Share News

కొత్త జిల్లా ఏర్పాటైనా ఫలితమేది?

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:10 PM

పాడేరు కేంద్రంగా ‘అల్లూరి సీతారామరాజు జిల్లా’ ఏర్పాటై మూడున్నరేళ్లు పైబడినప్పటికీ ఇప్పటికీ ఒక్క జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయానికి కూడా సొంత భవనం సమకూరలేదు.

కొత్త జిల్లా ఏర్పాటైనా ఫలితమేది?
కనీస సదుపాయాలు లేని జిల్లా రిజిస్ట్రార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌, అగ్నిమాపక కార్యాలయాలుండే మినీ స్టేడియం భవనం

మూడున్నరేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ పరాయి పంచనే

యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో కలెక్టరేట్‌, ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో ఎస్‌పీ కార్యాలయం

సాకారం కాని కలెక్టరేట్‌ భవన సముదాయ నిర్మాణం

గత వైసీపీ ప్రభుత్వం హడావిడిగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్న వైనం

పెద్దగా మార్పు కనిపించడం లేదని గిరిజనుల అభిప్రాయం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

పాడేరు కేంద్రంగా ‘అల్లూరి సీతారామరాజు జిల్లా’ ఏర్పాటై మూడున్నరేళ్లు పైబడినప్పటికీ ఇప్పటికీ ఒక్క జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయానికి కూడా సొంత భవనం సమకూరలేదు. 2022లో అప్పటి వైసీపీ ప్రభుత్వం హడావిడిగా కొత్త జిల్లా ఏర్పాటులో భాగంగా పలు భవనాల్లో కార్యాలయాలను ప్రారంభించింది. ఇప్పటికీ అవి అలాగే కొనసాగుతున్నాయి.

వాస్తవానికి కొత్త జిల్లాలకు అవసరమైన శాశ్వత భవన నిర్మాణాలకు చ ర్యలు చేపడతామని అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఫలితం దక్కలేదు. అలాగే కలెక్టరేట్‌లో ఉండే కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారి, ముఖ్య ప్రణాళికాధికారి, డ్వామా, డీఆర్‌డీఏ, జిల్లా ఉద్యానవన శాఖ, జిల్లా ఖజానాధికారి కార్యాలయాలకు మాత్రమే ఫర్నిచర్‌, ఇంటర్నెట్‌ సదుపాయాలు కల్పించారు. అలాగే ఒక ఫంక్షన్‌ హాల్లో ఏర్పాటు చేసిన ఎస్‌పీ కార్యాలయానికి ఫర్నిచర్‌, ఇంటర్నెట్‌ సౌకర్యాలున్నాయి. ఇతర జిల్లా కార్యాలయాలకు ప్రభుత్వం నుంచి కనీసం బెంచీ, కుర్చీ వంటివి సైతం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా శాఖలకు చెందిన అఽధికారులే వాటిని సమకూర్చుకున్నారు.

కొత్త జిల్లాకు శాశ్వత అధికారులేరీ?

గత ప్రభుత్వం కొత్త జిల్లా ఏర్పాటు చేసినప్పటికీ పలు జిల్లా అధికారుల పోస్టులకు ప్రత్యేకంగా నియామకాలు జరపకుండా ఇతర ప్రాంతాల్లోని అధికారులను తాత్కాలిక(ఇన్‌చార్జి) పద్ధతిలో నియమించింది. దీంతో ఆయా శాఖల అధికారులు చుట్టపు చూపుగా పాడేరు వస్తున్నారనే ఆరోపణలున్నాయి. అలాగే కలెక్టరేట్‌ మినహా ఇతర జిల్లా కార్యాలయాలన్నీ ఇక్కడున్న డివిజన్‌ కార్యాలయాల్లోనే తమ కార్యకలాపాలను నిర్వహించుకుంటున్నాయి. ఇందుకు జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త కార్యాలయాలనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. స్థానిక పీఎంఆర్‌సీ భవనంలో ఉన్న ఏజెన్సీ డీఈవో కార్యాలయంలోనే జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్ష ఏపీసీ కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. ఇదే పరిస్థితి పలు శాఖలకు చెందిన జిల్లా కార్యాలయాలకు కొనసాగుతున్నది.

మూడున్నరేళ్లు పైబడినా అంతే...

జిల్లా కేంద్రంలో నేటికీ అనేక శాఖలకు చెందిన జిల్లా కార్యాలయాలకు కనీస సదుపాయాలు లేవు. అలాగే ఆయా శాఖలు నిర్వహించే కార్యకలాపాలు సైతం ఇక్కడ అంతగా లేకపోవడంతో అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. తొలి ఏడాదిలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవన సముదాయంలో ఎనిమిది జిల్లా కార్యాలయాలకు గదులను కేటాయించారు. కానీ ఆయా కార్యాలయాలకు ఫర్మిచర్‌, ఇంటర్నెట్‌, ఇతర కనీస సదుపాయాలు లేకపోవడంతో కేవలం రెండు కార్యాలయాలు మాత్రమే అరకొరగా పని చేశాయి. జిల్లా సహకార సంస్థ, జిల్లా ఆడిట్‌ కార్యాలయం, జిల్లా అగ్నిమాపక కార్యాలయం, జిల్లా మైనారిటీ సంక్షేమ కార్యాలయం, ఏపీ మైనారిటీ ఫైనాన్స్‌ కార్యాలయం, జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం, జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం, సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయాలకు భవనాలను కేటాయించారు. తరువాత వాటిని వేర్వేరు భవనాలల్లోకి మార్చారు. వీటిలో జిల్లా సహకార సంస్థ, జిల్లా ఆడిట్‌ కార్యాలయాల సిబ్బంది వాళ్లే సొంతంగా కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేసుకుని తమ కార్యాలయాలను నిర్వహించుకుంటున్నారు. మినీ స్టేడియానికి చెందిన పలు గదుల్లో జిల్లా అగ్నిమాపకాధికారి, జిల్లా రిజిస్ట్రార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌, బీసీ వెల్ఫేర్‌ కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. ఐటీడీఏ కార్యాలయంలోనే జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, జిల్లా పంచాయతీరాజ్‌ అధికారి కార్యాలయాలుండగా, మార్కెట్‌ కమిటీకి చెందిన గోదాము, భవనాల్లోనే జిల్లా వ్యవసాయాధికారి, జిల్లా మార్కెటింగ్‌ అధికారి కార్యాలయాలు, పట్టుపరిశ్రమలకు చెందిన భవనంలో జిల్లా పట్టుపరిశ్రమ అధికారి కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఐసీడీఎస్‌కు చెందిన ఓ గోదాములోనే ఐసీడీఎస్‌ పీడీ కార్యాలయాన్ని నిర్వహించగా, స్థానిక పంచాయతీ కార్యాలయం పైన గదిలో జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని, జిల్లా పరిషత్‌ అతిథిగృహంలో డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, ఎస్‌పీ కార్యాలయాల కార్యకలాపాలు మాత్రమే ప్రజలకు స్పష్టంగా తెలుస్తుండగా, మిగిలిన అనేక జిల్లా కార్యాలయాల్లో ఏమీ జరుగుతుందో తెలియని పరిస్థితి కొనసాగుతున్నది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం మన్యంలోని గిరిజనులకు పాడేరు కేంద్రంగా జిల్లా ఏర్పడినప్పటికీ డివిజన్‌ స్థాయి పాలన సాగుతున్న అనుభూతి మాత్రమే కలుగుతున్నది. ఇన్నాళ్లుగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి నిర్వహించే కార్యకలాపాలను జిల్లా ఏర్పడిన తరువాత జిల్లా కలెక్టర్‌ చేపడుతున్నట్టుగా ఉందని, అంతకు మించి ప్రత్యేకంగా గిరిజనులకు కొత్తగా, అధికంగా ఏమీ ప్రయోజనం కలిగినట్టుగా అనిపించడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Dec 07 , 2025 | 11:10 PM