Share News

ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలెన్నడో.!

ABN , Publish Date - Aug 25 , 2025 | 12:40 AM

రాష్ట్ర వ్యాప్తంగా ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియలో జాప్యం నెలకొంది.

 ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలెన్నడో.!

  • రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 700 మంది విద్యార్థుల ఎదురుచూపులు

  • అనేక కాలేజీలకు అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టుకు వెళ్లిన కాలేజీల యాజమాన్యాలు

విశాఖపట్నం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర వ్యాప్తంగా ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియలో జాప్యం నెలకొంది. ఇందుకోసం సుమారు 700 మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ప్రవేశాల కోసం రాష్ట్ర స్థాయిలో ఏపీపీజీఈసెట్‌, జాతీయ స్థాయిలో జీపాట్‌ (గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ యాటిట్యూడ్‌ టెస్ట్‌) నిర్వహించారు. రెండు నెలల కిందట ఫలితాలు వెలువరించిన అధికా రులు అడ్మిషన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ మేరకు ఆగస్టు ఒకటో తేదీ నాటికి సీట్లను కేటాయించి, ఆగస్టు 11 నుంచి తరగతులు ప్రారంభించాలి. కొన్ని కారణాలతో షెడ్యూల్‌ను వాయిదా వేశారు.

రాష్ట్రంలోని కొన్ని కాలేజీలకు ఫార్మసీ కౌన్సిల్‌ అనుమతులు ఇవ్వలేదు. దీనిపై యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలోనే తొలుత విడుదల చేసిన షెడ్యూల్‌ వాయిదా వేశారని చెబుతున్నారు. కారణాలు ఏవైనా వందలాది మంది విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడంలేదు. దీనిపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతున్నారు. ఈ ఏడాది ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఏపీపీజీఈసెట్‌ను ఉన్నత విద్యా మండలికి ఏయూకు అప్పగించింది. ఈ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఎంతో మంది విద్యార్థులు ఏయూ అధికారులను సంప్రదిస్తున్నారు. అయితే, ఫార్మసీ కౌన్సిల్‌ నుంచి తమకు సమాచారం రాలేదని, ఉన్నతాధికా రులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని ఏయూ అధికారులు చెబుతున్నారు. ఫార్మసీ కౌన్సిల్‌, కాలేజీలకు మధ్య తగాదా తేలనంత వరకు ప్రక్రియ ముందుకు వెళ్లదని మరికొందరు చెబుతున్నారు. ఇదిలా ఉంటే అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమవుతుండడంతో ఎంఫార్మసీలో చేరేందుకు ఎదురుచూస్తున్న విద్యార్థులు ప్రత్నామ్నాయాల వైపు దృష్టిసారిస్తున్నారు. ఎంట్రన్స్‌ రాసిన కొద్దిమంది విద్యార్థులను ఇప్పుడు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, దీనివల్ల అడ్మిషన్లు పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉందని కాలేజీ యాజమాన్య ప్రతినిధులు పేర్కొంటున్నారు.


స్పీడ్‌ పెంచిన షీటీమ్స్‌

పదిరోజుల్లో 76 హోటళ్లలో తనిఖీలు

50 హోటళ్లకు జరిమానా

విశాఖపట్నం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి):

హోటళ్లలో నాణ్యతలేని, నిల్వ ఆహారం విక్రయాలకు అడ్డుకట్టవేసేందుకు జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ‘ఈట్‌రైట్‌ క్యాంపెయిన్‌’ పేరుతో ఏర్పాటు చేసిన శానిటేషన్‌ అండ్‌ హెల్త్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (షీ)టీమ్స్‌ దూకుడు పెంచాయి. నగరంలోని హోటళ్లలో ఆహారకల్తీ, నాణ్యతలేని ఆహారం విక్రయం, నిల్వ ఆహారపదార్థాలను వేడిచేసి ప్రజలకు విక్రయించడం సాధారణ విషయంగా మారిపోయింది. వీటిని తినడంవల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. అప్పుడప్పుడు ఆహార నియంత్రణ మండలి అధికారులు హోటళ్లపై దాడులు చేసినా తర్వాత చర్యలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో హోటళ్ల తీరుమారడం లేదు. దీనిపై ఇటీవల ఫిర్యాదులు పెరగడంతో జీవీఎంసీ కమిషనర్‌ షీ టీమ్స్‌కు రూపకల్పన చేశారు. జీవీఎంసీ పరిధిలోని ఎనిమిది జోన్లలో ప్రజారోగ్యం విభాగంలోని ముగ్గురు ఉద్యోగులతో 16 టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఆయా బృందాలు తమ జోన్‌ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్‌లను నిరంతరం తనిఖీ చేసి ఆహారనాణ్యత, వంటగదిశుభ్రత వంటి అంశాలను పరిశీలిస్తుంది. ఎక్కడైనా కల్తీ జరిగినట్టు, నిల్వ ఆహారం విక్రయిస్తున్నట్టు గుర్తిస్తే అక్కడికక్కడే కేసులు నమోదుచేయడం, శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపిస్తున్నారు. గత పదిరోజుల్లో 76 హోటళ్లలో తనిఖీలు చేసి, 71 హోటళ్లకు నోటీసులు ఇవ్వగా 50 హోటళ్ల నుంచి రూ.68,600 జరిమానా వసూలుచేశారు. జోన్‌-1లో ఎనిమిది చోట్ల తనిఖీలు చేసిన సిబ్బంది మూడు హోటళ్లకు రూ.21 వేలు, రెండో జోన్‌ పరిఽధిలో 11 చోట్ల తనిఖీ చేసి పది చోట్ల రూ.పదివేలు, జోన్‌-3 పరిధిలో 11 చోట్ల తనిఖీలు చేసి, ఐదు చోట్ల రూ.21వేలు, జోన్‌-4పరిధిలో పదిచోట్ల తనిఖీలు నిర్వహించి రూ11వేలు, జోన్‌-5 పరిధిలో మూడు చోట్ల రూ.నాలుగు వేలు, జోన్‌-6 పరిధిలో ఆరు చోట్ల రూ. 7,800, జోన్‌-7 పరిధిలో మూడు చోట్ల రూ.1,300, జోన్‌-8 పరిధిలో పది చోట్ల రూ.11వేలు జరిమానా వసూలుచేశారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగంపైనా దృష్టి సారించి కేసులు నమోదు చేస్తున్నారు.

Updated Date - Aug 25 , 2025 | 12:40 AM