అసలేం జరుగుతోంది..
ABN , Publish Date - May 12 , 2025 | 12:02 AM
మహా విశాఖ నగరంలో మహిళల అదృశ్యం కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.
మహా నగరంలో అదృశ్యమైపోతున్న మహిళలు
నానాటికీ అధికమవుతున్న మిస్సింగ్ కేసులు
గత నాలుగు నెలల్లో 175 కేసుల నమోదు
వీటిలో 133 మంది ఆచూకీని కనిపెట్టిన పోలీసులు
42 మంది ఆచూకీ ఇప్పటివరకు లభ్యం కాని వైనం
కొన్ని కేసుల్లో వివాహేతర సంబంధాలే కారణం
మరికొందరి అదృశ్యాలు ఇప్పటికీ మిస్టరీయే..
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
మహా విశాఖ నగరంలో మహిళల అదృశ్యం కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొంతమంది మహిళలు అదృశ్యానికి వివాహేతర సంబంఽధాలు, కుటుంబ వివాదాలే కారణమైతే.. మరికొందరి అదృశ్యానికి కారణం మాత్రం కుటుంబ సభ్యులకు సైతం అంతుబట్టకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఏడాది నాలుగు నెలల్లోనే 175 మంది మహిళలు అదృశ్యం కాగా వీరిలో 42 మంది ఆచూకీ ఇప్పటివరకు లభ్యం కాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.
===
‘జిల్లాలోని పద్మనాభం ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల వివాహిత తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఈ నెల 2న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఇంతవరకూ ఆమె ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆమె ఆచూకీ గాలిస్తున్నారు.’
‘పెందుర్తి ప్రాంతానికి చెందిన ఓ వివాహిత కొన్నాళ్ల కిందట పుట్టింటికి వెళ్లొస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి తిరిగి చేరలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం ఎంతగా గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి చివరకు ఆమె ఆచూకీ కనిపెట్టి కుటుంబ సభ్యులకు అప్పగించారు.’
‘మారికవలస వాంబే కాలనీలో నివాసం ఉంటున్న ఓ వివాహిత ఫంక్షన్‌కు వెళ్లొస్తానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించగా, రెండు రోజులు తర్వాత ఆమె మృతదేహం దాకమర్రి వద్ద ఒక లేఅవుట్‌లో సగం కాలిపోయిన స్థితిలో లభ్యమైంది.’
...ఇలా నగరంలో మహిళలు అదృశ్యం కేసులు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో పాటు వివాహేతర సంబంధాలే దీనికి ప్రధాన కారణంగా పోలీసులు చెబుతున్నారు. అదృశ్యమైపోతున్న వారిలో పెళ్లి కావాల్సిన యువతులతోపాటు వివాహమై పిల్లలు ఉన్నవారు సైతం ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వివాహేతర సంబంధం కారణంగా కొందరు ఇంట్లోవారికి చెప్పకుండా ఇతరులతో వెళ్లిపోయి రహస్యంగా జీవనం సాగిస్తున్నారు. మరికొందరు మాత్రం మానసిక రుగ్మతలు, కుటుంబ వివాదాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి చేరడం లేదు. కొన్ని కేసుల్లో మాత్రం భారీగా ఆదాయం వ చ్చే ఉద్యోగం, పని చూపిస్తామంటూ అమాయకులైన మహిళలను మభ్యపెట్టి కొందరు తీసుకువెళ్లి ఇతర దేశాలకు అక్రమ రవాణా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుండడం శోచనీయం. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత నాలుగు నెలల్లో మహిళల అదృశ్యానికి సంబంధించి 175 ఫిర్యాదులు అందగా, వీటిలో 133 మంది ఆచూకీని పోలీసులు గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన 42 మంది ఆచూకీ మాత్రం ఇంతవరకు లభ్యం కాకపోవడంతో వారంతా ఏమైపోయారనే దానిపై వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జనవరి నెలలో 37 మంది , ఫిబ్రవరిలో 49 మంది, మార్చిలో 43 మంది, ఏప్రిల్‌లో 46 మంది మహిళలు కనిపించడం లేదంటూ వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుల్లో పోలీసులకు ఫిర్యాదులు అందిన వాటిలో 42 మందిని ఒకరోజు వ్యవధిలోనే ఎక్కడ ఉన్నారో గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం పోలీసులు మిస్సింగ్ కేసుల దర్యాప్తులో చూపుతున్న శ్రద్ధకు అద్దంపడుతోందనే చెప్పవచ్చు. మరో ఎనిమిది కేసులను మాత్రం కేసు నమోదు చేయడానికి ముందే పోలీసులు వారి ఆచూకీ గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో అదృశ్యమై ఇప్పటికీ ఆచూకీ దొరకని మహిళల పరిస్థితి నెలకొనడంతో అసలేం జరుగుతోందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వారు ఎక్కడైనా జీవించి ఉన్నారా? లేక మృతి చెందారా? అని కుటుంబ సభ్యులు మానసిక వేదనకు గురవుతున్నారు. మహిళలు, యువతుల మిస్సింగ్ కేసులపై పోలీసులు మరింత శ్రద్ధ చూపిస్తే బాధిత కుటుంబాలకు స్వాంతన కలిగించేందుకు అవకాశం కలుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత నాలుగునెలల్లో మహిళల మిస్సింగ్ కేసులు
నెల ఫిర్యాదులు గుర్తించినవి ఆచూకీలేనివి ఒకరోజులో గుర్తించినవి కేసు నమోదుకు ముందే గుర్తించినవి
జనవరి 37 31 6 10 2
ఫిబ్రవరి 49 40 9 13 3
మార్చి 43 33 10 10 1
ఏప్రిల్ 46 29 17 9 2
మొత్తం 175 133 42 42 8