కమిటీ ఏర్పాటులో ఆంతర్యమేమిటో.!
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:43 AM
స్టీల్‌ప్లాంటులో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రీజనల్ లేబర్ కమిషనర్ (ఆర్‌ఎల్‌సీ) సమక్షంలో మంగళవారం జరిగిన చర్చల్లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు ప్రక్రియపై ఉక్కు యాజమాన్యం ఎటూ తేల్చకుండా ఈ అంశంపై కమిటీ వేస్తామని స్పష్టం చేయడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని కార్మికులు భయాందోళన చెందుతున్నారు.

కాంట్రాక్టు కార్మికుల తొలగింపు ప్రక్రియపై ఎటూ తేల్చని ఉక్కు యాజమాన్యం
తీవ్ర ఆందోళనకు గురవుతున్న కార్మికులు
ఉక్కుటౌన్‌షిప్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): స్టీల్‌ప్లాంటులో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రీజనల్ లేబర్ కమిషనర్ (ఆర్‌ఎల్‌సీ) సమక్షంలో మంగళవారం జరిగిన చర్చల్లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు ప్రక్రియపై ఉక్కు యాజమాన్యం ఎటూ తేల్చకుండా ఈ అంశంపై కమిటీ వేస్తామని స్పష్టం చేయడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని కార్మికులు భయాందోళన చెందుతున్నారు. కాంట్రాక్టు కార్మికుల్లో 30 శాతం మందిని తొలగించాలని ఉక్కు యాజమాన్యం భావించింది. ఈ క్రమంలో గతంలో 2,400 మందిని తొలగించడంతో తీవ్ర స్థాయిలో నాయకులు, కార్మికులు ఉద్యమించడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. తాజాగా మళ్లీ కాంట్రాక్టు కార్మికుల తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టింది. దీంతో కార్మిక నాయకులు యాజమాన్యంతో చర్చించి, ఈ ప్రక్రియను నిలిపివేయకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని, నిరవధిక సమ్మెకు దిగుతామంటూ నోటీసు ఇచ్చారు. ఈ క్రమంలో మంగళవారం ఆర్‌జేసీఎల్ సమక్షంలో కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకులు, ఉక్కు యాజమాన్యం మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు అంశంపై కమిటీ వేస్తామని యాజమాన్యం పేర్కొంది. అంతేగానీ తొలగింపు ప్రక్రియను నిలిపివేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఏ ఒక్క కార్మికుడిని తొలగించవద్దని కార్మిక నాయకులు డిమాండ్ చేయగా, తొలగింపు విధి, విధానాలపై కమిటీ వేస్తామని చెప్పడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని పలువురు కాంట్రాక్టు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగుల తొలగింపే లక్ష్యంగా యాజమాన్యం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సుమారు 1,130 మంది ఉద్యోగులను వీఆర్‌ఎస్ ద్వారా బయటకు పంపనున్నది. ఇప్పుడు కాంట్రాక్టు కార్మికుల తొలగింపు అంశంపై యాజమాన్యం తర్జనభర్జన పడుతుంది. ఇదిలావుండగా ఆర్‌ఎల్‌సీ సమక్షంలో మరోసారి ఉక్కు యాజమాన్యం, కార్మిక నాయకుల మధ్య ఈ నెల 26న చర్చలు జరగనున్నాయి. ఏదిఏమైనా కార్మికుల తొలగింపు ప్రక్రియను నిలిపివేస్తామని స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఏ క్షణమైనా తమపై వేటుపడే ప్రమాదం ఉందని కార్మిక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తుంది.