Share News

దొరగూడకు దారేది?

ABN , Publish Date - Jul 11 , 2025 | 12:46 AM

మండలంలో అత్యంత మారుమూల లక్ష్మీపురం పంచాయతీ దొరగూడ గ్రామానికి వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో పాటు కొండచరియలు పడడంతో రహదారి మూసుకుపోయింది.

దొరగూడకు దారేది?
కొండచరియలు విరిగి రోడ్డుపై పడడంతో అతికష్టమ్మీద రాకపోకలు సాగిస్తున్న వాహనచోదకులు(ఫైల్‌)

భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రహదారి

కొండచరియలు విరిగిపడడంతో రాకపోకలకు ఇబ్బందులు

పక్కా రహదారి నిర్మించాలని గిరిజనుల వేడుకోలు

ముంచంగిపుట్టు, జూలై 10 (ఆంధ్రజ్యోతి): మండలంలో అత్యంత మారుమూల లక్ష్మీపురం పంచాయతీ దొరగూడ గ్రామానికి వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో పాటు కొండచరియలు పడడంతో రహదారి మూసుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది. పాదచారులు కూడా ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.

ఉబ్బెంగుల నుంచి దొరగూడ గ్రామం వరకు సుమారు ఆరేళ్ల క్రితం మట్టి రోడ్డు నిర్మించారు. గతేడాది కురిసిన వర్షాలకు ఆ రహదారి దెబ్బతిన్నది. అయితే అధికారులు మరమ్మతులు చేపట్టలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉన్న ఆరు కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. అలాగే కొండచరియలు విరిగి రహదారికి అడ్డంగా పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డు బురదమయంగా మారడంతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పనుల నిమిత్తం పంచాయతీ కేంద్రానికి వెళ్లాలన్నా, నిత్యావసర సరకుల కోసం జీసీసీ డిపోనకు వెళ్లాలన్నా అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రంలో జరిగే వారపు సంతలకు అటవీ ఉత్పత్తులను తీసుకువెళ్లాలంటే కష్టంగా ఉందని గిరిజనులు వాపోతున్నారు. రహదారి అధ్వానంగా ఉండడం, మత్స్యగెడ్డలు ఉధృతంగా ప్రవహించడం వలన రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దొరగూడకు పక్కా రహదారి నిర్మించాలని ఇప్పటికే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు వినతులు అందించినా ఫలితం లేకపోయిందని ఆ పంచాయతీ సర్పంచ్‌ కె.త్రినాథ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పక్కా రహదారి నిర్మించాలని, మత్స్యగెడ్డ పాయలపై వంతెనల నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Jul 11 , 2025 | 12:46 AM