Share News

ఆస్పత్రిలో అసలేం జరుగుతోంది?

ABN , Publish Date - Nov 30 , 2025 | 01:37 AM

కింగ్‌జార్జి ఆస్పత్రి అధికారులు, వైద్యులపై స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణశ్రీనివాస్‌ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.

ఆస్పత్రిలో అసలేం జరుగుతోంది?

కేజీహెచ్‌ అధికారులు, వైద్యులపై ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ అసహనం

పాలన పడకేయడంతోనే తరచూ ఏదో ఒక ఘటన

ఏదైనా జరిగితే ముందు ప్రతిపక్ష నేతలకు సమాచారం ఇస్తున్నారంటూ ఆగ్రహం

ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ఆరోపణ

డీఎంఈ, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళతానని వెల్లడి

విశాఖపట్నం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి):

కింగ్‌జార్జి ఆస్పత్రి అధికారులు, వైద్యులపై స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణశ్రీనివాస్‌ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఆస్పత్రిలో వరుస సంఘటనలు చోటుచేసుకుంటుండడంపై ఆగ్రహం వెలిబుచ్చారు. కార్డియాలజీ విభాగంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించినట్టు సమాచారం అందగానే ఆయన ఆస్పత్రిని సందర్శించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కారణాలను అడిగి తెలుసుకున్నారు. కార్డియాలజీ ఐఎంసీయూలో ఉన్న రోగులను ఇతర వార్డులకు తరలించినట్టు చెప్పడంతో వారి వద్దకు వెళ్లి పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వాణి, ఇతర అధికారుల వద్ద కేజీహెచ్‌లో రోగులకు అందుతున్న సేవలు, వైద్యులు, అధికారుల మధ్య అంతర్గత విభేదాల గురించి ఎమ్మెల్యే ప్రస్తావించారు. కేజీహెచ్‌ అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు సంబంధించిన ఆస్పత్రి అనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. ఆస్పత్రిలో ఇటీవల కాలంలో వరుస ఘటనలు జరుగుతున్నాయని, దీనివల్ల రోగులు ఇబ్బందిపడుతున్నారన్నారు. నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషిచేస్తోందని, ఇలాంటి ఘటనల వల్ల అదంతా వృథా అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఆస్పత్రిలో వైద్యుల మధ్య సమన్వయం లేదని, వర్గాలుగా విడిపోయి ఆధిపత్యం కోసం ఎత్తుకుపైఎత్తులు వేసుకుంటూ రోగులకు సేవ చేయడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆస్పత్రిలో ఒక అధికారి తన విధులను విస్మరించి ఉద్యోగుల బదిలీలకు సంబంధించి వ్యవహారాలపైనే నిమగ్నమై ఉంటున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. ఆస్పత్రిలో పాలన పడకేయడం వల్లనే వరుస ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆస్పత్రిలో ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్‌ దృష్టికి గానీ, స్థానిక ఎమ్మెల్యేనైనా తన దృష్టికి గానీ తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అలాకాకుండా ప్రతిపక్ష నేతలకు సమస్యలను చెప్పి, ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాలని కొందరు చూస్తున్నారని అసహనం వ్యక్తంచేశారు. ఏదైనా ఘటన జరిగితే ముందు ప్రతిపక్ష నేతలకు తెలిసిపోతోందని, తమకు సమాచారం తెలిసి వచ్చేసరికి వారు తిరిగి వెళ్లిపోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ఇటీవల ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే కనీసం తమకు సమాచారం ఇవ్వలేదని, తెలిసిన తర్వాత పునరుద్ధరణ పనులపై దృష్టిపెట్టేలోగా ప్రతిపక్ష పార్టీల నేతలు ఆస్పత్రికి చేరుకుని హడావిడి చేసి, ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు యత్నించారన్నారు. తాజాగా కార్డియాలజీ విభాగంలో అగ్ని ప్రమాదం సమాచారం కూడా వైసీపీ నేతలకే తెలిసిందని, తాము ఆస్పత్రికి వచ్చేసరికి వారు తిరుగుముఖం పట్టడం దీనికి నిదర్శనమని మండిపడ్డారు. ఆస్పత్రిలో జరుగుతున్న వ్యవహారాలు, అధికారుల పనితీరుపై డీఎంఈతోపాటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళతానని హెచ్చరించారు.

Updated Date - Nov 30 , 2025 | 01:37 AM