనుమతిలేకుండా అప్పటి కమిషనర్ సాయికాంత్‌వర్మ అత్యుత్సాహంతో సుమారు రూ.6 కోట్ల వ్యయంతో హార్స్‌రైడింగ్ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. నగరవాసులకు గుర్రపుస్వారీ నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నామని ప్రకటించారు. దీనిపై తీవ్రస్థాయిలో వ్యతిరేకించినా పట్టించుకోలేదు. అయితే కూటమి అధికారంలోకి రాగానే ప్రాజెక్టు పనులను నిలిపేశారు. తాజాగా ఎంపీ శ్రీభరత్ సందర్శించడంతో పార్కును ఏం చేస్తారనే ఆసక్తి నెలకొంది.
నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలంటే పాశ్చాత్యదేశాల మాదిరిగా గుర్రపుస్వారీని కూడా అందుబాటులో ఉంచాలని జీవీఎంసీ గత కమిషనర్ పి.సాయికాంత్‌వర్మ భావించారు. ముడసర్లోవ పార్కువద్ద కొంతస్థలాన్ని కేటాయించి అందులో ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించారు. దీనికి కౌన్సిల్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ రూ.ఆరు కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణబాధ్యతలను కాంట్రాక్టర్‌కు అప్పగించేశారు. ముడసర్లోవపార్కులో ఎలాంటి కాంక్రీట్‌నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం లేనప్పటికీ గుట్టుచప్పుడుకాకుండా సిమ్మెంట్‌పనులు జరుతుండడంతో పర్యావరణవేత్తలు ప్రభుత్వానికి ఫిర్యాదుచేయడంతో విషయం బయటపడింది. రూ.50లక్షల వ్యయంతో గుర్రపుస్వారీని అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నప్పటికీ రూ.ఆరు కోట్లు వెచ్చించడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అసలు ప్రాజెక్టుకు ఎవరు అనుమతి ఇచ్చారనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.
కౌన్సిల్‌లో నిలదీసిన సభ్యులు
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు దీనిపై నిలదీయడంతో అప్పటి కమిషనర్ సాయికాంత్‌వర్మ ప్రాజెక్టు ఎంతోమంచిదని, పర్యాటకం పెరుగుతుందని వివరించారు. కౌన్సిల్ అనుమతిలేకుండా పనులు ఎలా ప్రారంభిస్తారని సభ్యులు ప్రశ్నించడంతో మేయర్ ముందస్తు అనుమతి ఇచ్చారన్నారు. దీంతో అప్పటి మేయర్ గొలగాని హరివెంకటకుమారి కూడా అవాక్కయ్యారు. తాను గుర్రపుస్వారీ ప్రాజెక్టుకు అనుమతిఇవ్వలేదని వివరణ ఇచ్చారు. ఇద్దరిలో ఎవరుచెప్పింది వాస్తవమో చెప్పాలని సభ్యులు డిమాండ్‌చేసినా సమయాభావంతో సమావేశంలో ఈ అంశం మరుగునపడిపోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతమొత్తంతో గుర్రాలపార్కు ఏర్పాటుచేయాల్సిన అవసరం లేదని సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ప్రాజెక్టునిలిచిపోయింది. అయితే అప్పటికే కాంట్రాక్టర్‌కు రూ.3 కోట్లు చెల్లించేయడంతో ఆ డబ్బును ఎవరినుంచి రివకరీ చేస్తారనే చర్చ జరిగింది. కౌన్సిల్ ఆమోదం లేకున్నా ఆమోదం తెలిపిన అప్పటి మేయర్ హరివెంకటకుమారి, లేదా ఒత్తిడిచేసిన కమిషనర్ సాయికాంత్‌వర్మ నుంచి రికవరీ చేస్తారా? అనేదానిపై స్పష్టత కొరవడింది. ఏడాదిన్నర గడిచినా పనులు నిలిచిపోవడంతో ప్రాజెక్టు మొండిగోడలు, షెడ్‌లతో మిగిలిపోయింది. తాజాగా ఎంపీ శ్రీభరత్ ముడసర్లోవ వెళ్లి పరిశీలించారు. ఆ ప్రాజెక్టుని ఏం చేయాలో అధికారులతో చర్చించారు. దీనిని ఇతర అవసరాలకు వినియోగిస్తారా, ప్రాజెక్టు పూర్తిచేస్తారా లేక రూ.3 కోట్లను రికవరీ చేస్తారా అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.