Share News

సబ్సిడీ రుణాలేవీ?

ABN , Publish Date - Nov 01 , 2025 | 01:23 AM

నిరుద్యోగ యువతకు సబ్సిడీతో కూడిన రుణాలు అందించేందుకు చేపట్టిన ప్రక్రియ ముందుకుసాగడం లేదు.

సబ్సిడీ రుణాలేవీ?

బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల ద్వారా మంజూరుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన కూటమి ప్రభుత్వం

ఈ ఏడాది ఏప్రిల్‌లో దరఖాస్తుల స్వీకరణ

చివరి దశలో బ్రేక్‌

యూనిట్ల సంఖ్యను పెంచాలనే యోచనతోనే అంటున్న అధికారులు

ఐద నెలలు కిందట నిలిచిపోయిన ప్రక్రియ..

ఇప్పటివరకూ ముందుకు కదలని వైనం

విశాఖపట్నం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి):

నిరుద్యోగ యువతకు సబ్సిడీతో కూడిన రుణాలు అందించేందుకు చేపట్టిన ప్రక్రియ ముందుకుసాగడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా వివిధ కులాలకు చెందిన నిరుద్యోగులకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం ఆయా కార్పొరేషన్లకు నిధులు కేటాయించింది. యూనిట్లను మంజూరు చేసేందుకుగాను దరఖాస్తులు స్వీకరించాలని సూచించింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు మార్చి నుంచి ఏప్రిల్‌ వరకు దరఖాస్తులను స్వీకరించారు. మే నెలలో దరఖాస్తుల పరిశీలన పూర్తిచేశారు. బీసీ సంక్షేమ శాఖ అధికారులు అయితే అర్హుల జాబితాలను బ్యాంకులకు పంపించారు. కొద్దిరోజుల్లో వారికి రుణాలు మంజూరవుతాయనుకునే సమయానికి (జూన్‌ నెలలో) ఈ ప్రక్రియను నిలిపివేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది.

జిల్లాలకు కేటాయించిన యూనిట్ల సంఖ్యను పెంచాలనే ఒత్తిడి రావడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సబ్సిడీ రుణాలు ఇవ్వలేదని, దీనివల్ల అర్హులైనవారు వేలాది మంది ఉన్నారని, వారికి మేలు చేసేలా నిర్ణయం తీసుకోవాలని సీఎంను పలువురు ఎమ్మెల్యేలు కోరారు. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఆయన...మరిన్ని యూనిట్లను మంజూరు చేసేందుకు గల అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అందుకు అనుగుణంగా నిధులు మంజూరు చేస్తామని ప్రభుత్వం నుంచి ఆయా శాఖలకు సమాచారం కూడా వచ్చింది. యూనిట్ల సంఖ్య పెరుగుతుండడంతో మరింత మందికి అవకాశం లభిస్తుందని అంతా భావించారు. దరఖాస్తుదారులు కూడా ఆనందం వ్యక్తంచేశారు. అయితే, ఈ ప్రక్రియ నిలిచిపోయి సుమారు ఐదు నెలలు కావస్తున్నా, ఇప్పటికీ తదుపరి ఆదేశాలు రాలేదు. దరఖాస్తుదారుల నుంచి ప్రతిరోజూ ఫోన్లు వస్తున్నాయని, కొందరు కార్యాలయానికి వచ్చి ఎప్పటిలోగా రుణాలు మంజూరవుతాయో చెప్పాలని అడుగుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు.

భారీగా దరఖాస్తులు

రుణాల కోసం జిల్లాలో బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని బీసీ, ఈబీసీ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్లకు 2,368 యూనిట్లను కేటాయించారు. ఆ యూనిట్లకు 18,984 మంది దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్‌కు 406 యూనిట్లు మంజూరుచేయగా, సుమారు తొమ్మిది వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా కేటాయించిన యూనిట్లకు రూ.16.88 కోట్లు వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో రూ.6.68 కోట్లు సబ్సిడీగా అందించనుండగా, బ్యాంకులు రూ.9.35 కోట్లు రుణంగా ఇవ్వనున్నాయి.

Updated Date - Nov 01 , 2025 | 01:23 AM